
- కేంద్రమంత్రిగా ఇవేం వ్యాఖ్యలు
- ‘టెర్రరిస్టులకు హైదరాబాద్ సేఫ్ జోన్’ కామెంట్లపై కిషన్ రెడ్డికి అమిత్ షా మందలింపు
- యూపీ కూడా అంతేనా: అసద్ ఫైర్
- తాను తప్పేమీ అన్లేదన్న కిషన్ రెడ్డి
న్యూఢిల్లీ, వెలుగు: హైదరాబాద్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్ రెడ్డిని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మందలించినట్లు తెలుస్తోంది. శనివారం నార్త్ బ్లాక్ లోని కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించిన తర్వాత అమిత్ షా హోంశాఖ సమావేశం నిర్వహించారు.హైదరాబాద్ టెర్రరిస్టులకు సేఫ్ జోన్ అంటూ కిషన్ రెడ్డి చేసిన కామెంట్స్ పై ఆయన అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. కేంద్ర మంత్రి హోదాలో ఇలాంటి వ్యాఖ్యలు సరికాదని మందలించినట్లు తెలుస్తోంది.
“దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలు ఎక్కడ జరిగినా దానికి ప్లానింగ్, కుట్ర హైదరాబాద్‌లో జరుగుతోంది. దేశ, విదేశాల్లో ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్గొని హైదరాబాద్‌కు వచ్చి సేఫ్ జోన్‌గా భావించి స్లీపర్ సెల్స్‌లా ఉంటున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ప్రతి రెండు, మూడు నెలలకోసారి పోలీసులు, ఎన్ఐఏ అధికారులు హైదరాబాద్ లో టెర్రరిస్టులను అరెస్టు చేస్తున్నారు. ఐసిస్ కార్యకలాపాలు పెంచే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న వార్తలు చూస్తున్నాం. ఇవన్నీ చాలా ఆందోళన కలిగించేవి. మయన్మార్ నుంచి వేలాది మంది చొరబాటుదారులు (రోహింగ్యాలు) హైదరాబాద్ వచ్చి నివసిస్తున్నారు. వారికి కొన్ని సంస్థలు, పార్టీలు మద్దతు తెలుపుతున్నాయి’’అని కిషన్ రెడ్డి కామెంట్ చేశారు.
కిషన్‌రెడ్డి వ్యాఖ్యలపై ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ ట్విట్టర్‌లో మండిపడ్డారు. ఈ మాటను ఎన్‌ఐఏ, ఐబీ, రా ఎన్ని సార్లు చెప్పాయో వెల్లడించాలని డిమాండ్ చేశారు. అత్యధికంగా ఐసిస్ సభ్యులు యూపీలో పట్టుబడ్డారని, ఆ రాష్ట్రం ఉగ్రవాదులకు అడ్డా అని చెప్పగలరా అని ప్రశ్నించారు. కిషన్ రెడ్డి వ్యాఖ్యలు దురదృష్టకరమన్నారు. హైదరాబాద్ పై కిషన్ రెడ్డి వ్యాఖ్యలతో పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలకు తప్పుడు సంకేతాలు వెళ్తాయని టీఆర్ఎస్ నాయకుడు అబిద్ రసూల్ ఖాన్ అన్నారు.
హోం శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కిషన్ రెడ్డి
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా జి.కిషన్ రెడ్డి శనివారం నార్త్ బ్లాక్ లోని కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. అంతకు ముందు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, మరో సహాయ మంత్రి నిత్యానందరాయ్ కూడా బాధ్యతలు చేపట్టారు. తర్వాత కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ” నేను తప్పేమీ చెప్పలేదు. దేశంలో పలుచోట్ల ఉగ్రవాద కార్యలాపాలు పెరుగుతున్న విషయాన్నే నేను చెప్పా. బెంగళూరు, భోపాల్ ఇలా ఎక్కడ ఉగ్ర ఘటనలు జరిగినప్పుడు అందుకు మూలాలు హైదరాబాద్‌లో కనబడుతున్నాయి. హైదరాబాద్‌లో ప్రతి రెండు, మూడు నెలలకు ఉగ్రవాదులు అరెస్టవుతున్నారు” అని అన్నారు.