ఆ తర్వాత తీసుకోం.. రూ.2వేల నోట్ల స్వీకరణపై అమెజాన్

ఆ తర్వాత తీసుకోం.. రూ.2వేల నోట్ల స్వీకరణపై అమెజాన్

ప్రముఖ ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ సెప్టెంబర్ 19 నుంచి క్యాష్ ఆన్ డెలివరీ సర్వీస్ లపై రూ.2వేల నోట్లను స్వీకరించడాన్ని నిలిపివేయనుంది. రూ.2వేల నోటును మార్చుకోవడానికి లేదా డిపాజిట్ చేయడానికి గడువు సమీపిస్తున్న తరుణంలో ఈ అప్‌డేట్ ఇచ్చింది. రూ.2వేల నోట్లను మార్చుకునే లేదా డిపాజిట్ చేసుకునే సదుపాయాన్ని కేంద్రం.. సెప్టెంబర్ 30 వరకు సామాన్య ప్రజలకు అవకాశం ఇచ్చింది.

అయితే, థర్డ్-పార్టీ కొరియర్ పార్టనర్ ద్వారా ఆర్డర్ డెలివరీ చేయబడితే రూ.2వేల నోట్లను.. క్యాష్ ఆన్ డెలివరీ కోసం చెల్లుబాటు అయ్యే చెల్లింపు పద్ధతిగా అంగీకరించనుంది. ఇక భారతీయ రిజర్వ్ బ్యాంక్ రూ.2వేల నోట్లను నిలిపివేస్తున్నట్లు మేలోనే ప్రకటించింది. ఈ నోట్లను మార్చుకోవడానికి లేదా డిపాజిట్ చేయడానికి సెప్టెంబర్ 30 వరకు గడువు విధించింది.  

చలామణిలో ఉన్న రూ.2వేల కరెన్సీ నోట్లలో93 శాతం ఇప్పటికే బ్యాంకులకు తిరిగి వచ్చినట్లు సెప్టెంబర్ 1న ఆర్బీఐ వెల్లడించింది. ఆగస్టు 31 వరకు చెలామణి నుంచి తిరిగి వచ్చిన రూ.2వేల నోట్ల మొత్తం విలువ రూ.3.32 లక్షల కోట్లు అని సెంట్రల్ బ్యాంక్ ఒక ప్రకటనలో తెలిపింది. వివిధ బ్యాంకుల నుంచి వచ్చిన సమాచారం ప్రకారం రూ.2వేల డినామినేషన్‌లో ఉన్న మొత్తం నోట్లలో 87 శాతం డిపాజిట్ల రూపంలో ఉండగా, మిగిలిన 13 శాతం ఇతర డినామినేషన్ నోట్లలోకి మార్చబడ్డాయి.