కచ్ ఎడారిలో పోటీ పడుతున్న అంబానీ-అదానీ.. గ్రీన్ ఎనర్జీలో భారీ పెట్టుబడులు.. గెలుపెవరిది..?

కచ్ ఎడారిలో పోటీ పడుతున్న అంబానీ-అదానీ.. గ్రీన్ ఎనర్జీలో భారీ పెట్టుబడులు.. గెలుపెవరిది..?

గుజరాత్ రాష్ట్రంలో కచ్ ఎడారి ప్రాంతంలో ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ అలాగే గౌతమ్ అదానీ సంస్థ మధ్య భారత గ్రీన్ ఎనర్జీ రంగంలో పోటీ వేడెక్కింది. గుజరాత్‌లోని ఈ ఎడారి భూములు సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ వంటి రెన్యూవబుల్ ఎనర్జీకి అత్యుత్తమమైన స్థలాలు కావడంతో.. ఇద్దరు పారిశ్రామికవేత్తలు ప్రస్తుతం ఆ ప్రాంతంలో భారీ పెట్టుబడులు పెడుతున్నారు.

రిలయన్స్ కచ్‌లో సుమారు 5.5 లక్షల ఎకరాల విస్తీర్ణంలో ప్రపంచంలోనే అతిపెద్ద సింగిల్-సైట్ సౌర ప్రాజెక్టును నిర్మిస్తోంది. వాస్తవానికి ఇది మూడు సింగపూర్‌లకు సమానమైన ప్రాంతం.  దీనివల్ల రోజూ 55 మెగావాట్ల సోలార్ మాడ్యూల్స్, 150 మెగావాట్‌-గంటల బ్యాటరీ స్టోరేజ్ సదుపాయాలతో విస్తృత స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి జరగబోతుంది. ఈ ప్రాజెక్టు భవిష్యత్‌లో భారత విద్యుత్ అవసరాల్లో10 శాతం వరకు తీర్చగలదని తెలుస్తోంది. రిలయన్స్ గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి, గ్రీన్ అమోనియా, గ్రీన్ మిథనాల్, గ్రీన్ ఎవియేషన్ ఫ్యూయెల్ వంటి ఎనర్జీ ఉత్పత్తుల తయారీలోనూ ముందొచ్చేందుకు ప్రణాళికలు వేసింది.

ఇక మరోపక్క అదానీ గ్రూప్ ఖవ్దా ప్రాంతంలో 538 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో సోలార్ అండ్ విండ్ ఎనర్జీ హైబ్రిడ్ ప్రాజెక్టును అభివృద్ధి చేస్తోంది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద గ్రీన్  ప్రాజెక్టులలో ఒకటి. ఖవ్దా ప్రాజెక్టులో ఇప్పటికే 5.6 గిగావాట్ల ఎనర్జీ ఉత్పత్తి అవుతుండగా.. 2029 నాటికి 30 గిగావాట్ల శక్తిని నిర్మించడమే లక్ష్యంగా అదానీ ముందుకు సాగుతున్నారు. కట్ చుట్టూ ఉన్న గ్రిడ్ పనితీరు, విద్యుత్ పంపిణీ వ్యవస్థలు అదానీకి బలమైన వెన్నుముకలా నిలుస్తున్నాయని తెలుస్తోంది. 

ఈ రెండు సంస్థలు సాంకేతికత, ఉత్పత్తి సామర్థ్యంలో, పెట్టుబడుల పరిమాణాల్లో భిన్న వ్యూహాలతో పోటీ చేస్తున్నారు. రిలయన్స్ బ్యాటరీ గిగాఫ్యాక్టరీ, పాక్సరైట్ టెక్నాలజీ వంటి భవిష్యత్తు పరిజ్ఞానాలపై దృష్టి పెట్టగా.. అదానీ తన సులభమైన ట్రాన్స్మిషన్ కనెక్టివిటీ, రెన్యూవబుల్ పవర్ విక్రయాల్లోకి పెద్ద పెట్టుబడి వ్యూహంతో ముందుకు సాగుతోంది. రెండు సంస్థల మధ్య ఉన్న పోటీ 2030 నాటికి 500 గిగావాట్ల పునరుత్పాదక విద్యుత్ లక్ష్యాన్ని చేరుకోవడానికి సమర్థవంతంగా సహకరిస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇండస్ట్రీలో సవాళ్లు, పెట్టుబడులు, టెక్నాలజీ అభివృద్ధి నడుమ కచ్ ప్రాంతం గ్రీన్ ఎనర్జీ విప్లవానికి దారితీస్తోంది.

మొత్తం మీద కచ్ ప్రాంతంలో ముకేశ్ అంబానీ, గౌతమ్ అదానీ వేల కోట్ల పెట్టుబడులతో పోటాపోటీగా ముందుకు సాగుతూ గ్రీన్ ఎనర్జీ మార్కెట్లో ఎవరు ఆధిపత్యం సాధిస్తారనే ఉత్కంఠకు తెరలేపింది. ఈ పోటీ దేశ ఎనర్జీ భవిష్యత్తుని దృఢపరుస్తున్నదని అంచనాలు ఉన్నాయి.