అది టీడీపీ చడ్డీ గ్యాంగ్.. పవన్ ఆ పార్టీ అంబాసిడర్

అది టీడీపీ చడ్డీ గ్యాంగ్.. పవన్ ఆ పార్టీ అంబాసిడర్
  • వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు

అమరావతిలో రాజధాని నిర్మాణ పనుల తీరుపై పరిశీలనకు వెళ్లిన టీడీపీ బృందాన్ని చడ్డీ గ్యాంగ్ అంటూ తీవ్ర విమర్శలు చేశారు వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు. రాజధాని పేరుతో అమరావతిని టీడీపీ సర్వనాశనం చేసిందన్నారాయన. వేలకోట్లు దొచేసిన నాయకులు ఈ రోజు రాజధానిని సందర్సించారని ఆరోపించారు. కట్టడాలు ఇలా ఉంటాయంటూ చూపించిన నమూనాల్లాగా కట్టడాలు లేవని, అమరావతిని భ్రమరావతిలా చూపించారని మండిపడ్డారు అంబటి.

నాడు టీడీపీ చూపించిన నమూనాలకు ప్రపంచదేశాలు ఏవీ సరిపోవని ఎద్దేవా చేశారు అంబటి. శాశ్వత భవనాలు ఎక్కడ ఉన్నాయో టీడీపీ నేతలే చెప్పాలన్నారాయన. అమరావతికి గెజిట్ నోటిఫికేషనే ఇవ్వలేకపోయారని, రాజధానిపై ప్రశ్నించే హక్కు టీడీపీకి లేదని అన్నారు. వైసీపీపై బురద జల్లడానికి ఈ రోజు టీడీపీ చడ్డీ గ్యాంగ్ బయలుదేరిందని అన్నారు. టీడీపీ కార్యాలయం చకచకా పూర్తవుతోంది, కానీ రాజధాని మాత్రం పూర్తవ్వలేదని అంబటి అన్నారు.

పవన్ కామెడీ ఎక్కువైంది

ఇసుకను అక్రమంగా దోచుకున్న చంద్రబాబు  ఇసుక దీక్ష చేస్తాననడం హాస్యాస్పదంగా ఉందని అంబటి అన్నారు. ఈ మధ్య పవన్ కామేడీ ఎక్కువైందన్నారు. ప్రజలు, చిరంజీవి వల్లే పవన్ హీరో అయ్యారని అన్నారు. పవన్ తాట తీస్తాననడం రాజకీయ నాయకుడికి ఉండాల్సిన సంస్కారం కాదని అన్నారు. పవన్ సినిమాల్లో హీరో, రాజకీయాల్లో విలన్ అని చెప్పారు అంబటి. ఓటమి భయంతో పవన్ రెండుచోట్ల పోటీచేశారని, కానీ, రెండు స్థానాల్లోనూ తుక్కు తుక్కుగా ఓడిపోయారని అన్నారు. జగన్ పాలనకు పవన్ సర్టిఫికెట్ అవసరంలేదని చెప్పారాయన. టీడీపీకి పవన్ కల్యాణ్ బ్రాండ్ అంబాసిడర్‌గా మారారని ఆరోపించారు. రాజకీయాల్లో మెయిన్ విలన్ చంద్రబాబు అయితే సైడ్ విలన్ పవన్,  బుడ్డ విలన్ లోకేశ్ అని అన్నారు అంబటి.