- సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు బాల నరసింహ
నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు : వెనిజువెలా అధ్యక్షుడు నికోలస్ మధురో, ఆయన కుటుంబ భద్రతకు ముప్పుగా మారిన అమెరికా సైనిక చర్యలను సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బాలనరసింహ తీవ్రంగా ఖండించారు. సోమవారం నాగర్ కర్నూల్ లో సీపీఐ జిల్లా ఆఫీసులో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వెనిజువెలా అంతర్గత వ్యవహారాల్లో విదేశీ జోక్యం ఆపాలని కోరారు.
వెనిజువెలాలో ఉన్న చమురు ఉత్పత్తులను స్వాధీనం చేసుకోవడం కోసమే అమెరికా అధ్యక్షుడు ట్రంపు ఇలాంటి దుశ్చర్యకు పాల్పడుతున్నారని తెలిపారు. డ్రగ్స్ ఆరోపణలు నిజం కావని, ఇలాంటి చర్యలను ప్రతిఒక్కరూ ఖండించాల్సిందేనన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన రాకపోవడం గమనార్హమన్నారు.
కేంద్ర ప్రభుత్వం దేశంలో కొనసాగిస్తున్న ఆపరేషన్ కగార్ కూడా రాజ్యాంగ విరుద్ధమని చెప్పారు. మావోయిస్టులు చర్చలకు సిద్ధమని ప్రకటించిన కూడా వారిని ఎన్కౌంటర్ చేయడం సరికాదన్నారు. ఖనిజ సంపదను ఆదానీ, అంబానీలకు కట్టబెట్టడమే కేంద్ర ప్రభుత్వం ప్రధాన ఉద్దేశమని విమర్శించారు. సమావేశంలో సీపీఐ జిల్లా కార్యదర్శి ఫయాజ్, నాయకులు కేశవులుగౌడ్, నరసింహ, చంద్రమౌళి, ఇందిరమ్మ పాల్గొన్నారు.
