అమిత్షా తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి : మంత్రి పొన్నం ప్రభాకర్ 

అమిత్షా తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి : మంత్రి పొన్నం ప్రభాకర్ 
  •  ఆ తర్వాతే హైదరాబాద్​లో అడుగుపెట్టాలి: మంత్రి పొన్నం ప్రభాకర్ 
  •  జనగణనతోనే బీసీ కులగణనను చేపట్టాలి
  • ఇందుకు బీజేపీ బీసీ నేతలు అమిత్ షాను ఒప్పించాలని సూచన 

హైదరాబాద్, వెలుగు:  తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పిన తర్వాతే కేంద్ర హోంమంత్రి అమిత్ షా హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అడుగుపెట్టాలని మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. శుక్రవారం గాంధీభవన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మీడియాతో ఆయన మాట్లాడారు. తెలంగాణ ఏర్పాటు, అమరవీరుల త్యాగాలపై గతంలో పార్లమెంటు సాక్షిగా అవమానకరంగా మాట్లాడినందుకు ప్రధాని మోదీ, అమిత్ షా బేషరతుగా క్షమాపణ చెప్పాలని అన్నారు.

కేంద్ర హోంమంత్రిగా అమిత్ షా ఎప్పుడైనా హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు రావచ్చని, అయితే తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాల్సిందేనని స్పష్టం చేశారు. మణిపూర్, ఈశాన్య రాష్ట్రాల్లో అల్లర్లు, చైనా సరిహద్దు సమస్యలు వంటి కీలక అంశాలను పట్టించుకోకుండా, ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో రాజకీయ లబ్ధి కోసమే పర్యటిస్తున్నారని విమర్శించారు. బీసీల స్థితిగతులు మెరుగుపడాలన్నా, రిజర్వేషన్లు, సంక్షేమ పథకాలు సక్రమంగా అందాలన్నా కులాలవారీ గణాంకాలు అవసరమని చెప్పారు.

ఈ అంశంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు అధికారికంగా లేఖ రాస్తున్నట్లు వెల్లడించారు. దేశవ్యాప్తంగా పశువులు, గొర్రెల లెక్కలు తీస్తున్న కేంద్రం.. కోట్లాది మంది ఓబీసీల లెక్కలు ఎందుకు తీయడం లేదని ప్రశ్నించారు. జాతీయ జనగణనలో బీసీ కులగణనను చేర్చేలా బీజేపీ బీసీ నేతలు అమిత్ షాపై ఒత్తిడి తేవాలని కోరారు.

బీజేపీ పాలనలో రాజ్యాంగబద్ధమైన స్వతంత్ర సంస్థలను నిర్వీర్యం చేస్తున్నారని, దేశవ్యాప్తంగా కుట్రపూరితంగా పేదల ఓట్లను తొలగిస్తున్నారని ఆరోపించారు. ఈసీఐ తీరుపై గతంలో న్యాయస్థానాలు అక్షింతలు వేసిన విషయాన్ని గుర్తుచేశారు. ఓటు హక్కు ప్రజల ప్రాథమిక ప్రజాస్వామిక హక్కు అని, దాన్ని హరించే ప్రయత్నాలను సహించబోమని స్పష్టం చేశారు.

రాబోయే రోజుల్లో దేశ ప్రజలే బీజేపీకి గుణపాఠం చెబుతారని అన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ‘ఓట్ బచావో - దేశ్ బచావో’ నినాదంతో ఏఐసీసీ నేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పెద్ద ఎత్తున పోరాడుతోందని తెలిపారు. ఈ నిరసన మార్చ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పాల్గొనేందుకు తెలంగాణ కాంగ్రెస్ నేతలంతా ఢిల్లీకి వెళ్తున్నారని చెప్పారు.