
న్యూఢిల్లీ: రష్యా నుంచి చవకగా ముడిచమురు కొంటున్నారన్న సాకు చూపి భారత్ పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వేసిన 50% టారిఫ్ లపై దేశవ్యాప్తంగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీనికి ప్రతిగా అమెరికా ఉత్పత్తులను బాయ్ కాట్ చేయాలని, స్వదేశీ వస్తువులే వాడాలని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.
అమెరికా ఉత్పత్తులైన పెప్సీ, కోకాకోలా, సబ్ వే, కేఎఫ్ సీ, మెక్ డొనాల్డ్స్ ను బాయ్ కాట్ చేయాలని, ఆ స్టోర్లకు వెళ్లకూడదని పలువురు నెటిజన్లు పిలుపునిస్తున్నారు. తాజాగా యోగా గురు బాబా రాందేవ్ కూడా ‘వోకల్ ఫర్ లోకల్’ కు తన మద్దతు ప్రకటించారు.
భారత్ పై ట్రంప్ టారిఫ్‌లకు దీటుగా జవాబివ్వాలని, ఇందుకు అమెరికా ఉత్పత్తులను వాడడం ఆపివేయాలని ప్రజలకు సూచించారు. బాయ్‌కాట్ ఎలా ఉండాలంటే అమెరికా షేక్ అయిపోవాలి” అని రాందేవ్ మీడియా ద్వారా పిలుపునిచ్చారు.
ఫ్రాన్స్, యూకే, కెనడాలోనూ..
ఇతర దేశాలపైనా ట్రంప్ టారిఫ్‌లు వేశారు. దీంతో ఫ్రాన్స్, యూకే, కెనడాలోనూ అమెరికా ఉత్పత్తులను ప్రజలు బాయ్ కాట్ చేస్తున్నారు. టారిఫ్‌ల నేపథ్యంలో స్వదేశీ వస్తువులనే కొనాలని ప్రధాని నరేంద్ర మోదీ ఇదివరకే ప్రజలను పిలుపునిచ్చారు. దీంతో మన ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావడంతో పాటు చేతివృత్తుల వారి ఆదాయం కూడా పెరుగుతుందన్నారు. స్వదేశీ వస్తువులనే కొనేలా అందరూ ప్రతిజ్ఞ చేయాలని మోదీ కోరారు.