పేద స్టూడెంట్లకు క్వాలిటీ ఎడ్యుకేషనే కాకా లక్ష్యం : వివేక్ వెంకటస్వామి

పేద స్టూడెంట్లకు క్వాలిటీ ఎడ్యుకేషనే కాకా లక్ష్యం : వివేక్ వెంకటస్వామి
  •     కాకా బీఆర్ అంబేద్కర్ విద్యాసంస్థల చైర్మన్ వివేక్ వెంకటస్వామి
  •     ఘనంగా 77వ స్వాతంత్ర్య వేడుకలు
  •     కాకాస్​ మాంటిస్సోరి స్కూల్​ ప్రారంభం

ముషీరాబాద్, వెలుగు : పేద స్టూడెంట్లకు క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించడం కోసమే కాకా వెంకటస్వామి  అంబేద్కర్ విద్యాసంస్థలను స్థాపించారని.. విద్యాసంస్థల చైర్మన్ వివేక్ వెంకట స్వామి పేర్కొన్నారు. అంబేద్కర్ విద్యాసంస్థల నుంచి ఈ ఏడాది ఇంటర్​లో నాలుగు స్టేట్ టాపర్స్, లా కాలేజీ నుంచి టాపర్స్ రావడం సంతోషంగా ఉందన్నారు. 77వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం బాగ్ లింగంపల్లిలోని కాకా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విద్యాసంస్థలో  వేడుకలు ఘనంగా జరిగాయి. విద్యాసంస్థల చైర్మన్ వివేక్ వెంకటస్వామి, కరస్పాండెంట్ సరోజా వివేక్, విశాక ఇండస్ట్రీస్ జేఎండీ వంశీకృష్ణ, రోషిణి, వృతిక,  వైష్ణవి, వరుణ్, వెంకట్ హాజరై కాకా వెంకట స్వామి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.   ఎన్​సీసీ మార్చ్ ఫాస్ట్, స్టూడెంట్ల జాతీయ గీతాలాపన మధ్య వివేక్ వెంకటస్వామి జెండాను ఎగురవేశారు.

కాకా అంబేద్కర్ విద్యాసంస్థల్లో చిన్నారుల కోసం ప్రత్యేకంగా ‘కాకాస్ మాంటిస్సోరి’ స్కూల్​ను తన కుటుంబసభ్యులతో కలిసి వివేక్ వెంకటస్వామి ప్రారంభించారు. రెండున్నరేండ్ల నుంచి ఆరేండ్ల లోపు చిన్నారుల కోసం ప్రారంభించిన ఈ స్కూల్​లో వసతులు అద్భుతంగా ఉన్నాయని చెప్పారు. అధునాతన  సౌకర్యాలు కల్పించడంతో  ప్రత్యేకంగా నిలుస్తుందన్నారు. విద్యకు మించిన ఎదుగుదల, ఆవిష్కరణలకు ప్రాధాన్యత ఇవ్వడమే కాకుండా విభిన్న కార్యకలాపాల ద్వారా విలువల ఆధారిత విద్య నాయకత్వ లక్షణాలను ప్రోత్సహించడం అద్భుతంగా ఉందన్నారు. కాకా మాంటిస్సోరి స్కూల్​లో స్టూడెంట్ల  భద్రత సంక్షేమాలకు ప్రాధాన్యత ఇస్తున్నామని, విద్యపరంగా వ్యక్తిగతంగా అభివృద్ధి చెందే వాతావరణాన్ని స్టూడెంట్లకు కల్పిస్తుందన్నారు.

ఆకట్టుకున్న ఎన్​సీసీ స్టూడెంట్ల విన్యాసాలు

కాకా అంబేద్కర్ విద్యాసంస్థల్లో పంద్రాగస్టు వేడుకల్లో భాగంగా ఎన్​సీసీ స్టూడెంట్ల విన్యాసాలు అబ్బురపరిచాయి, బోర్డర్​లో చేసే విన్యాసాలు, రక్షణ చర్యలను వివరిస్తూ ఎన్​సీసీ స్టూడెంట్లు ప్రదర్శించిన స్కిట్ ఆకట్టుకుంది. విశాక జేఎండీ వంశీకృష్ణ మాట్లాడుతూ.. స్వాతంత్య్రం మనకు అంత సులభంగా రాలేదని.. ఎంతో మంది త్యాగాల ఫలితమని పేర్కొన్నారు. ఫ్రీడమ్ ఫైటర్లను స్టూడెంట్లు గుర్తు చేసుకుంటూ వారి అడుగుజాడల్లో నడవాలని సూచించారు.

మన సంస్కృతి, సంప్రదాయాలను పాటిస్తూజీవితంలో ముందుకెళ్లి అభివృద్ధిని సాధించాలని ఆకాక్షించారు. స్టూడెంట్లు టైమ్ వృథా చేయొద్దన్నారు. దేశాభివృద్ధిలో యువత పాత్ర కీలకమన్నారు. అనంతరం అక్టోబర్​లో లా కాలేజీలో జరగబోయే నేషనల్ సెమినార్  బ్రోచర్లను ఆవిష్కరించారు.