వలస కూలీల రైళ్లను అనుమతించని బెంగాల్‌ సర్కార్‌‌

వలస కూలీల రైళ్లను అనుమతించని బెంగాల్‌ సర్కార్‌‌
  • దీదీకి లెటర్‌‌ రాసిన షా

న్యూఢిల్లీ: వలస కూలీలను తరలించే ‘‘శ్రామిక్‌ ఎక్స్‌ప్రెస్‌” రైళ్లకు బెంగాల్‌ ప్రభుత్వం అనుమతి ఇవ్వడం లేదని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ఆరోపించారు. ఈ మేరకు బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీకి ఘాటు లేఖ రాశారు. లాక్‌డౌన్‌ సమయంలో వలస కూలీల తరలింపుకు అనుమతి ఇవ్వకపోవడం అన్యాయమని షా అన్నారు. ఇప్పటి వరకు 2లక్షల మంది దేశంలోని వివిధ ప్రాంతాలకు తరలివెళ్లారని చెప్పారు. బెంగాల్‌లో చిక్కుకుపోయిన వలస కార్మికులు కూడా వారి ఊళ్లకు వెళ్లేందుకు ఆసక్తిగా ఉన్నారని, కానీ పశ్చిమబెంగాల్‌ సర్కార్‌‌ అనుమతి ఇవ్వడం లేదని అన్నారు. దీని వల్ల కార్మికులు చాలా అవస్థలు పడుతున్నారని చెప్పారు. “ ఇప్పటికి రెండు లక్షల మంది కూలీలను తరలించాం. కానీ పశ్చిమబెంగాల్‌ సర్కార్‌‌ మాత్రం దానికి సహకరించడం లేదు. ఆ రాష్ట్రంలోని వలస కూలీలకు అన్యాయం చేస్తోంది. ఇలా చేయడం సరైంది కాదు. భవిష్యత్తులో వాళ్లంతా చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఇప్పటికైనా రైళ్లను అనుమతించండి” అని షా లెటర్‌‌లో చెప్పారు. కరోనా విషయంలో పశ్చిమబెంగాల్‌ సర్కార్‌‌, కేంద్ర మధ్య మొదటి నుంచి వార్‌‌ నడుస్తూనే ఉంది. ప్రజారోగ్య సంక్షోభాన్ని కేంద్రం రాజకీయం చేస్తోందని బెంగాల్‌ ప్రభుత్వం ఆరోపిస్తోంది.