జార్జ్ ఫ్లాయిడ్ కేసులో పోలీసునే దోషిగా తేల్చిన కోర్టు

జార్జ్ ఫ్లాయిడ్ కేసులో పోలీసునే దోషిగా తేల్చిన కోర్టు

ఆఫ్రో-అమెరికన్ జార్జ్ ఫ్లాయిడ్ మృతికి మిన్నియా పోలీస్ మాజీ అధికారి డెరెక్ చౌవినే కారణమని అమెరికా కోర్టు సంచలన తీర్పు చెప్పింది. ఈ కేసులో చౌవినే దోషి అని స్పష్టం చేసింది. 12 మంది సభ్యులున్న జ్యూరీ పది గంటల పాటు ఈ కేసును విచారించి జార్జ్ ఫ్లాయిడ్ మృతి ఘటనను సెకండ్ డిగ్రీ హత్య, థర్డ్ డిగ్రీ హత్యగా పేర్కొంటూ తీర్పు చెప్పింది. ఈ కేసుకు సంబంధించి దోషకి త్వరలోనే శిక్ష ప్రకటిస్తామని చెప్పింది. 

కాగా.. విచారణ సందర్భంగా కోర్టు ముందు భారీ సంఖ్యలో జనం గుమిగూడారు. కోర్టు దగ్గర ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. జార్జ్ మృతి కేసులో మరో ముగ్గురు పోలీసులపైనా ఆగష్టు నుంచి విచారణ జరగనుంది. తీర్పు వెలువడిన తర్వాత అమెరికన్ ప్రెసిడెంట్ జో బిడెన్, వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్‌లు జార్జ్ కుటుంబ సభ్యులతో మాట్లాడారు. వివక్షకు వ్యతిరేకంగా జరిగిన పోరాటానికి ఇది ముందడుగు అని బిడెన్ అన్నారు.

మే 25, 2020న నకిలీ నోట్లు సరాఫరా చేశారన్న ఆరోపణలతో జార్జ్ ఫ్లాయిడ్‌ను స్థానిక పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రోడ్డుపై పడుకోబెట్టి మెడపై మోకాలితో తొక్కి పట్టారు. తనకు ఊపిరి ఆడట్లేదంటూ జార్జ్ ఎంత వేడుకున్నా పోలీసులు కనికరించలేదు. దీంతో జార్జ్ అక్కడికక్కడే చనిపోయాడు. దీంతో అమెరికా వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు జరిగాయి. ఘటనను వ్యతిరేకిస్తూ వేలాది మంది ప్రజలు రోడ్లమీదకు రావడంతో చాలా రాష్ట్రాల్లో ఆ సమయంలో కర్ఫ్యూ కూడా విధించారు.