
GST Relief to Auto Sector: దేశ పురోగతికి కీలకమైన జీఎస్టీ సంస్కరణల గురించి ప్రధాని మోడీ ఎర్రకోట ప్రసంగంలో స్వాతంత్ర్య దినోత్సవం రోజున మాట్లాడిన మార్కెట్లు సోమవారం స్టాక్ మార్కెట్లలో బుల్ ర్యాలీకి కారణంగా మారాయి. ఇందులోనూ ప్రధానంగా దేశీయ ఆటో రంగానికి పెద్ద పన్ను ఊరట లభించనుందనే ఆశలు పెరిగిపోయాయి. జీఎస్టీ రేట్ల తగ్గింపు బెనిఫిట్ ఆటో సంస్థలు రానున్న కాలంలో కొనుగోలుదారులకు పాసాన్ చేసే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
దీపావళికి కొద్దిరోజుల ముందే ఆటో రంగానికి శుభవార్త లభించింది. పాసింజర్ వాహనాలతో పాటు ద్విచక్రవాహన తయారీ సంస్థలకు జీఎస్టీ తగ్గింపుల ఆశలను పెంచుతున్నాయి. ప్రధానంగా దీపావళికి చాలా మంది కొత్త వాహనాల కొనుగోలు చేస్తుంటారు. అయితే ప్రభుత్వం జీఎస్టీ సంస్కరణలు రేట్ల తగ్గింపుతో వ్యాపారాలు పుంజుకుంటాయని కంపెనీలు భావిస్తున్నాయి.
ALSO READ : 5 నిమిషాల్లో రూ.5లక్షల కోట్లు పెరిగిన ఇన్వెస్టర్ల సంపద..
ప్రస్తుతం దేశంలోని పాసింజర్ వాహనాలపై 28 శాతం జీఎస్టీ అమలులో ఉంది. దీనికి అదనంగా 1 నుంచి 22 శాతం వరకు కంపెన్సేషన్ సెజ్ కూడా వాహన ఇంజెన్ కెపాసిటీ, వాహనం బాడీ పొడవులకు అనుగుణంగా వసూలు చేస్తోంది కేంద్ర ప్రభుత్వం. దీంతో గరిష్ఠంగా వాహనాలపై 50 శాతం వరకు పన్నుల భారం పడుతోంది. అయితే ఎలక్ట్రిక్ కార్లకు మాత్రం కేవలం 5 శాతం పన్ను మాత్రమే అమలులో ఉంది. కొత్తగా తీసుకొస్తున్న జీఎస్టీ కింద కేవలం 5 శాతం, 18 శాతం స్లాబ్ రేట్లు మాత్రమే ఉంటాయని తెలుస్తోంది. అలాగే లగ్జరీ వస్తువులు కార్లపై 40 శాతం పన్ను స్లాబ్ ప్రకటించవచ్చనే అంచనాలు ఉన్నాయి.
ఒకవేళ ఇదే జరిగితే 12 శాతం కింద ఉన్న వస్తువులు 5 శాతానికి అలాగే 28 శాతం కింద పన్ను విధించబడుతున్న వస్తువులు 18 శాతం కిందికి వస్తాయని నిపుణులు భావిస్తున్నారు. ఇదే జరిగితే ప్రధాని మోడీ చెప్పినట్లు డబుల్ దీపావళి ఈసారి వస్తుందని ఆటో రంగంలోని కంపెనీలు ఆశాజనకంగా ఉన్నాయి. సామాన్య మధ్యతరగతి ప్రజల ఆశలకు తగ్గిన పన్నులు ఊరటను అందిస్తాయని కంపెనీలు భావిస్తున్నాయి.
జీఎస్టీ సంస్కరణల ఆశలతో ఆటో స్టాక్స్ ర్యాలీ..
ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ మోర్గన్ స్టాన్లీ ఆటో రంగం నుంచి ప్రభుత్వానికి 28 శాతం స్లాబ్ రేటు కింద 14 శాతం ఆదాయం వస్తున్నట్లు గుర్తించింది. అయితే జీఎస్టీ రిలీఫ్ వార్తలతో హీరో మోటార్ కార్ప్, మారుతీ సుజుకీ, బజాజ్ ఆటో, మహీంద్రా అండ్ మహీంద్రా, టాటో మోటార్స్ కంపెనీల షేర్లు గరిష్టంగా 8 శాతం వరకు పెరుగుదలను నమోదు చేశాయి. దీంతో 350 సీసీ కంటే తక్కువ ఇంజన్లు ఉన్న టూవీలర్స్.. అలాగే 1200 సీసీ ఇంజిన్ కెపాసిటీ కలిగిన చిన్న కార్లకు, కొన్ని హైబ్రిడ్ కార్లకు రేట్లు భారీగా తగ్గొచ్చని ఆటో నిపుణులు చెబుతున్నారు.