యూత్ ను డ్రగ్స్‌‌ నాశనం చేస్తున్నాయి

యూత్ ను డ్రగ్స్‌‌ నాశనం చేస్తున్నాయి
  • డ్రగ్స్‌ పీడ పోవాలె
  • సౌత్ సీఎంల మీటింగులో అమిత్ షా
  • చిన్నారులపై నేరాలకు 60 రోజుల్లోపు శిక్ష
  • తెలంగాణ మాకు 6,000 కోట్ల 
  • కరెంటు బకాయిలియ్యాలె: జగన్
  • 3,442 కోట్లేనన్న తెలంగాణ సీఎస్
  • రాష్ట్రం నుంచి హాజరైన మంత్రి మహమూద్​ అలీ

 

డ్రగ్స్‌‌పై ఉక్కుపాదం మోపాలని దక్షిణాది రాష్ట్రాలకు కేంద్ర హోం మంత్రి అమిత్‌‌ షా సూచించారు. ఆదివారం తిరుపతిలో సదరన్‌‌ జోనల్‌‌ 29వ మీటింగులో ఆయన మాట్లాడారు. దేశ భవిష్యత్తయిన యూత్ ను డ్రగ్స్‌‌ నాశనం చేస్తున్నాయని అన్నారు. ‘‘డ్రగ్స్ రవాణా, అమ్మకాలను పూర్తిగా రూపుమాపాలి. ఇందుకు పకడ్బందీ చర్యలు చేపట్టాలి. సీఎంలు దీనికి ప్రాధాన్యమివ్వాలి” అని సూచించారు. చిన్నారులపై హింసను, అత్యాచారాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించొద్దన్నారు. 
‘‘ఇలాంటి దాడులకు పాల్పడే వారిపై 60 రోజుల్లో చర్యలుండేలా నిబంధనలు రూపొందించండి. దీనికి కూడా రాష్ట్రాలన్నీ అధిక ప్రాధాన్యమివ్వాలి” అని సూచించారు. కరోనా సెకండ్‌ డోస్‌ వ్యాక్సినేషన్‌లో కూడా రాష్ట్రాలు వేగం పెంచాలన్నారు. దీన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ సిబ్బందికి స్పష్టమైన ఆదేశాలివ్వాలని చెప్పారు. ఇండియన్‌ పీనల్‌ కోడ్‌, క్రిమినల్‌ ప్రొసిజర్‌కోడ్‌, ఎవిడెన్స్‌ యాక్టుల్లో సవరణలకు కేంద్రం ప్రయత్నాలు ప్రారంభించిందని వెల్లడించారు.  

 

  • రాష్ట్రానికో ఫోరెన్సిక్ కాలేజీ రావాలె

ప్రధాని నరేంద్రమోడీ ప్రత్యేక చొరవతో నేషనల్‌ ఫోరెన్సిక్ సైన్స్‌ యూనివర్సిటీ, రాష్ట్రీయ రక్షా యూనివర్సిటీలను స్థాపించామని అమిత్ షా గుర్తు చేశారు. ‘‘రాష్ట్రాలు కూడా తమ ప్రాంతీయ భాషలో ఫోర్సెన్సిస్‌ సైన్స్‌ కాలేజీ ఏర్పాటు చేసుకోవాలి. తద్వారా ఫోర్సెన్సిక్‌ ఇన్వెస్టిగేషన్‌కు ట్రైన్డ్ మ్యాన్ పవర్ దొరుకుతుంది. కేసుల ప్రాసిక్యూషన్‌లో వేగం పెంచడానికి రాష్ట్రాలు ఇండిపెండెంట్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డైరెక్టర్‌ (ప్రాసిక్యూషన్‌)ను ఏర్పాటు చేసుకోవాలి. నవంబర్‌ 15ను జాతీయ గౌరవ్‌ దివస్‌గా నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది. స్వాతంత్య్ర పోరాటం, దేశాభివృద్ధిలో గిరిజనుల తోడ్పాటు, సహకారాన్ని చాటిచెప్పుకోవడానికి ఏటా నవంబర్ 15 నుంచి వారం పాటు ఉత్సవాలు నిర్వహించుకుందాం” అని అన్నారు. అంతా సరేనంటే కౌన్సిల్‌ తర్వాతి మీటింగు తిరువనంతపురంలో పెట్టుకుందామని సూచించినట్టు తెలిసింది. 51 పెండింగ్‌ సమస్యలకు గాను 40 సమస్యలకు మీటింగులో పరిష్కారం దొరికిందని తర్వాత షా ట్వీట్‌ చేశారు. పుదుచ్చేరి లెఫ్టినెంట్‌ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌, అండమాన్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ దేవేంద్రకుమార్‌ జోషి, కర్నాటక సీఎం బస్వరాజు బొమ్మై, పుదుచ్చేరి సీఎం రంగసామి, తమిళనాడు మంత్రి పొన్ముడి, కేరళ మంత్రి రాజన్‌ తదితరులు పాల్గొన్నారు.

  • విభజన చట్టం హామీల మాటెత్తని తెలంగాణ

విభజన చట్టంలో ఇచ్చిన హామీల ఊసు కూడా కౌన్సిల్‌ మీటింగ్‌లో తెలంగాణ ఎత్తలేదు. సీఎం కేసీఆర్ తరఫున హోం మంత్రి మహమూద్‌ అలీ హాజరయ్యారు. ‘‘రెండు రాష్ట్రాల మధ్య కొన్ని సమస్యలు కోర్టుల్లో పెండింగులో ఉన్నయి. వాటిని సామరస్యంగా పరిష్కరించుకుంటం. ఈ మీటింగులో చర్చకు వచ్చిన మా రాష్ట్ర అంశాలను త్వరగా పరిష్కరించాలె. వ్యవసాయ రంగ మెరుగుదల కోసం ఎన్నో చర్యలు చేపట్టినం. కృష్ణా, గోదావరి నీళ్లను సమర్థంగా వాడుకుంటున్నం. 60 లక్షల మందికి రైతుబంధు అందిస్తున్నం” అని చెప్పుకొచ్చారు.

  • తెలంగాణ 6,000 కోట్లియ్యాలె: జగన్

కేంద్రం విజ్ఞప్తి మేరకే తెలంగాణకు కరెంటు సరఫరా చేశామని, ఇందుకు సంబంధించి రూ.6 వేల కోట్ల బకాయిలున్నాయని ఏపీ సీఎం జగన్‌ అన్నారు. వాటిని ఇప్పించే బాధ్యత కేంద్రమే తీసుకోవాలని కోరారు. ఏపీ జెన్ కో కు చెల్లించాల్సింది రూ.3,442 కోట్లేనని తెలంగాణ సీఎస్ సోమేశ్ కుమార్ చెప్పారు. అవసరమైన కరెంటివ్వని కారణంగా తెలంగాణకు జరిగిన నష్టానికి గాను ఏపీయే తమకు రూ.4,457 కోట్లు ఇవ్వాల్సి ఉంటుందన్నారు. వీటిపై రెండు రాష్ట్రాలు కూర్చొని మాట్లాడుకోవాలని షా సూచించినట్టు సమాచారం. ‘‘రెండు రాష్ట్రాల మధ్య ఆస్తుల పంపిణీపై ఇంకా పరిష్కారం దొరకలేదు.  ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని పార్లమెంట్‌ సాక్షిగా ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి. పోలవరం ఖర్చులను 2013‌–-14 నాటి లెక్కన కట్టిస్తామంటున్నారు. ఇది మా రాష్ట్రానికి తీరని అన్యాయం” అన్నారు. సోమేశ్ మాట్లాడుతూ, ఢిల్లీలోని ఏపీ భవన్ పంపకాలపై ఏపీ చేసిన రెండు సూచనలపై ఏకాభిప్రాయం లేదన్నారు. ‘‘విభజన చట్టం తొమ్మిది, పదో షెడ్యూళ్లలోని 23 సంస్థల విభజనపై మా అభ్యంతరాలను లెక్కలోకి తీసుకోవాలె. హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ పై ఏపీ కోర్టుకు పోయింది. దీనిపై తగిన చర్యలు తీసుకోండి. తెలంగాణకు ట్రైబల్ వర్సిటీ ఇవ్వండి. ఇందుకు 335 ఎకరాలు కేటాయించి డీపీఆర్ కూడా ఇచ్చినం” అన్నారు. మిగులు జలాల ఆధారంగా ఉమ్మడి రాష్ట్రంలో చేపట్టిన పాలమూరు,- రంగారెడ్డి, నక్కలగండి, సంగంబండ ప్రాజెక్టులపై కర్నాటక అభ్యంతరాలు సరికాదన్నారు. ‘‘విభజన సమస్యలు, జలవివాదాలు తెలంగాణ, ఏపీలకే పరిమితం కాదు. అవి జాతీయ సమస్యలు. రెండు రాష్ట్రాలు ముందుకొచ్చి పట్టువిడుపులతో పరిష్కరించుకోవాలి” అని ఆయన చెప్పారు.