ఆర్టీసీ కార్మికులకు అండగా ఉండండి: బీజేపీ రాష్ట్ర నాయకులతో అమిత్‌షా

ఆర్టీసీ కార్మికులకు అండగా ఉండండి: బీజేపీ రాష్ట్ర నాయకులతో అమిత్‌షా

వెల్లడించిన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్

కేంద్ర హోంమంత్రితో నేతల భేటీ

ఆర్టీసీ, రాష్ట్ర పరిస్థితులపై నివేదిక

ఏ రాష్ట్ర సర్కారు ఆర్టీసీకి బకాయి పెట్టలే: లక్ష్మణ్

కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నరు: వివేక్

పార్టీలో చేరికపై షాతో మోత్కుపల్లి చర్చ

ఆర్టీసీ కార్మికులకు అండగా నిలవాలని బీజేపీ రాష్ట్ర నేతలకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌‌‌‌షా దిశానిర్దేశం చేశారు. అన్ని వర్గాలకు అండగా ఉండేలా ముందుకు సాగాలని సూచించారు. సోమవారం ఢిల్లీలో కేంద్రమంత్రి షాతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, ఎంపీ గరికపాటి మోహన్‌‌‌‌రావు, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి, నేతలు మోత్కుపల్లి నర్సింహులు, వీరేందర్‌‌‌‌గౌడ్ దాదాపు అరగంటకు పైగా సమావేశమయ్యారు. ఆర్టీసీ సమ్మె, టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ పాలనపై నివేదికిచ్చారు. సమ్మెపై ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను వివరించారు. తర్వాత మీడియాతో లక్ష్మణ్‌‌‌‌ మాట్లాడారు. ఏపీఎస్ ఆర్టీసీలో కేంద్రం వాటా 31 శాతం ఉందని, లీగల్ డాక్యుమెంట్లు లేకుండా టీఎస్‌‌‌‌ ఆర్టీసీని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన విషయాన్ని షాకు తెలిపామన్నారు. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం సాధ్యం కాదనేదే రాష్ట్ర మంత్రి వర్గ నిర్ణయమైతే కార్మిక సంఘాల నేతలతో చర్చించి పరిష్కరించాలన్నారు. నియంతలా హుకుం జారీ చేయడం సరికాదన్నారు. ఉద్యమం టైంలో ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణిస్తామన్న కేసీఆర్.. మాట నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. పన్నులు తగ్గిస్తే ఆర్టీసీ లాభాల బాటలో వెళ్తుందని టీఆర్ఎస్ సర్కారు చెప్పలేదా అని ప్రశ్నించారు. కేసీఆర్ సర్కారులా దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వమూ ఆర్టీసీకి బకాయి పెట్టలేదని చురకలంటించారు.

సర్కారును ఎండగడుతున్నరనే కేసులు: వివేక్

రాష్ట్రంలో బీజేపీ కార్యకర్తలపై అక్రమ కేసుల వ్యవహారాన్ని షా దృష్టికి తీసుకెళ్లినట్లు వివేక్ తెలిపారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు, వైఫల్యాలను ఎండ గడుతోన్న బీజేపీ శ్రేణులపై అక్రమంగా కేసులు పెడుతున్నారని విమర్శించారు. పేద, మధ్య తరగతి ప్రజల జీవితాల్లో వెలుగులు నింపేలా తీసుకొచ్చేలా కేంద్రం ప్రవేశ పెట్టిన పథకాలను రాష్ట్ర సర్కారు అమలు చేయడం లేదని, ఆ నిధులను పక్కదారి పట్టిస్తోందని మంత్రికి వివరించినట్టు తెలిపారు. ఆర్టీసీ సమ్మె విషయంలో కేసీఆర్ సర్కారు నియంతృత్వ ధోరణిని ఆయన దృష్టికి తీసుకెళ్లామన్నారు. బీజేపీ అధినాయకత్వం త్వరలో రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలపై ఫోకస్ చేస్తుందని షా హామీ ఇచ్చారన్నారు.

రాష్ట్రంలో చీడపురుగు కేసీఆర్‌‌‌‌: మోత్కుపల్లి 

బీజేపీ నేతలతో కలసి సోమవారం అమిత్‌‌‌‌ షాను కలిసిన మోత్కుపల్లి.. పార్టీలో చేరికపై చర్చించారు. ఈ నెల 9 న హైదరాబాద్ పర్యటనకు రానున్న బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా సమక్షంలో ఆయన పార్టీలో చేరతారని లక్ష్మణ్‌‌‌‌ చెప్పారు. మోత్కుపల్లి రాకను బీజేపీ రాష్ట్ర నాయకత్వం స్వాగతిస్తోందని, ఆయన రాకతో రాష్ట్రంలో పార్టీ బలపడుతుందని చెప్పారు. కుటుంబ పాలనను గద్దె దించాలనే బీజేపీలో చేరుతున్నట్లు మోత్కుపల్లి చెప్పారు. తెలంగాణ పేరు మీద అధికారంలోకి వచ్చిన కేసీఆర్, అమరులైన 12 వందల మంది రక్తాన్ని తాగుతున్నారని విమర్శించారు. రాష్ట్రంలో కేసీఆర్ చీడ పురుగని విమర్శించారు.

మమ్మల్నడిగే నైతిక హక్కు మీకెక్కడిది: రాకేష్​ రెడ్డి

హైదరాబాద్, వెలుగు: బీజేపీ ఎంపీలను ప్రశ్నించే నైతిక హక్కు సీఎం కేసీఆర్​కు లేదని ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాకేష్​ రెడ్డి విమర్శించారు. రాష్ట్ర అభివృద్ధి కోసం టీఆర్ఎస్​ ఎంపీలు ఏంచేస్తున్నారో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. కాగ్​తో మొట్టికాయలు వేయించుకుంది ముఖ్యమంత్రేనని ఆయన గుర్తుచేశారు. డీపీఆర్​లు లేకుండా ప్రాజెక్టుల్లో అవినీతికి పాల్పడుతున్నారని విమర్శించారు. కేంద్ర వాహన చట్టంలో ఆర్టీసీని ప్రైవేటీకరించాలని, కార్మికులను తొలగించాలని ఎక్కడుందో సీఎం చెప్పాలని మండిపడ్డారు. ఈమేరకు సోమవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో రాకేష్​ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఆర్టీసీ కార్మికుల జీతాల గురించి, వారి కష్టాల గురించి బీజేపీ కేసీఆర్​ను ప్రశ్నిస్తుంటే, ప్రజలను తప్పుదోవ పట్టించే రీతిలో ఆయన దిగజారి మాట్లాడుతున్నారని ఆరోపించారు. వెనకబడిన బీహార్ వంటి రాష్ట్రాలతో మన రాష్ట్రాన్ని పోల్చడం చూస్తుంటే.. కేసీఆర్​పాలన ఎలా ఉందో అర్థంచేసుకోవచ్చని రాకేష్​ రెడ్డి అన్నారు.