అమిత్ షాతో జూనియర్ ఎన్టీఆర్ సమావేశం!

అమిత్ షాతో జూనియర్ ఎన్టీఆర్ సమావేశం!

హైదరాబాద్:  ఇవాళ కేంద్ర మంత్రి అమిత్ షా తో జూనియర్ ఎన్టీఆర్ సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. శంషాబాద్ నోవాటెల్ హోటల్ కు రావాలని ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ కు ఆహ్వానం అందినట్లు కూడా ప్రచారం జరుగుతోంది. నోవాటెల్ లో.. అమిత్ షాతో జూనియర్ ఎన్టీఆర్  ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. మునుగోడులో సమరభేరి సభకు ముఖ్య అతిథిగా వస్తున్న అమిత్ షా.. ఎన్టీఆర్ ను ప్రత్యేకంగా భేటీకి ఆహ్వానించడం హాట్ టాపిక్ గా మారింది. 2009 ఎన్నికల్లో టీడీపీ తరపున తారక్ ప్రచారం చేశారు.  అప్పటి నుంచి రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. సినిమాలు చేసుకుంటున్నారు తప్ప ఎలాంటి రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు.

ఈ అనూహ్య పరిణామంతో  రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. గత కొంత కాలంగా రాష్ట్రంపై ప్రత్యేక దృష్టి సారించిన బీజేపీ రానున్న రోజుల్లో దూకుడు మరింత పెంచనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో ఎలాగైనా అధికారంలోకి వచ్చే దిశలో ప్రణాళికలు సిద్ధం చేస్తున్న బీజేపీ అధిష్టానం.. అన్ని అవకాశాలను అందిపుచ్చుకునే దిశలో ముందుకు వెళ్తుంది. హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఘన విజయంతో దేశ వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించిన విషయం తెలిసిందే. ఇప్పుడు అదే ఊపులో మునుగోడులో ఉప ఎన్నికలో విజయం సాధించేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది.