
- టారిఫ్‌ల వేళ యూఎస్‌లో నిర్వహించే మీటింగ్‌కు హాజరు కావొద్దని నిర్ణయం!
- ఈ నెల 9 నుంచి ప్రారంభం
- 23–29 వరకు హైలెవల్ జనరల్ డిబేట్
న్యూఢిల్లీ: టారిఫ్‌ల వేళ అమెరికాతో సంబంధాలు దెబ్బతినడంతో..ఆ దేశంలో నిర్వహించే యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ సమావేశాలకు ప్రధాని నరేంద్ర మోదీ దూరంగా ఉండనున్నారు. ఈ మేరకు భారత సర్కారు కీలక నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. మోదీకి బదులుగా విదేశాంగ మంత్రి జైశంకర్ హాజరు కానున్నట్టు తెలుస్తున్నది. ఈ నెల 9 నుంచి యూఎన్ జనరల్ అసెంబ్లీ 80వ సెషన్ ప్రారంభమవుతుంది.
23 నుంచి 29 వరకు సర్వసభ్య దేశాల హైలెవెల్ జనరల్ డిబేట్స్ జరుగుతాయి. బ్రెజిల్ దేశాధినేత ప్రసంగంతో ఈ సమావేశాలు మొదలవుతాయి. అనంతరం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రసంగిస్తారు. ఆ తర్వాత ఈ నెల 27న భారత విదేశాంగ మంత్రి జైశంకర్ ఉపన్యాసం ఉంటుందని యూఎన్ తన షెడ్యూల్‌లో పేర్కొంది. జులైలో విడుదల చేసిన తాత్కాలిక స్పీకర్స్ జాబితా ప్రకారం, సెప్టెంబర్ 26న జనరల్ డిబేట్‌లో మోదీ ప్రసంగించాల్సి ఉంది.
అదేరోజు ఇజ్రాయెల్, చైనా, పాక్, బంగ్లాదేశ్ ప్రభుత్వాధినేతలు ప్రసంగించనున్నట్టు పేర్కొన్నారు. అయితే, సవరించిన జాబితాలో ప్రధాని మోదీకి బదులుగా విదేశాంగ మంత్రి జైశంకర్ పేరును చేర్చారు. దీనిని బట్టి ఈ సెషన్స్‌కు మోదీ హాజరు కావట్లేదని తెలుస్తోంది. ఇది తుది షెడ్యూల్ కానందున సమావేశాల ప్రారంభానికి ముందు మార్పులు జరిగే అవకాశం ఉంది. బెటర్ టుగెదర్: 80 ఇయర్స్ అండ్ మోర్ ఫర్ పీస్, డెవలప్‌మెంట్ అండ్ హ్యూమన్ రైట్స్ (శాంతి, అభివృద్ధి, మానవ హక్కుల కోసం 80 ఏండ్లు, అంతకు మించి ఒక్కటిగా ఉండటం) అనే థీమ్‌తో నిర్వహిస్తున్నారు.