అమితాబ్ కు ఎలాంటి గాయాలయ్యాయి..  అప్పుడు ప్రభాస్ ఎక్కడున్నారు.. ఎలా స్పందించారు

అమితాబ్ కు ఎలాంటి గాయాలయ్యాయి..  అప్పుడు ప్రభాస్ ఎక్కడున్నారు.. ఎలా స్పందించారు

ప్రభాస్ కొత్త మూవీ ప్రాజెక్ట్ కె షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతుంది. ఫాంటసీ డ్రామా కథతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. షూటింగ్ లో అమితాబ్ గాయపడినట్లు మార్చి 6వ తేదీన ప్రకటించింది చిత్ర యూనిట్.. అయితే అమితాబ్ బచ్చన్ కు ఎలాంటి గాయాలు అయ్యాయి.. రెండు వారాల విశ్రాంతి అని చెప్పటంతో అందరిలో అందోళన నెలకొంది. అమితాబ్ బచ్చన్ కు ఎలాంటి గాయాలు అయ్యాయో తెలుసుకుందాం...

షూటింగ్ సందర్భంగా ఓ యాక్షన్ సన్నివేశంలో నటిస్తున్న అమితాబ్.. అదుపు తప్పి కింద పడ్డారు. 80 ఏళ్ల అమితాబ్.. వయస్సు రీత్యా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇలాంటి సమయంలోనే షూటింగ్ లో ప్రమాదం జరగటంతో ఆయన ఆరోగ్యంపై అభిమానుల్లో ఆందోళన నెలకొంది. 10 అడుగుల ఎత్తు నుంచి ఆయన పక్కకు పడినట్లు సమాచారం. కింద పడే సమయంలో చెయ్యి బలంగా అడ్డుపెట్టటం.. ఓ వైపు పక్కకు పడిపోయారు. దీంతో చేతికి దెబ్బతగిలింది.. అదే విధంగా పక్కటెముకకు గాయం అయ్యింది. గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రిలో సిటీ స్కాన్ చేసిన డాక్టర్ల బృందం.. చేతికి స్వల్ప గాయం అయ్యినట్లు తేల్చారు. అదే విధంగా పక్కటెముకకు బాగా వత్తుకున్నదని స్పష్టం చేశారు డాక్టర్లు. నొప్పులు కూడా అధికంగా ఉంటాయని.. కొన్ని వారాలు విశ్రాంతి తీసుకోవాలని.. ఎక్కువగా తిరగకూడదని.. బెడ్ రెస్ట్ అవసరం అని డాక్టర్లు సూచించటంతో.. హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో ముంబై వెళ్లిపోయారు అమితాబ్ బచ్చన్. ముంబైలో ఉంటే.. ప్రతిరోజూ సాయంత్రం తన ఇంటికి వచ్చే అభిమానులను కలవటం అమితాబ్ బచ్చన్ కు అలవాటు.. గాయాల కారణంగా ఎవర్నీ కలవటం లేదని.. ఎవరూ ఇంటికి రావొద్దని ప్రకటించారు. కొన్ని వారాలు విశ్రాంతి అవసరం అని.. నొప్పులకు మందులు వాడుతున్నట్లు స్వయంగా ప్రకటించారు అమితాబ్..

అమితాబ్ కు గాయాలు అన్న వార్తతో.. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఎలా ఉన్నారు అనే ఆందోళన అభిమానుల్లో నెలకొంది. షూటింగ్ సమయంలో ప్రభాస్ ఉన్నారా లేదా.. అమితాబ్ తో కలిసి నటిస్తున్నారా లేదా అనేది ఇంకా స్పష్టత రాలేదు. అమితాబ్ కు గాయాలు అయిన సమయంలో ప్రభాస్ షూటింగ్ స్పాట్ లో నే ఉన్నారని కొన్ని వార్తలు అంటుంటే.. కాదు కాదు.. ఆయన షూటింగ్ స్పాట్ లో లేరని మరికొన్ని వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. షూటింగ్ లో అమితాబ్ గాయపడ్డారనే విషయం తెలిసిన వెంటనే.. బిగ్ బీకి ఎలా ఉంది.. ఏమైందీ.. ఎలాంటి గాయాలు అయ్యాయి అని ఆరా తీశారంట.. అమితాబ్ తో ఫోన్ లో మాట్లాడి.. గాయాలపై సానుభూతి వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది. 

ప్రాజెక్ట్ కె షూటింగ్ లో అమితాబ్ గాయపడినట్లు ప్రకటించిన చిత్ర యూనిట్.. ప్రభాస్ విషయాన్ని మాత్రం వెల్లడించలేదు.. అమితాబ్ త్వరగా కోలుకోవాలని ప్రభాస్ ఫ్యాన్స్.. ట్విట్టర్ వేదికగా.. గెట్ వెల్ సూన్ బిగ్ బీ అంటూ పోస్టులు పెడుతున్నారు.