హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో సంస్కరణల దిశగా అడుగులు పడ్డాయి. టీమిండియా మాజీ ప్లేయర్ అంబటి రాయుడును క్రికెట్ ఆపరేషన్స్ హెడ్‌గా నియమించారు. 2026 మే 05వ తేదీన
ఉప్పల్ రాజీవ్ గాంధీ క్రికెట్ స్టేడియంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు హెచ్‌సీఏ అధ్యక్షుడు అమర్నాథ్, కార్యదర్శి జీవన్ రెడ్డి.
ఈ సందర్భంగా భారత మాజీ అంతర్జాతీయ క్రికెటర్ అంబటి రాయుడును క్రికెట్ ఆపరేషన్స్ హెడ్‌గా నియమించినట్లు ప్రకటించారు ...
క్రికెట్ వ్యవస్థలో పారదర్శకతను పెంపొందించడమే లక్ష్యంగా ఈ నియామకం చేపట్టినట్లు ఈ సందర్భంగా తెలిపారు. అలాగే, అవినీతి నిరోధక చర్యలకు మరింత బలం చేకూర్చేందుకు హెచ్‌సీఏ ప్రత్యేక యాంటీ-కరప్షన్ యూనిట్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఈ యూనిట్ కు చైర్మన్‌గా ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జ్ విజేందర్ పింగలే బాధ్యతలు చేపట్టనున్నట్లు తెలిపారు.
►ALSO READ | DC vs CSK: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీ.. చెన్నై ముందు భారీ టార్గెట్ తప్పదా !
క్రికెట్ కు సంబంధించిన ఫిర్యాదులను వేగంగా పరిష్కరించేందుకు ప్రత్యేక గ్రీవెన్స్ రెడ్రెసల్ మెకానిజాన్ని కూడా ప్రారంభిస్తున్నట్లు హెచ్‌సీఏ వెల్లడించింది .
హెచ్‌సీఏ లీగ్ సీజన్ 2026–27ను మే 12 నుంచి ప్రారంభించనున్నారు. మొదటగా A & B డివిజన్ టీ20 మ్యాచ్‌లను నిర్వహించనున్నారు . హెచ్‌సీఏ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అకాడమీని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసి, ఆధునిక శిక్షణ సౌకర్యాలు కల్పించేందుకు సంకల్పించినట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో క్రికెట్ అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తూ, జిల్లా స్థాయి ఆటగాళ్లకు మరిన్ని అవకాశాలు కల్పించనున్నట్లు స్పష్టం చేసింది. మొత్తంగా ఈ నిర్ణయాలతో హెచ్‌సీఏలో పారదర్శకత, ప్రొఫెషనలిజం పెరగనుందని భావిస్తున్నారు.
