అమిత్ షా రాకతో సాంబమూర్తి నగర్ వాసుల సంతోషం

అమిత్ షా రాకతో సాంబమూర్తి నగర్ వాసుల సంతోషం

కేంద్ర హోం మంత్రి అమిత్ షా సికింద్రాబాద్ లోని సాంబమూర్తి నగర్ కాలనీకి చేరుకున్నారు. కాలనీ పరిధిలోని కళాసిగూడలో ఉన్న బీజేపీ కార్యకర్త సత్యనారాయణ ఇంటికి వెళ్లారు. అమిత్ షాకు స్థానిక కార్పొరేటర్ స్వాగతం పలికారు. అనంతరం కేంద్ర హోం మంత్రిని బీజేపీ కార్యకర్త సత్యనారాయణ తన ఇంట్లోకి సాదరంగా ఆహ్వానించారు.  అనంతరం సత్యనారాయణ అందించిన వేడివేడి కాఫీని షా తాగారు.కాఫీ తాగుతూ.. సత్యనారాయణ బాగోగులు అడిగి తెలుసుకున్నారు. సత్యనారాయణ ఇంటికి అమిత్ షా చేరుకోగానే స్థానిక బీజేపీ కార్యకర్తలు ఆయనను కలిసేందుకు పోటీపడ్డారు. దీంతో వారిని పోలీసులు అదుపు చేశారు. సత్యనారాయణ ఇంట్లోకి కేవలం అనుమతి ఉన్న అతికొద్ది మందిని మాత్రమే అనుమతించారు.  షా వెంట కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి,  తెలంగాణ బీజేపీ వ్యవహారాల ఇంచార్జి తరుణ్ చుగ్, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ ఉన్నారు. 

మా జన్మ ధన్యమైంది.. 

బీజేపీ కార్యకర్త సత్యనారాయణ, ఆయన కుటుంబ సభ్యులు ‘వీ6’తో మాట్లాడుతూ.. ‘‘ఈ రోజు మా జన్మ ధన్యమైంది. మొత్తం దేశానికి హోం మంత్రిగా ఉన్న వ్యక్తి .. చిన్నపాటి బస్తీలో ఉన్న మా  ఇంటికి రావడం నిజంగా గొప్ప అదృష్టం. మేం దీన్ని జీవితాంతం మర్చిపోలేం. నిన్నటి నుంచి మా కాలనీలో పండుగ వాతావరణం ఉంది. అమిత్ షా కోసం వేయికళ్లతో ఎదురుచూశాం. ఆయన మా ఇంటికి రాగానే ఆనందాన్ని ఆపుకోలేకపోయాం’’ అని వారు చెప్పుకొచ్చారు.  ఈక్రమంలో సత్యనారాయణ, ఆయన కుటుంబీకులు భావోద్వేగానికి గురయ్యారు. బీజేపీలో సామాన్య కార్యకర్తకు కూడా గుర్తింపు ఉంటుందని ఈ ఘటన నిరూపించిందని సత్యనారాయణ వ్యాఖ్యానించారు. బీజేపీలో దళితులకు తగిన ప్రాధాన్యం ఉంటుందన్నారు. 

కాలనీ వాసుల సంతోషం

కేంద్ర హోం మంత్రి అమిత్ షా రాకపై  సాంబమూర్తి నగర్ కాలనీ వాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర హోం మంత్రి.. సామాన్య బీజేపీ కార్యకర్త ఇంటికి వస్తారని తాము ఊహించలేదని బస్తీ వాసులు చెప్పుకొచ్చారు. బీజేపీలో చిన్నపాటి కార్యకర్తకు కూడా గుర్తింపు ఉంటుందని చెప్పడానికి ఇదే ఉదాహరణ అని వెల్లడించారు. దళిత వాడకు వచ్చి అమిత్ షా కాఫీ తాగడం.. బలహీన వర్గాలపై బీజేపీ దృక్పథాన్ని చాటి చెబుతోందని స్థానికులు అభిప్రాయపడ్డారు. స్థానికంగా కాలనీలో ఎన్నో సమస్యలున్నాయని.. వాటిని పరిష్కరించేందుకు కృషి చేయాలని కోరారు. 

మునుగోడు సభలో పాల్గొనేందుకు.. 

మునుగోడులో బీజేపీ నిర్వహించే భారీ బహిరంగసభలో పాల్గొనేందుకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా హైదరాబాద్ కు వచ్చారు. మధ్యాహ్నం బేగంపేట విమానాశ్రాయానికి చేరుకున్న అమిత్ షాకు తెలంగాణ ఇంచార్జి తరుణ్ చుగ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ తో పాటు 15 మంది కార్పొరేటర్లు స్వాగతం పలికారు. అనంతరం అక్కడి నుంచి సికింద్రబాద్ లోని ఉజ్జయిని మహంకాళీ టెంపుల్ కు ఆయన చేరుకున్నారు. ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో అమిత్ షాకు స్వాగతం పలికారు. అమ్మవారికి అమిత్ షా ప్రత్యేక పూజలు చేశారు.