
వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందన్నారు కేంద్ర హోం మంత్రి, బీజేపీ చీఫ్ అమిత్ షా. రాష్ట్రంలో సభ్యత్వ నమోదును కార్యక్రమం ప్రారంభించడానికి ఈ రోజు మధ్యహ్నం నగరానికి వచ్చారు. హైదరాబాద్ లోని రంగనాయక్ తాండాలోని సోనీబాయ్ ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులకు పార్టీ సభ్యత్వం ఇచ్చారు అమిత్ షా. ఆ తర్వాత శంషాబాద్ లో జరిగిన సభలో మాట్లాడిన ఆయన.. వచ్చే ఎన్నికల్లో బీజేపీ… ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తుందని.. ఈ మాటను రాసిపెట్టుకొమ్మని అమిత్ షా అన్నారు. ప్రధాని మోడీ హయాంలో బీజేపీ వేగంగా ఎదిగిందని చెప్పారు.
కాంగ్రెస్ లా బీజేపీ వ్యక్తిపై నడిచే పార్టీ కాదని అమిత్ షా అన్నారు. 2019 ఎన్నికల్లో దేశంలోని అన్ని పార్టీలు ఏకమై పోరాడినా బీజేపీని ఎదుర్కోలేకపోయాయని చెప్పారు. రాష్ట్రంలో సభ్యత్వాలు 18 లక్షలకు చేరాలని.. తానే స్వయంగా ప్రతీ ఇంటికీ వెళ్లి సభ్యత్వాలు ఇస్తానని అన్నారు. సమాజంలోని అన్ని వర్గాలను బీజేపీలో చేర్పించాలని రాష్ట్ర నాయకులకు దిశానిర్ధేశం చేశారు అమిత్ షా. పార్టీ సభ్యత్వ కార్యక్రమాన్ని ఛాలెంజింగ్ గా తీసుకుని ముందుకెళ్ళాలని అన్నారు. కేంద్ర బడ్జెట్ అన్ని వర్గాలకు న్యాయం చేసేలా ఉందని చెప్పారు.