G20 సమ్మిట్ డిన్నర్కు అంబానీ, ఆదానీ

G20 సమ్మిట్ డిన్నర్కు అంబానీ, ఆదానీ

 ఢిల్లీలో సెప్టెంబర్  9, 10 తేదీల్లో జీ-20 స‌ద‌స్సు జరగనుంది. ఈ స‌ద‌స్సుకు ప్రపంచ దేశాధినేత‌లు హాజ‌రు కానున్నారు. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 9వ తేదీన జీ20 సదస్సుకు హాజరయ్యే నేతలకు భారత ప్రభుత్వం విందు ఇవ్వనుంది. ఈ విందుకు భారత  బిలియనీర్లు, ప్రముఖ వ్యాపారవేత్తలను కేంద్ర ప్రభుత్వం ఆహ్వానించింది. ఈ డిన్నర్ లో  ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీ పాల్గొనున్నారు. 

500 మందికి ఆహ్వానం..

సెప్టెంబర్ 9, 10వ తేదీల్లో ఢిల్లీలో జీ20 శికరాగ్ర సమావేశం జరగనుంది. ఈ సదస్సులో ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన ప్రణాళికలను చర్చించనున్నారు. అయితే తొలి రోజు ( సెప్టెంబర్ 9) చర్చల అనంతరం రాత్రి కేంద్ర ప్రభుత్వం  జీ 20  దేశాల అధినేతలతో పాటు..దేశంలోని ప్రముఖులకు విందు ఏర్పాటు చేసింది.  ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో జీ20 సమ్మిట్‌ విందు ఇవ్వనుంది. ఈ విందుకు దేశంలోని 500 మంది వ్యాపారవేత్తలకు  కేంద్రం ఆహ్వానాలను పంపింది.  ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీ, టాటా సన్స్ ఛైర్మన్ ఎన్ చంద్రశేఖరన్, బిలియనీర్ కుమార్ మంగళం బిర్లా, భారతీ ఎయిర్‌టెల్ వ్యవస్థాపకుడు -చైర్మన్ సునీల్ మిట్టల్  వంటి మొత్తం 500 మందికి ఆహ్వానాలు అందాయి. 

విందులో స్పెషల్ ఏంటీ..?

భారతదేశంలో వ్యాపార, పెట్టుబడి అవకాశాలను హైలైట్ చేయడానికి ప్రధాని మోదీకి ఈ  విందు మరో అవకాశాన్ని కల్పించనుంది. ఇక డిన్నర్ కు హాజరయ్యే అతిధుల కోసం మెనూలో భారతదేశం ప్రత్యేక వంటకాలు.. ఇతర మిల్లెట్‌ వంటకాలు ప్రత్యేకంగా ఉంచనున్నారు.

మరోవైపు జీ20 సమ్మిట్ లో అమెరికా అధ్యక్షుడు జో బిడెన్, బ్రిటీష్ ప్రధాని రిషి సునక్, సౌదీ క్రౌన్ ప్రిన్స్ మహ్మద్ బిన్ సల్మాన్, కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో, జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా పాల్గొననున్నారు.  అయితే ఈ  సమావేశానికి చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ రావడం లేదు.