అంబులెన్స్ సిబ్బంది నిర్వాకం… కరోనాతో చనిపోయాడని అంత్యక్రియలకు డబ్బులు వసూలు

అంబులెన్స్ సిబ్బంది నిర్వాకం…  కరోనాతో చనిపోయాడని అంత్యక్రియలకు డబ్బులు వసూలు

డాక్టర్ సర్టిఫికెట్ తో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన నిర్వాకం

సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కలకలం..

కర్నూలు: కరోనాతో చనిపోయాడంటూ.. బాధితులను మభ్యపెట్టి డబ్బులు వసూలు చేసిన ప్రభుత్వ ఆస్పత్రి అంబులెన్స్ సిబ్బంది నిర్వాకం కొంత ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితుల అమాయకత్వం.. నిస్సహాయతను గుర్తించి బరితెగించారు. కరోనాతో చనిపోయాడు.. వెంటనే అంత్యక్రియలు చేసేయాలి.. పూడ్చేందుకు 75 వేలు.. కాల్చాలంటే 85 వేలు అవుతుందని చెప్పారు. టైమ్ లేదు.. వైరస్ పాకకుండా చూసుకోవాలని తొందరపెట్టారు.         చనిపోయిన వ్యక్తి భార్య నిరక్షరాస్యురాలు.. బంధువులు కూడా ఎవరూ రాలేదు.. దీంతో విదేశాల్లోని కొడుకుతో మాట్లాడి.. ఫోన్ పే ద్వారా 55 వేలు.. నగదు 30 వేలు తీసుకుని శవాన్ని తీసుకువెళ్లి అంత్యక్రియలు జరిపించారు.  అయితే డాక్టర్ సర్టిఫికెట్ తో బండారం బయటపడింది. దాన్ని మృతుడి బంధువులు సోషల్ మీడియాలో పెట్టడం వైరల్ అయింది. వివరాల్లోకి వెళితే..

కర్నూలు నగరంలోని బి.క్యాంప్ కు చెందిన కె.సాయినాథరావు (67) అనారోగ్యంతో  తీవ్ర అస్వస్థతకు గురికావడంతో ఈనెల 14వ తేదీన ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఫోన్ చేయడంతో అంబులెన్స్ వచ్చింది.  ఇంటి నుండి ఆస్పత్రికి తీసుకెళ్లారు.. క్యాజువాలిటీలో ఓపీ తీసుకుని వెళ్లిన కాసేపటికే చనిపోయినట్లు తెలిసి భార్య.. బంధువులు శోక సముద్రంలో మునిగిపోయారు. అయితే సాయినాథరావు మార్గం మద్యలోనే చనిపోయినట్లు గుర్తించిన అంబులెన్స్ డ్రైవర్.. సిబ్బంది కరోనాతో చనిపోయినట్లు బాధితులకు చెప్పారు. శవాన్ని మేమే అంత్యక్రియలకు తీసుకెళ్లాలి.. వైరస్ స్ప్రెడ్ కాకముందే.. తరలించాలంటూ తొందర పెట్టారు. నిరక్షరాస్యురాలైన మృతుడి భార్య విదేశాల్లోని కొడుకుకు ఫోన్ చేస్తే.. ఆస్ట్రేలియాలోని మెల్ బోర్న్ లో ఉంటున్న క్రాంతి కిరణ్ అంబులెన్స్ సిబ్బందితో మాట్లాడారు. అంత్యక్రియలను కాల్చి జరపాలంటే 85 వేలు.. పూడ్చాలంటే.. 75 వేలు అవుతుందని డిమాండ్ చేశారు. బాధితురాలు తన వద్ద ఉన్న 35 వేలు ఇవ్వగా.. విదేశాల్లోని కొడుకు ఫోన్ పే ద్వారా 50 వేలు పంపాడు.

నిన్న డెత్ సర్టిఫికెట్ కోసం నిన్న ఆస్పత్రికి వెల్లిన బాధితుల తరపు వారు డాక్టర్ సర్టిఫికెట్ చూసి షాక్ తిన్నారు. కరోనాతో చనిపోలేదని.. ఆస్పత్రికి తీసుకువస్తుండగానే మార్గం మధ్యలోనే చనిపోయినట్లు డాక్టర్ రేవతి సర్టిఫై చేశారు. దీన్ని వాట్సప్ లో విదేశాల్లోని కొడుకు క్రాంతి కిరణ్ కు పంపారు. అధికారుల దృష్టికి తీసుకెళ్లే విషయం తెలియని తల్లికి ఏం చెప్పాలో.. ఎలా చెప్పాలో అర్థం కాలేదు.. తన పరిస్థితిని.. తన కుటుంబాన్ని మోసం చేసిన వైనం సోషల్ మీడియాలో పెట్టడంతో అది కాస్తా వైరల్ అయింది.

డెత్ సర్టిఫికేట్ లో కార్డియక్ అరెస్ట్ (బ్రాట్ డెత్ )అని  డాక్టర్ రేవతి ఇచ్చిన స్లిప్..కోవిడ్ తో చనిపోక పోయినా కోవిడ్ అని చెప్పి 85 వేలు కొట్టేసిన అంబులెన్స్ డ్రైవర్ల ఉదంతం కలకలం రేపుతోంది. తనకు జరిగిన ఈ అన్యాయం మరొకరికి జరగకూడదని ఆవేదన వ్యక్తం చేస్తున్న కొడుకు కాంతి కిరణ్ వీడియో సందేశంపై అధికారులు, నేతలు ఎలా స్పందిస్తారో.. ఏం చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.