
- మీటర్లు పెట్టాలని మేం చెప్పలె
- కేసీఆర్ కామెంట్లు ఫెంటాస్టిక్ నాన్సెన్స్
- చట్టాలు కాదు.. రాష్ట్ర ప్రభుత్వాన్ని మార్చండి: రైతులతో అమిత్‌షా
- 40 నిమిషాల పాటు మీటింగ్
- సేంద్రియ సాగు చేయాలని సూచన
- అమిత్ షా దృష్టికి రైతు సమస్యలు
- పంట నష్టం ఇవ్వడం లేదని ఆవేదన
- సెంట్రల్ టీమ్‌తో సర్వే చేయిస్తామని కేంద్ర మంత్రి హామీ
హైదరాబాద్, వెలుగు: మోటార్లకు మీటర్లు బిగించే ప్రసక్తే లేదని, అది తప్పుడు ప్రచారం అని కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. మోటార్లు బిగించాలనేది ఫెంటాస్టిక్ నాన్సెన్స్ అని అన్నారు. ‘మోటార్లు బిగించాలని కేంద్రం కేసీఆర్‌కు చెప్పిందా?’ అని ప్రశ్నించారు. ఆదివారం బేగం పేట ఎయిర్ పోర్ట్‌లో వివిధ జిల్లాలకు చెందిన 17 మంది ఆదర్శ రైతులతో, పద్మశ్రీ అవార్డు గ్రహీత వెంకటరెడ్డి సహా 30 మందితో అమిత్ షా సమావేశమయ్యారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ తరుణ్ చుగ్, కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి, మరికొందరు కిసాన్ నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. విద్యుత్ మోటార్లకు మీటర్లు బిగిస్తున్నారంటూ సీఎం కేసీఆర్ చేస్తున్న ఆరోపణలను రైతులు అమిత్ షా దృష్టికి తీసుకెళ్లారు. విద్యుత్ చట్టాన్ని మార్చాలని రైతు సంఘాల నేతలు అమిత్ షాను కోరగా.. ‘మార్చాల్సింది చట్టం కాదు.. ఇక్కడి ప్రభుత్వాన్ని’ అని ఆయన బదులిచ్చినట్టు బీజేపీ ఓ ప్రకటనలో తెలిపింది.
రాష్ట్రంలో ఫసల్ బీమా అమలు చేస్తలే
ఆర్గానింగ్ ఫార్మింగ్ తో కలిగే ప్రయోజనాలతో పాటు ఫసల్ బీమా స్కీంపైనా రైతులతో అమిత్ షా చర్చించారు. రాష్ట్రంలో ఈ స్కీం అమలు చేయడం లేదని, దీంతో తాము తీవ్రంగా నష్టపోతున్నామని రైతులు వాపోయారు. అకాల వర్షాలతో పంట నష్టం వాటిల్లుతున్నా తమకు పరిహారం అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర బృందంతో రాష్ట్రంలో పంట నష్టంపై సర్వే చేయిస్తామని రైతులకు షా హామీ ఇచ్చారు. ఆర్గానిక్ ఉత్పత్తుల మార్కెటింగ్ విషయంలో వెనుకబడి ఉన్నామంటూ కొందరు రైతులు అమిత్ షా దృష్టికి తీసుకురాగా.. త్వరలోనే అమూల్ సంస్థ ద్వారా సేంద్రియ ఉత్పత్తులను సేకరించేందుకు హైదరాబాద్‌లో తగిన ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. హైదరాబాద్‌లో 5 సేంద్రియ వ్యవసాయ లాబోరేటరీలను ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. సేంద్రియ ఉత్పత్తులు పండించే భూముల్లో ఏటా రెండుసార్లు భూసార పరీక్షలు నిర్వహించేలా చర్యలు తీసుకుంటామని అమిత్ షా హామీ ఇచ్చారు.
తప్పుడు ప్రచారం మానేయాలి: బండి సంజయ్
రైతులతో అమిత్ షా భేటీపై తప్పుడు ప్రచారాన్ని బండి సంజయ్ ఖండించారు. చర్చకు రాని అంశాలపై రాద్దాంతం చేయొద్దని సూచించారు. రైతులతో అమిత్ షా మీటింగ్ ముగిసిన తర్వాత కొన్ని చానెల్స్‌లో వచ్చిన వార్తలపై సంజయ్ స్పందించారు. వ్యవసాయ మోటార్లకు మీటర్ల బిగింపు అంశంపై అమిత్ షా దురుసుగా సమాధానమిచ్చారంటూ వచ్చిన వార్తల్లో నిజం లేదన్నారు. ఆర్గానిక్ ఫార్మింగ్ పై తప్ప మరే అంశంపై చర్చ జరగలేదని స్పష్టం చేశారు. రైతులు లేవనెత్తిన సందేహాలను అమిత్ షా నివృత్తి చేయడంతో పాటు సేంద్రియ సాగుపై సూచనలు చేశారన్నారు. “సీఎం కేసీఆర్ లీకుల వీరుడు. టీఆర్ ఎస్ లీకుల పార్టీ. ఢిల్లీ వెళ్లి రైతు చట్టాలకు కేసీఆర్ మద్దతిచ్చి, ఇక్కడికి వచ్చి మాట మార్చాడు. కేసీఆర్‌వి ద్వంద్వ విధానాలు. ఒక మాట మీద ఉండడు. లోపల జరిగిందొకటి, బయట ప్రచారం జరుగుతున్నది మరొకటి” అని బండి సంజయ్ పేర్కొన్నారు.
భూసార పరీక్షలు చేయడం లేదు..
రాష్ట్ర ప్రభుత్వం ఫసల్ బీమా అమలు చేయడం లేదన్న విషయాన్ని కేంద్ర మంత్రి అమిత్ షాకు వివరించామని బీజేపీ కిసాన్ మోర్చా స్టేట్ ప్రెసిడెంట్ కొండపల్లి శ్రీధర్ రెడ్డి తెలిపారు. రైతుల సమస్యలను షా దృష్టికి తీసుకెళ్లామన్నారు. భూసార పరీక్షలు చేయాలని కేంద్రం నిధులు ఇచ్చినా.. రాష్ట్రం పట్టించుకోవట్లేదన్నారు. ఆ నిధులను దారి మళ్లిస్తోందన్న విషయాన్ని వివరించినట్టు తెలిపారు. ఆర్గానిక్ ఫార్మింగ్‌తో మంచి లాభాలు పొందినట్టు నాగర్‌కర్నూల్ జిల్లాకు చెందిన లావణ్య అమిత్‌షాకు వివరించారు. కెమికల్ ఫర్టిలైజర్స్‌తో నష్టపోయినట్టు చెప్పారు. ఇన్పుట్ సబ్సిడీ అందట్లేదన్న విషయాన్ని షాకు వివరించినట్టు వికారాబాద్‌కు చెందిన రైతు మాణిక్ రెడ్డి తెలిపారు. ఈ విషయంలో ఎదురవుతున్న ఇబ్బందులను పరిష్కరించాలని కోరగా.. షా సానుకూలంగా స్పందించారని వివరించారు.
సేంద్రియ సాగుతో ఎంతో మేలు : అమిత్ షా
ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ.. సేంద్రియ వ్యవసాయంతో ఎంతో మేలు జరుగుతుందన్నారు. తాను కూడా సేంద్రియ వ్యవసాయం చేస్తున్నట్లు తెలిపారు. గతంలో తనకున్న 20 ఎకరాల్లో తెలియకుండా రసాయన ఎరువులు వాడటంతో పంట దెబ్బతిన్నదని గుర్తు చేసుకున్నారు. తన దగ్గర మేలు జాతి గోవులు 21 ఉన్నాయని, అందులో ఒకటి గోమాత 12వ జనరేషన్‌కు చెందినదని తెలిపారు. ఆ గోమాతకు మహాలక్ష్మీగా నామకరణం చేసి మనవడికి బహుమతిగా ఇవ్వాలనుకుంటున్నానని అమిత్ షా వివరించారు. గోమాత పేడను ఎరువుగా వాడటంతో ఎంతో మేలు జరుగుతుందన్నారు.