చాలా కంపెనీలు.. ముఖ్యంగా అమెరికన్ కంపెనీలు చైనా వెలుపల ఫ్యాక్టరీలను స్థాపించడానికి రెడీగా ఉన్నాయి. వీటిని ఇండియాకు రప్పించడానికి గతిశక్తి స్కీమ్‌ను ప్రభుత్వం వాడుకోనుంది. ఈ స్కీమ్ కింద చేపట్టిన ప్రాజెక్టుల కోసం 1.2 ట్రిలియన్ డాలర్లను (దాదాపు రూ.కోటి కోట్లు) ఖర్చు చేయనుంది. ఇవి పూర్తయితే రోడ్డు, పోర్టులు వంటి సదుపాయాలు అందుబాటులోకి వస్తాయి కాబట్టి విదేశీ కంపెనీలు సహజంగానే ఇండియావైపు చూస్తాయి.
న్యూఢిల్లీ:కరోనా వంటి ఇబ్బందుల వల్ల చైనాకు ఇప్పటికీ మిగిలిన దేశాలతో పూర్తిస్థాయి సంబంధాలు లేవు. ఈ దేశానికి పూర్తిస్థాయిలో రాకపోకలు జరగడం లేదు. ప్రస్తుతం ఇక్కడ ఫ్యాక్టరీలను/యూనిట్లను నిర్వహిస్తున్న మల్టీ నేషనల్ కంపెనీలు వేరే ఏదైనా ఇతర దేశానికి వెళ్లాలని కోరుకుంటున్నాయి. వీటిని ఆకర్షించడానికి నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రయత్నాలను ముమ్మరం చేసింది. దాదాపు రూ.కోటి కోట్లతో(1.2 ట్రిలియన్డాలర్లు) చేపట్టిన ప్రధానమంత్రి గతిశక్తి యోజన కింద చేపట్టిన మెగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేయడంపై ఫోకస్ పెట్టింది. అయితే, ఈ పథకం కింద చేపట్టిన ప్రాజెక్టుల్లో సగం ఆలస్యమయ్యాయి. ప్రతి నాలుగింటిలో ఒకదాని ఖర్చు పెరిగింది. ఈ సమస్యలన్నింటికీ టెక్నాలజీ పరిష్కారమని కేంద్రం భావిస్తోంది. ఇక నుంచి ఇలాంటి సమస్యలు లేకుండా నిరంతరాయంగా ప్రాజెక్టు పనులు జరుగుతాయని కేంద్ర వాణిజ్యమంత్రిత్వ శాఖ అధికారి అమృత్లాల్ మీనా అన్నారు. గ్లోబల్ కంపెనీలు ఇండియాను తమ మానుఫ్యాక్చరింగ్ సెంటర్‌గా మార్చుకునేలా చేయడం తమ టార్గెట్ అని స్పష్టం చేశారు. ఫాస్ట్‌ట్రాకింగ్ ప్రాజెక్టుల ద్వారా కంపెనీలను రప్పించడం ఈజీ అవుతుందన్నారు. ఇందుకోసం గతిశక్తి పోర్టల్‌ను వాడుకుంటామన్నారు. యాపిల్ ఇప్పుడు ఐఫోన్ 14 తయారీని ఇండియాలోనూ ప్రారంభించింది. శామ్సంగ్ 2018లో ప్రపంచంలోనే అతిపెద్ద మొబైల్ ఫోన్ ఫ్యాక్టరీని ఇండియాలో ప్రారంభించింది. స్వదేశీ- సంస్థ ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రైవేట్ లిమిటెడ్ ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ స్కూటర్ ఫ్యాక్టరీని స్థానికంగా నిర్మిస్తున్నది.
ఇండియాకే ఎందుకంటే...
చాలా కంపెనీలు ‘చైనా ప్లస్ వన్’ పాలసీని పాటిస్తున్నాయి. అంటే.. చైనా వెలుపల కూడా ఒక ఫ్యాక్టరీని నడపాలని కోరుకుంటున్నాయి. తమ బిజినెస్‌లను, సప్లై చెయిన్లను విస్తరించాలన్న ఆలోచన ఇందుకు కారణం. కొన్ని దేశాలకు రాజకీయ కారణాలూ ఉన్నాయి. వీటిలో చాలా కంపెనీలు మనదేశంవైపు ఆసక్తి చూపిస్తున్నాయి. మనది ఆసియాలో మూడో అతిపెద్ద ఎకానమీ. ఇండియాలో చవగ్గా కార్మికులు దొరుకుతారు. ఇంగ్లిష్ మాట్లాడే వారి సంఖ్య ఎక్కువ. ఐటీ, ఇంజనీరింగ్ స్కిల్స్ ఉన్న ఎక్స్పర్టులకు కొదవ లేదు. కెర్నీ ఇండియా పార్ట్నర్ అన్షుమన్ సిన్హా దీని గురించి మాట్లాడుతూ చైనా మాదిరిగానే మన దగ్గర అన్నీ చవగ్గా దొరికితేనే కంపెనీలను ఆకర్షించవచ్చని అన్నారు. "గతి శక్తి వల్ల కంపెనీలకు చాలా లాభాలు ఉన్నాయి. అవి తమ వస్తువులను త్వరగా గమ్యస్థానానికి చేర్చుతాయి. కొత్త ప్రొడక్షన్ క్లస్టర్‌లను గుర్తించడం, ఆ సైట్‌లను దేశంలోని రైల్వే నెట్‌వర్క్, పోర్ట్‌లు విమానాశ్రయాలకు కలపడం ఈ ప్రాజెక్ట్‌కు కీలకం. ఇందుకోసం గతిశక్తిలోని కొన్ని లోపాలను తొలగించాలి. టెక్నాలజీ ద్వారా రెడ్ టేపిజం (ఆలస్యం) తగ్గించడం, ఆగిపోయిన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను తిరిగి మొదలుపెట్టాలి. గతి శక్తి పోర్టల్ పర్యవేక్షిస్తున్న 1,300 ప్రాజెక్ట్‌లలో దాదాపు 40 శాతం ప్రాజెక్టులు భూసేకరణ, అటవీ పర్యావరణ అనుమతులకు సంబంధించిన సమస్యల కారణంగా ఆలస్యమయ్యాయి. ఫలితంగా ఖర్చులు అధికమవుతున్నాయి. కనీసం 422 ప్రాజెక్ట్‌లకు కొన్ని సమస్యలు ఉన్నాయి. వాటిలో 200 సమస్యలను పోర్టల్ పరిష్కరించింది” అని సిన్హా చెప్పారు.
కొత్త ఆలోచనలతో ముందుకు..
గతి శక్తి ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేసేందుకు ప్రభుత్వం కొత్త ఆలోచనలను అమలు చేస్తోంది. ఉదాహరణకు ఫోన్ కేబుల్స్ లేదా గ్యాస్ పైప్‌లైన్‌లను వేయడానికి కొత్తగా నిర్మించిన రహదారిని మళ్లీ తవ్వకుండా ఉండేలా టెక్నాలజీను ఉపయోగిస్తున్నది. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత యూరప్ చేసినట్టుగా లేదా 1980– 2010 మధ్య చైనా దేశం "పోటీ సూచిక"ని పెంచడానికి తీసుకున్న నిర్ణయాల మాదిరిగా మౌలిక సదుపాయాల ప్రాజెక్ట్‌లను వేగంగా ముగించడం ఈ ప్లాన్‌లో భాగం. "నేటి భారతదేశం ఆధునిక మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడానికి మరింత ఎక్కువ పెట్టుబడి పెట్టడానికి రెడీగా ఉంది. ప్రాజెక్ట్‌లు అడ్డంకులను ఎదుర్కోకుండా, ఆలస్యం కాకుండా చూసేందుకు చాలా చర్యలు తీసుకుంటున్నాం" అని గతిశక్తి స్కీమ్‌ను ప్రారంభిస్తూ మోడీ అన్నారు. “అనేక ఆర్థిక కార్యకలాపాలను ప్రారంభించడానికి, పెద్ద ఎత్తున ఉపాధిని సృష్టించడానికి నాణ్యమైన మౌలిక సదుపాయాలు కీలకం. ఆధునిక మౌలిక సదుపాయాలు లేకుండా భారతదేశంలో పూర్తిస్థాయి అభివృద్ధి జరగదు”అని ఆయన స్పష్టం చేశారు. మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ వెబ్‌సైట్ ప్రకారం.. ఈ ఏడాది మే వరకు దేశమంతటా మొత్తం 1,568 ప్రాజెక్ట్‌లు నిర్మాణంలో ఉన్నాయి. వాటిలో 721 ఆలస్యమయ్యాయి. మరో 423 ప్రాజెక్టుల ఖర్చు పెరిగింది. 2014లో అధికారంలోకి వచ్చినప్పటి నుండి, కొత్త ఉద్యోగాలను సృష్టించడానికి, కరోనాతో దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి మోడీ ప్రభుత్వం మౌలిక సదుపాయాలపై ఖర్చును పెంచుతున్నది. మౌలిక సదుపాయాల పనుల్లో అంతరాలను గుర్తించడానికి ప్రభుత్వం గతి శక్తి పోర్టల్‌ను ఉపయోగిస్తోంది. బొగ్గు, ఉక్కు, ఆహార తరలింపులో ఇబ్బందులను తొలగించడానికి, పోర్ట్ కనెక్టివిటీని పెంచడానికి 196 ప్రాజెక్టులను నిర్మిస్తోంది. 2022 నాటికి 83,677 కిలోమీటర్లు రోడ్ల నిర్మాణం కోసం 106 బిలియన్ డాలర్లు ఖర్చు చేయనుంది. భారతమాల ప్రాజెక్టు కింద 11 గ్రీన్‌ఫీల్డ్ ప్రాజెక్టులను నిర్మించడానికి కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ ఈ పోర్టల్‌ను ఉపయోగిస్తోంది.
