రేపే ఎన్నికలకు వెళ్లినా.. మేం సిద్ధం, గెలుస్తం

V6 Velugu Posted on May 15, 2022

  • కేసీఆర్​, కొడుకు, బిడ్డ చేతిలో అధికారం బందీ: అమిత్​ షా
  • రేపే ఎన్నికలకు వెళ్లినా.. మేం సిద్ధం, గెలుస్తం
  • ఇంత అవినీతి సర్కార్​ను ఎప్పుడూ చూడలే
  • కేంద్ర పథకాల పేర్లు మార్చి గొప్పలు చెప్పుకుంటున్నరు
  • నీళ్లు, నియామకాలు,  నిధులు ఏమైనయ్​?
  • పవర్​లోకి వస్తే  మైనారిటీ రిజర్వేషన్లు  తీసేసి.. ఎస్సీ, ఎస్టీ, బీసీల కోటా పెంచుతం
  • తుక్కుగూడ సభలో కేంద్ర హోంమంత్రి

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: రాష్ట్రంలో నయా నిజాం కేసీఆర్​ను గద్దె దించేందు కు ప్రతి ఒక్కరూ సిద్ధం కావాలని కేంద్ర హోం మంత్రి అమిత్‌‌‌‌ షా పిలుపునిచ్చారు. తన జీవితం లో ఇంతటి పనికిమాలిన, ఇంతటి అవినీతి ప్రభుత్వాన్ని చూడలేదన్నారు. టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ కారు స్టీరింగ్‌‌‌‌ అసదుద్దీన్‌‌‌‌ ఒవైసీ చేతిలో ఉందని, రజాకార్ల వారసులను ఒళ్లో కూర్చోబెట్టుకుని కేసీఆర్‌‌‌‌ రాష్ట్రాన్ని పాలిస్తున్నారని ఆయన మండిపడ్డారు. సెక్రటేరియెట్​కు వెళ్తే సర్కారు పడిపోతుందని ఎవరో తాంత్రికులు చెప్పడంతో కేసీఆర్‌‌‌‌ అక్కడికి వెళ్లడం లేదని, ఆయనను కూల్చేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని, రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉద్యమ ఆకాంక్షలు పూర్తి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌‌‌‌ చేపట్టిన రెండో విడత ప్రజాసంగ్రామ యాత్ర ముగింపు సభ తుక్కుగూడలో శనివారం సాయంత్రం నిర్వహించారు. ఈ బహిరంగ సభలో అమిత్‌‌‌‌ షా మాట్లాడుతూ.. తెలంగాణకు కేంద్రం ఏమిచ్చిందో, ఏం చేసిందో లెక్కలు తేలుద్దామా అని కేసీఆర్​కు సవాల్‌‌‌‌ విసిరారు. కమీషన్లు ఇచ్చే ప్రాజెక్టులే కేసీఆర్‌‌‌‌ నిర్మిస్తారని, పాలమూరు –- రంగారెడ్డి, డిండి, ఆర్డీఎస్‌‌‌‌, నెట్టెంపాడు ప్రాజెక్టులు ఏమయ్యాయని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్‌‌‌‌ ముందస్తు ఎన్నికల కోసం ఫామ్​హౌస్‌‌‌‌లో కూర్చొని ప్రణాళికలు రచిస్తున్నారని, రేపే ఎన్నికలు వచ్చినా రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేసి ఇంకా అప్పులు కావాలని కేసీఆర్‌‌‌‌ అడుగుతున్నారని, మజ్లిస్​కు భయపడే తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహించడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధికి రూ.2,52,202 కోట్లు ఇచ్చిందని ఆయన వివరించారు. 

సంజయ్​ ఒక్కరు చాలు

కేసీఆర్‌‌‌‌ను గద్దె దించడానికి తాను రావాల్సిన అవసరం లేదని, పార్టీ స్టేట్​ చీఫ్​ సంజయ్‌‌‌‌ ఒక్కరు చాలని అమిత్​ షా అన్నారు.  ప్రజాసంగ్రామ యాత్ర ఎవ్వరినో గద్దె దించడానికో, మరెవరినో గద్దె క్కించడానికో, ఎవరినో ముఖ్యమంత్రిని చేయడానికో చేపట్టింది కాదని అన్నారు. దళిత, ఆదివాసీ, బడుగులు, బలహీన వర్గాలు, మహిళల సంక్షేమం కోసం చేపట్టిన యాత్ర అని అన్నారు. రజాకార్ల ప్రతినిధుల పాలన నుంచి విముక్తి కోసమే చేపట్టిన యాత్ర అని చెప్పారు. ఈ పాదయాత్రతో నయాం నిజాంకు శ్రద్ధాంజలి తప్పదన్నారు. 46 డిగ్రీల మండుటెండలో సంజయ్‌‌ 660 కిలోమీటర్ల పాదయాత్ర చేశారని ఆయన తెలిపారు. సర్దార్‌‌ పటేల్‌‌ కారణంగానే తెలంగాణ.. భారత్‌‌లో భాగమైందని, ఆయనతో పాటు ఈ ప్రాంత విముక్తి కోసం పోరాడిన స్వామి రామానందన్​ తీర్థ్, పండిట్​ నరేంద్ర, సురవరం ప్రతాప్​రెడ్డి, దాశరథి రంగాచార్య, పీవీ నర్సింహరావుకు శ్రద్ధాంజలి ఘటిస్తున్నామన్నారు. కేసీఆర్‌‌ ప్రభుత్వం దళిత, ఆదివాసీ, ఓబీసీ సహా అన్ని వర్గాలను మోసం చేసిందని చెప్పారు. డబుల్‌‌ బెడ్రూం ఇండ్లు, రైతులకు రూ.లక్ష రుణమాఫీ వంటి అన్ని హామీలను విస్మరించిందని, హైదరాబాద్‌‌ నయాం నిజాంను పెకిలించి వేయాల్సి ఉందని చెప్పారు.  

ధాన్యం కొనుగోళ్లపై కేసీఆర్​వి నాటకాలు

బాయిల్డ్‌‌ రైస్‌‌ కొనాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని, కొనకుంటే కేసీఆర్‌‌ గద్దె దిగాలని అమిత్​ షా అన్నారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే బాయిల్డ్​ రైస్​ను కొంటుందని ఆయన స్పష్టం చేశారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేసీఆర్​ నాటకాలు ఆడుతున్నారని, కేంద్రంపై నెపం మోపేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. తాము అధికారంలోకి వస్తే డబుల్‌‌ ఇంజిన్‌‌ గ్రోత్‌‌ చేసి చూపిస్తామన్నారు. తాంత్రికులు చెప్పారని సెక్రటేరియట్‌‌కు వెళ్లని కేసీఆర్‌‌ను ప్రజలే గద్దెదించుతారని పేర్కొన్నారు. నీళ్లు.. నిధులు.. నియామకాలను కేసీఆర్‌‌ గాలికొదిలేశారని, వాటి అమలు బాధ్యత తాము తీసుకుంటామన్నారు.   

దాడులను సహించేది లేదు?

కేసీఆర్‌‌ హత్యా రాజకీయాలు చేస్తున్నారని, బీజేపీ కార్యకర్త సాయి గణేశ్‌‌ ఆత్మహత్యకు కారకులైన వారిని శిక్షిస్తామని అమిత్​ షా చెప్పారు. బీజేపీ కార్యకర్తలపై దాడులు చేస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. కేసీఆర్ తెలంగాణను బెంగాల్‌‌లా మార్చాలని అనుకుంటున్నారని, రాష్ట్రాన్ని బెంగాల్‌‌ కాకుండా ఆపాలన్నారు. మజ్లిస్‌‌కు కేసీఆర్‌‌ భయపడుతున్నారని, అందుకే కాశ్మీర్‌‌లో ఆర్టికల్‌‌ 370 ఎత్తేస్తే కేసీఆర్‌‌ వ్యతిరేకించారని పేర్కొన్నారు. టీఆర్‌‌ఎస్‌‌ ఎన్నికల గుర్తు కారు అని, దాని స్టీరింగ్‌‌  ఒవైసీ చేతిలోనే ఉందన్నారు. కేసీఆర్​, మజ్లిస్​కు తాము భయపడేది లేదన్నారు.  

ఎయిర్‌‌ పోర్టులో అమిత్​షా వెయిటింగ్

తుక్కుగూడ మీటింగ్‌‌ తర్వాత అమిత్‌‌ షాతో కలిసి బండి సంజయ్‌‌ నోవాటెల్‌‌ హోటల్‌‌కు వెళ్లారు. మరికొందరు నేతలతో కలిసి అమిత్‌‌ షా డిన్నర్‌‌ చేసిన అనంతరం శంషాబాద్‌‌ ఎయిర్‌‌పోర్టుకు చేరుకున్నారు. హైదరాబాద్​లో భారీ వర్షం కురవడంతో విమానాల టేకాఫ్‌‌ ను నిలిపివేశారు. దీంతో ఎయిర్‌‌ పోర్టులోనే వెయిట్‌‌ చేసిన అమిత్​షా.. వర్షం తగ్గాక రాత్రి 11 గంటల సమయంలో ఢిల్లీకి బయల్దేరి వెళ్లారు.

అయితే పేర్లు మార్చుడు.. లేకపోతే బంద్​ పెట్టుడా?

కేంద్ర పథకాల పేర్లు మార్చి గొప్పలు చెప్పుకుంటున్నారని, రూ.18 వేల కోట్ల ఉపాధి హామీ నిధులను హరితహారానికి మళ్లించి తండ్రీ, కొడుకుల ఫొటోలు పెట్టుకొని ప్రచారం చేసుకుంటున్నారని కేసీఆర్​, కేటీఆర్​పై అమిత్​షా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయుష్మాన్‌‌ భారత్​ను కేసీఆర్​ అమలు చేయకపోవడంతో పేదలకు రూ.5 లక్షల ఉచిత వైద్యం అందకుండా పోయిందన్నారు. సమగ్ర శిక్ష అభియాన్‌‌ను ‘మన ఊరు -- మన బడి’ అని మార్చి, సొంత ఫొటోలు పెట్టుకొని ప్రచారం చేసుకుంటున్నాని అన్నారు. ప్రధాన మంత్రి ఆవాస్‌‌ యోజన, ఫసల్‌‌ బీమా యోజన, మాతృ వందన, అన్నకల్యాణ్‌‌ యోజన రాష్ట్రంలో ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. వరంగల్‌‌ 2016లో కేంద్రం సైనిక్‌‌ స్కూల్​ ఇస్తే రాష్ట్రం దానికి భూమి ఇవ్వడం లేదన్నారు.హైదరాబాద్‌‌కు సైన్స్ సిటీని కేంద్రం మంజూరు చేసినా రాష్ట్ర ప్రభుత్వం భూమి కేటాయించలేదని తెలిపారు. కేసీఆర్‌‌ హైదరాబాద్‌‌లో నాలుగు, జిల్లాకు ఒకటి సూపర్‌‌ స్పెషాలిటీ హాస్పిటల్‌‌ నిర్మిస్తామని చెప్పి ఉన్న ఉస్మానియా, గాంధీ హాస్పిటళ్లను కూడా విస్మరించారని ఆయన మండిపడ్డారు. గ్రామీణ సడక్‌‌ యోజనకు వేల కోట్లు ఇచ్చామని, నేషనల్‌‌ హైవేలు, ఫోర్‌‌లేన్‌‌ ఫ్లై ఓవర్లకు భారీ ఎత్తున నిధులు ఇచ్చామని తెలిపారు. రామగుండం ఎఫ్‌‌సీఐని పునరుద్ధరించామని, రీజినల్‌‌ రింగ్‌‌ రోడ్డును నిర్మిస్తున్నామన్నారు. 

కేసీఆర్​కు భయం పట్టుకుంది

గత పార్లమెంట్‌‌ ఎన్నికల్లో రాష్ట్రంలో తాము 4 సీట్లు గెలిచామని, 2 సీట్లలో స్వల్ప ఓట్లతో ఓడిపోయామని అమిత్​ షా చెప్పారు. హైదరాబాద్‌‌ కార్పొరేషన్‌‌ ఎన్నికల్లో భారీ విజయం సాధించామని, తర్వాత జరిగిన ఎన్నికల్లోనూ గెలుస్తూ వస్తున్నామన్నారు. కేసీఆర్‌‌ ఇస్తామన్న నిరుద్యోగ భృతి ఏమైందని ఆయన ప్రశ్నించారు. ఎస్సీ, ఎస్టీలకు 3 ఎకరాల భూమి ఇస్తామని చెప్పి 30 సెంట్లు కూడా  ఇవ్వలేదన్నారు. ఎంబీసీలకు ఏటా వెయ్యి కోట్లు ఇస్తామని చెప్పి మోసం చేశారని మండిపడ్డారు. ఉద్యోగ, ఉపాధ్యాయ నియామకాలు చేపట్టలేదన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చింది కొడుకు, బిడ్డకోసమేనా అని ప్రశ్నించారు. రేపు ఎన్నికలు వచ్చినా తలపడేందుకు బీజేపీ సిద్ధంగా ఉందన్నారు. ఈ సభలో చేస్తున్న భారత్‌‌ మాతాకీ జై నినాదాలతో కేసీఆర్‌‌కు భయం పట్టుకుందని, రాష్ట్రంలో మార్పు కోసం ప్రతి ఒక్కరూ నినదించాలని అమిత్​ షా పిలుపునిచ్చారు.

కొడుకు, కూతురికే అధికారం.. మరి సర్పంచ్​లకేది?

సర్పంచ్​లకు అధికారమిస్తామని చెప్పి.. కొడుకు, కూతురుకు అధికారం కట్టబెట్టారని కేసీఆర్​పై అమిత్​ షా మండిపడ్డారు. సర్పంచ్‌‌లకు కనీస అధికారాలు కూడా ఇవ్వడం లేదన్నారు. తెలంగాణ ఎవ్వరి జాగీరు కాదని, ఇక్కడ అందరికీ సమాన హక్కులుంటాయని చెప్పారు. అంబేద్కర్‌‌ రాసిన రాజ్యాంగాన్నే కేసీఆర్‌‌ మార్చాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఫైవ్​స్టార్​ ఫామ్​హౌస్​లో కూర్చొని కేసీఆర్​ ముందస్తు ఎన్నికల గురించి చర్చిస్తున్నడట. కేసీఆర్​.. జల్ది కాదు, రేపే ఎన్నికలకు వెళ్లినా ఎదుర్కొనేందుకు బీజేపీ సిద్ధంగా ఉంది. నీ కుటుంబ, అవినీతి, మంత్ర తంత్రాల సర్కార్​ కూలడం,  బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం. తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలైన నీళ్లు, నిధులు, నియామకాల హామీ ఏమైంది? రాష్ట్రంలో మేం అధికారంలోకి వస్తే.. ఆ హామీని వెంటనే అమలు చేస్తం.

హైదరాబాద్​ నుంచి నిజాంను దించేందుకు చేపట్టిందే ఈ ప్రజాసంగ్రామ యాత్ర. ఇది ఆ నిజాంకు శ్రద్ధాంజలిలాంటిది. తెలంగాణ రాష్ట్రానికి రజాకార్​ నుంచి విముక్తి కల్పిద్దాం. నేను, నా కొడుకు, నా బిడ్డ.. అని పాలిస్తున్న ఈ సర్కార్​ను పెకిలించేద్దాం. రాష్ట్రాన్ని కేసీఆర్​ నిండా అప్పుల్లో ముంచిండు. ఇంకా అప్పులు కావాలని అడుగుతున్నడు.  ఎందుకు కేసీఆర్​.. ఇంకా అప్పులు? నీ కొడుకు, కూతురు ఖజానా నింపుకోడానికా? ఎన్ని స్కాములు చేసినా కడుపు నిండలేదా?
- అమిత్​ షా

Tagged Bjp, power, KCR, Padayatra, amit shah, CM, Thukkuguda meeting

Latest Videos

Subscribe Now

More News