బీఆర్ఎస్​లోకి అంబర్​పేట్​ శంకర్​

బీఆర్ఎస్​లోకి అంబర్​పేట్​ శంకర్​
  • బీఆర్ఎస్​లోకి అంబర్​పేట్​ శంకర్​
  • కండువా కప్పి ఆహ్వానించిన మంత్రి హరీశ్​రావు
  • హైదరాబాద్​లో పార్టీ విజయానికి కృషిచేస్తానన్న శంకర్​

హైదరాబాద్, వెలుగు : హైదరాబాద్​కు చెందిన సీనియర్ నాయకుడు అంబర్​పేట్ శంకర్​బీఆర్ఎస్​లో చేరారు. మంత్రి హరీశ్​రావు ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్​తో కలిసి వచ్చిన అంబర్​పేట్​శంకర్.. సిటీలో పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేస్తానని తెలిపారు. ఉప్పల్​బీఆర్ఎస్​అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్​నాయకులు శ్రీనివాస్, కల్పనారెడ్డి బీఆర్ఎస్​లో చేరారు. మంత్రి హరీశ్ వారికి కండువాలు కప్పారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఒకప్పుడు పల్లెలు, పట్టణాలు అనే తేడా లేకుండా కరెంట్ కోతలు ఉండేవని, పరిశ్రమలకు పవర్ హాలిడేలు ఉండేవని గుర్తు చేశారు. సీఎం కేసీఆర్ కరెంట్ కోతలు లేని రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దారన్నారు.

వ్యవసాయానికి, పరిశ్రమలకు నిరంతర కరెంట్ సరఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో హైదరాబాద్ గ్లోబల్ సిటీగా పేరు గాంచిందన్నారు. వచ్చే ఎన్నికల్లో ఉప్పల్ ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మణ్ గెలుపు కోసం అందరూ కలిసి కృషి చేయాలన్నారు. ఆందోల్ నియోజకవర్గంలోని అల్లాదుర్గ్ మండల మాజీ జడ్పీటీసీ మమతా బ్రహ్మం హరీశ్​రావు సమక్షంలో బీఆర్ఎస్​లో చేరారు. మెదక్​జిల్లా యువజన సంఘాల అధ్యక్షుడు సాయిలు, వార్డు మెంబర్​నర్సింలు, మహేశ్​గౌడ్, బీజేపీ యూత్​అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్, రేగోడు మండలానికి చెందిన శేఖర్​తదితరులు బీఆర్ఎస్​లో చేరారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే క్రాంతికిరణ్​ఆందోల్​ఎన్నికల ఇన్​చార్జ్ ఫారూఖ్ హుస్సేన్, ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ భిక్షపతి తదితరులు పాల్గొన్నారు.