విమోచన వేడుకలకు అమిత్ షా..పరేడ్ గ్రౌండ్​లో భారీ బహిరంగ సభ

విమోచన వేడుకలకు అమిత్ షా..పరేడ్ గ్రౌండ్​లో భారీ బహిరంగ సభ
  • ఏర్పాట్లు చేస్తున్న బీజేపీ రాష్ట్ర నాయకత్వం 
  • ముఖ్య నేతలతో కిషన్ రెడ్డి టెలీ కాన్ఫరెన్స్ 
  • జన సమీకరణపై ఫోకస్ 

హైదరాబాద్, వెలుగు: సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో భారీ బహిరంగ సభ నిర్వహించాలని బీజేపీ నిర్ణయించింది. దీనికి ముఖ్య అతిథిగా హాజరయ్యేందుకు అమిత్ షా ఓకే చెప్పడంతో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నది. నిజానికి ముందుగా ఖరారైన షెడ్యూల్ ప్రకారం.. ఈసారి కూడా గతేడాది లెక్కనే పరేడ్ గ్రౌండ్ లో కేంద్రం ఆధ్వర్యంలో విమోచన వేడుకలు అధికారికంగా నిర్వహించాలని నిర్ణయించారు. ముఖ్య అతిథిగా కేంద్రం నుంచి ఎవరో ఒకరు వస్తారని బీజేపీ స్టేట్ చీఫ్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఇటీవల ప్రకటించారు. అయితే అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడడం, అదేరోజు హైదరాబాద్ లో కాంగ్రెస్ సభ జరగనుండడం, దానికి సోనియా, రాహుల్, ప్రియాంక లాంటి అగ్ర నేతలు హాజరవుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ కు దీటుగా భారీ సభ పెట్టాలని బీజేపీ నిర్ణయించింది. ఇందులో భాగంగా ఈ నెల 17న ఉదయం విమోచన ఉత్సవాల అనంతరం పరేడ్ గ్రౌండ్ లోనే సభ నిర్వహించాలని ప్లాన్ చేసింది. సభ ఏర్పాట్లపై గురువారం ముఖ్య నేతలతో కిషన్ రెడ్డి టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. సభను సక్సెస్ చేయాలని, భారీగా జనసమీకరణ చేయాలని నేతలకు దిశానిర్దేశం చేశారు. హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల నుంచే ఎక్కువ మందిని తరలించడంపై నేతలు దృష్టి పెట్టారు. సిటీని ఆనుకుని ఉన్న, రైల్వే కనెక్టివిటీ ఉన్న ప్రాంతాల నుంచి జనాన్ని తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. టెలీ కాన్ఫరెన్స్​లో రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు ప్రేమేందర్ రెడ్డి, దుగ్యాల ప్రదీప్ కుమార్, జిల్లాల అధ్యక్షులు, ఇన్ చార్జ్ లు పాల్గొన్నారు. 

ఇయ్యాల ఆఫీస్ బేరర్ల మీటింగ్.. 

బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం మధ్యాహ్నం ఒంటిగంటకు స్టేట్ ఆఫీస్ బేరర్ల మీటింగ్ నిర్వహించనున్నారు. ఇందులో ప్రధానంగా అమిత్ షా సభపై చర్చించనున్నారు. కిషన్ రెడ్డి అధ్యక్షతన జరగనున్న ఈ మీటింగ్ కు చీఫ్ గెస్టులుగా పార్టీ రాష్ట్ర ఎన్నికల ఇన్ చార్జ్ ప్రకాశ్ జవదేకర్, రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జ్ లు తరుణ్ చుగ్, సునీల్ బన్సల్ హాజరుకానున్నారు. ఆఫీసు బేరర్లతో పాటు అన్ని జిల్లాల అధ్యక్షులు, ఇన్ చార్జ్ లు ఇందులో పాల్గొంటారు. రానున్న ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, బస్సు యాత్ర, మోదీ బర్త్ డే కార్యక్రమాల నిర్వహణ తదితర అంశాలపై మీటింగ్​లో చర్చించనున్నారు.