కాశ్మీర్‌‌‌‌ను అభివృద్ధి చెందిన ప్రాంతంగా మారుస్తున్నం

కాశ్మీర్‌‌‌‌ను అభివృద్ధి చెందిన ప్రాంతంగా మారుస్తున్నం
  • ఫరూక్ అబ్దుల్లా కామెంట్లకు అమిత్ షా కౌంటర్
  • పీవోకేలో, కాశ్మీర్‌‌‌‌లో డెవలప్‌‌‌‌మెంట్‌‌‌‌ను పోల్చిచూడాలని చురక  

శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్ అంశంపై పాకిస్తాన్ తో చర్చలు జరపాలన్న నేషనల్ కాన్ఫరెన్స్ ప్రెసిడెంట్ ఫరూక్ అబ్దుల్లాకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా గట్టి కౌంటర్ ఇచ్చారు. ‘‘పాకిస్తాన్ తో చర్చలు జరపడం కాదు.. కేంద్ర ప్రభుత్వం జమ్మూ కాశ్మీర్ యువతతోనే మాట్లాడుతుంది. కాశ్మీర్ ను దేశంలోనే అభివృద్ధి చెందిన ప్రాంతంగా మార్చేందుకు ఇక్కడి యూత్ తోనే చర్చిస్తుంది” అని స్పష్టం చేశారు. జమ్మూ కాశ్మీర్ కు స్పెషల్ స్టేటస్ ను ఇచ్చే ఆర్టికల్ 370ని రెండేండ్ల కింద రద్దు చేసిన తర్వాత అమిత్ షా తొలిసారిగా జమ్మూ కాశ్మీర్​లో మూడు రోజులు పర్యటించారు. సోమవారం మూడో రోజు పర్యటనలో భాగంగా ఆయన శ్రీనగర్​లోని షేరి కాశ్మీర్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్(ఎస్కేఐసీసీ)లో జరిగిన సమావేశంలో పాల్గొన్నారు. రూ.4 వేల కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శంకుస్థాపన చేశారు. బెమినాలో రూ. 115 కోట్లతో ఏర్పాటు చేసిన 500 బెడ్ల హాస్పిటల్ ను ప్రారంభించారు. హంద్వారా మెడికల్ కాలేజీకి, బారాముల్లాలో స్టీల్ బ్రిడ్జికి శంకుస్థాపన చేశారు. 
పీవోకేలో పాక్ ఏం చేస్తోందో అడగాలె 
పాకిస్తాన్​తో, వేర్పాటువాదులతో చర్చించాలని కోరేవాళ్లు.. పాక్ ఆక్రమిత కాశ్మీర్​లో పాకిస్తాన్ ఏం చేస్తోందో అడగాలని అమిత్ షా అన్నారు. బార్డర్​కు అవతల పీవోకేలో, ఇవతల కాశ్మీర్​లో అభివృద్ధిని పోల్చి చూడాలన్నారు. అటువైపు కరెంట్, రోడ్లు, ఆస్పత్రులు, టాయిలెట్లు కూడా లేవన్నారు. జమ్మూ కాశ్మీర్, లడఖ్ ప్రాంతాల్లో అభివృద్ధి కోసమే ఆర్టికల్ 370ని రద్దు చేశామని, 2024 నాటికల్లా దీని రిజల్ట్ ను చూస్తారని చెప్పారు. ఇప్పటిదాకా కాశ్మీర్​ను పాలించిన 3 కుటుంబాలు 3 మెడికల్ కాలేజీలను మాత్రమే కట్టాయని, కానీ ప్రధాని మోడీ ప్రభుత్వం ఒక్కటే 7 మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేస్తోందన్నారు. ఇంతకుముందు ఇక్కడి నుంచి ఒక్కో బ్యాచ్​లో 500 మంది యూత్ మాత్రమే డాక్టర్లు అయ్యేవారని, ఇప్పుడు 2 వేల మంది డాక్టర్లు అవుతారన్నారు. కాశ్మీర్ అభివృద్ధికి సహకరించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఇప్పటివరకు కాశ్మీర్​లో జరిగిన హింసకు 40 వేల మంది బలైపోయారని, ఇది ఇంతటితో ఆగిపోవాలన్నారు. జమ్మూకాశ్మీర్ యూటీలో ఇప్పటికే కేంద్రం రూ.12 వేల కోట్ల పెట్టుబడులు పెట్టిందని, 2022 నాటికి రూ.51 వేల కోట్ల ఇన్వెస్ట్ మెంట్లతో 5 లక్షల మంది యూత్​కు ఉద్యోగాలు వస్తాయన్నారు.


బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్ తీసేయించి..

ఎస్కేఐసీసీలో జరిగిన సమావేశంలో షా మాట్లాడే పోడియంపై బుల్లెట్ ప్రూఫ్​గ్లాస్ షీల్డ్ ఏర్పాటు చేశారు. వేదికపైకి వచ్చిన మంత్రి.. తాను ప్రజలతో నేరుగా మాట్లాడాలని ఆ షీల్డ్​ను తీసేయాల ని చెప్పారు. అధికారులు దానిని తొలగించారు. ఆ తర్వాత షా మాట్లా డుతూ.. ‘‘మీ ముందు నేరుగా మాట్లాడాలని వచ్చా. బుల్లెట్ ప్రూఫ్ షీల్డులు లేకుండా ఫ్రీగా మాట్లాడాలని వచ్చాను” అని ప్రజలతో చెప్పా రు. సమావేశం తర్వాత జనం వద్దకు వెళ్లి షేక్ హ్యాండ్ చేస్తూ పలకరించారు.