ఇయ్యాల సిద్దిపేటలో బీజేపీ బహిరంగ సభ : అమిత్​షా

ఇయ్యాల సిద్దిపేటలో బీజేపీ బహిరంగ సభ : అమిత్​షా

సిద్దిపేట, వెలుగు: సిద్దిపేట పట్టణంలో గురువారం జరిగే బీజేపీ ఎన్నికల ప్రచార సభకు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్​షా హాజరవుతున్నారు. పట్టణంలోని డిగ్రీ కాలేజ్​మైదానంలో ఉదయం 11 గంటలకు సభలో ఆయన ప్రసంగిస్తారు. దాదాపు మూడు దశాబ్దాల క్రితం ఎల్ కే అద్వాని సిద్దిపేట పర్యటన తర్వాత ఇప్పుడు అమిత్​షా పర్యటిస్తున్నారు. దీంతో సభ విజయవంతానికి పార్టీ శ్రేణులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాయి. 

మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు ముందుండి ఏర్పాట్లను పర్యవేక్షిస్తుండగా జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల నుంచి దాదాపు 30 వేల మంది సభకు హాజరయ్యేలా ప్లాన్​చేస్తున్నారు. ఢిల్లీ నుంచి హైదరాబాద్ బేగంపేటకు చేరుకుని అక్కడి నుంచి అమిత్​షా హెలిక్యాప్టర్ ద్వారా కలెక్టరేట్ లోని హెలీప్యాడ్ లో దిగుతాడు. తర్వాత రోడ్డు మార్గంలో సిద్దిపేట డిగ్రీ కాలేజ్​మైదానానికి వచ్చి సభలో ప్రసంగిస్తారు. 

పోలీసుల భారీ బందోబస్తు

ఎన్నికల ప్రచార సభకు కేంద్ర హోం శాఖ మంత్రి  అమిత్​షా హాజరవుతున్న నేపథ్యంలో పోలీసులు భారీ బందో బస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. సీపీ అనురాధ హెలీప్యాడ్, బహిరంగ సభాస్థలిని పరిశీలించి అధికారులతో సమావేశం నిర్వహించారు.  బహిరంగ సభకు బందోబస్తును 12 సెక్టార్లుగా అధికారులకు ప్రత్యేక  డ్యూటీలు విభజించారు.  సభకు హాజరయ్యే ప్రజల కోసం  మెదక్ రోడ్ గవర్నమెంట్ హై స్కూల్, జూనియర్ కాలేజ్​గ్రౌండ్ ,  ప్రభుత్వ డిగ్రీ కాలేజ్​, గవర్నమెంట్ పీజీ కాలేజ్ గ్రౌండ్, నాగదేవత టెంపుల్  పరిసర ప్రాంతాల్లోని  ఖాళీ ప్రదేశాలను కేటాయించారు. 

వీఐపీ పార్కింగ్  బాలా గౌడ్ ఫంక్షన్ హాల్  ఎదురుగా ఉన్న ఖాళీ ప్రదేశాన్ని కేటాయించారు. బీజేపీ ఎన్నికల ప్రచార సభ సందర్భంగా ట్రాఫిక్ డైవర్షన్ పాయింట్స్ ను ఏర్పాటు చేశారు. మెదక్ వైపు నుంచి వచ్చే వాహనాల్ని  సిద్దిపేట రూరల్ పీఎస్​అంబేద్కర్ చౌరస్తా నుంచి ముస్తాబాద్ వైపు నుంచి వచ్చే వాహనాలను  నాగదేవత టెంపుల్ చౌరస్తా నుంచి తొగుట వైపు నుంచి వచ్చే వాహనాల్ని ఎన్సాన్ పల్లి  చౌరస్తా  నుంచి సిద్దిపేట పట్టణంలోకి డైవర్ట్ చేయనున్నారు.

ఏర్పాట్లను పరిశీలించిన రఘునందన్ రావు

ఎన్నికల ప్రచార సభ ఏర్పాట్లను రఘునందన్ రావు గురువారం సాయంత్రం పరిశీలించారు. ఈ సందర్భంగా వేదిక ఏర్పాటుతో పాటు సభకు హాజరయ్యే ప్రజలకు మౌలిక వసతులు కల్పించడం పార్కింగ్ వంటి అంశాలను పరిశీలించి పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు. సభ విజయవంతం కావడానికి చేపట్టాల్సిన చర్యల గురించి వివరించారు. సిద్దిపేట జిల్లాతో పాటు సమీప జిల్లాలనుంచి ప్రజలు అధిక సంఖ్యలో హాజరవుతున్నట్టు తెలిపారు.