కరోనా వైరస్ వ్యాప్తిని నివారించేందుకు దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ అమలుతో దాదాపు 40 రోజుల పాటు లిక్కర్ షాపులు మూతపడ్డాయి. మరోసారి మే 3 నుంచి మరో రెండు వారాల పాటు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్న కేంద్రం కొన్ని సడలింపులు ప్రకటించింది. మే 4 నుంచి గ్రీన్ జోన్లలో మద్యం షాపులను ఓపెన్ చేసే అవకాశం ఇచ్చింది. దీంతో ఇన్నాళ్లుగా ఎదురు చూసిన మద్యం ప్రియుల సంతోషానికి హద్దుల్లేకుండా పోయాయి.
దాదాపు నెలన్నర రోజులు మందు లేక అల్లాడిపోయిన మందుబాబులు కేంద్రం ప్రకటనతో లిక్కర్ షాపుల ముందుకెళ్లి.. తమ ఆనందాన్ని వెరైటీగా తెలియజేస్తున్నారు. సోమవారం మద్యం షాపులు తెరుస్తారని ప్రకటన రావడంతో ఆదివారం నాడు చిత్తూరు జిల్లా కుప్పం సరిహద్దు ప్రాంతం కర్ణాటకలోని బంగారుపేట గ్రామంలో ఉన్న లిక్కర్ షాపు దగ్గరకు వచ్చాడు ఓ మద్యం ప్రియుడు. తన ఆనందాన్ని తెలియజేస్తూ.. షాపుకు దిష్టి తీసి.. హారతులిచ్చి కొబ్బరికాయ కొట్టాడు. ఇది చూసి అంతా షాక్ అయ్యారు.
