
రిలయన్స్ గ్రూప్ ఛైర్మన్ అనిల్ అంబానీ కంపెనీలపై ఈడీ (ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్) రైడ్స్ చేస్తున్న వేళ.. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ పోస్ట్ సంచలనంగా మారింది. అనిల్ కు మద్ధతునిస్తూ ట్వీట్ చేశారు అమితాబ్. ఇప్పుడిది ముంబై బిజినెస్ సర్కిల్ లో, దేశరాజకీయాలలో హాట్ టాపిక్ గా మారింది.
మనీ లాండరింగ్ కేసులో అనిల్ అంబానీపై ఇటీవలే ఈడీ దర్యాప్తు ప్రారంభించింది. అనిల్ కంపెనీలు ఈ మధ్యే మంచి లాభాలతో, బిజినెస్ తో దూసుకుపోతున్న వేళ ఈడీ తనిఖీలతో గత రెండు మూడు సెషన్లలో కంపెనీ షేర్లు నష్టాలను చవిచూస్తున్నాయి. దీనిపై ఇన్వెస్టర్లలో ఇప్పటికే ఆందోళన నెలకొంది. ఇదే టైమ్ లో దర్యాప్తు గురించి పరోక్షంగా.. అనిల్ కు మద్ధతు ఇస్తున్నట్లుగా అమితాబ్ ఎక్స్ లో పోస్ట్ చేయడం సంచలనంగా మారింది.
ఆదివారం (జులై 27) ఎక్స్ లో బిగ్ బీ ఒక పోస్ట్ షేర్ చేశారు. క్యూరియస్ టైమింగ్ ఆఫ్ ఈడీ రైడ్స్.. అనే రిపోర్ట్ ను ఆయన జస్ట్ షేర్ చేశారంతే. అనిల్ అంబానీ, రిలయన్స్ అనే హ్యాష్ ట్యాగ్స్ తో షేర్ చేసిన ఈ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
T 5453 - https://t.co/wpKhXUywfu#anilambani #reliance
— Amitabh Bachchan (@SrBachchan) July 27, 2025
రిపోర్ట్ లో ఏముంది..?
అనిల్ అంబానీ గ్రూపులపై ఈడీ రైడ్స్ చేయడంపై ఒక ప్రముఖ ఇంగ్లీష్ పత్రిక ఒక రిపోర్ట్ ప్రకటించింది. పదేళ్ల ఓల్డ్ కేసును మళ్లీ టైమ్ చూసి ఈడీ ఓపెన్ చేయడం వెనుక కుట్ర ఉందా లేదా కోయిన్సిడెన్స్ గా జరుగుతుందా అనే కోణంలో రిపోర్ట్ ఉంది. అనిల్ అంబానీకి చెందిన కంపెనీలకు సంబంధించి 35 ప్రదేశాలలో జులై 24న ఈడీ రైడ్స్ ప్రారంభించింది. రూ. 3 వేల కోట్ల బ్యాంకు రుణం, మనీ ల్యాండరింగ్ కేసులో ఈడీ సోదాలు చేపట్టింది. 2017–19 మధ్య యెస్ బ్యాంక్ అనిల్ అంబానీ గ్రూప్ సంస్థలకు ఇచ్చిన రూ.3 వేల కోట్ల రుణాలను అక్రమంగా దారి మళ్లించారనే కేసులో ఈడీ మళ్లీ రైడ్స్ చేయడంపై ఇప్పటికే ఇన్వెస్టర్లు ఆందోళనలో ఉన్నారు.
రైడ్స్ పై ఇన్వెస్టర్ల ఆందోళన.. అనుమానాలు:
ఈడీ రైడ్స్ పై అనుమానాలు ఉన్నట్లు రిపోర్టులో పేర్కొంది. గత పదేళ్లుగా జరిగిన పరిణామాల తర్వాత.. అనిల్ అంబానీ కంపెనీలు దివాలా తీసిన తర్వాత.. రెండే రెండు కంపెనీలు ఆ మకిలీ నుంచి బయటపడి.. ఈ మధ్యే లాభాలతో దూసుకుపోతున్నాయి. రిలయన్స్ పవర్, రిలయన్స్ ఇన్ ఫ్రా కంపెనీలు బ్యాంకుల్లో ఎలాంటి అప్పులు లేకుండా జీరో డెట్ కంపెనీలుగా ప్రాఫిట్స్ లోకి వచ్చాయి. రిలయన్స్ ఇన్ ఫ్రా 14,883 కోట్లు, రిలయన్స్ పవర్ 16,431 కోట్ల నెట్ వర్త్ తో ఇన్వెస్టర్ల విశ్వాసాన్ని సంపాదించి లాభాల్లోకి వచ్చాయి.
►ALSO READ | అనిల్ అంబానీ సంస్థల్లో కొనసాగుతున్న ఈడీ సోదాలు
రిలయన్స్ ఇన్ ఫ్రా షేర్ విలువ రూ.176 నుంచి 360 రూపాయలకు చేరుకుంది. అంటే 100 శాతం పెరిగింది. అదే క్రమంలో రిలయన్స్ పవర్ రూ.25 నుంచి 60 రూపాయలకు పెరిగింది. అంటే లో లెవెల్ నుంచి 140 శాతం పెరిగి ఇన్వెస్టర్లకు సిరులు కురిపించింది. ఈ రెండు కంపెనీలు విస్తరణ దిశగా ఫండ్ రైజింగ్ చేస్తూ ముందుకు సాగుతున్నాయి.
ఇలాంటి తరుణంలో.. పదేళ్ల నాటి కేసును మళ్లీ తిరగదోడటం వెనుక ఏదైనా ఉద్దేశం ఉందా లేక యాదృచ్చికంగానే జరుగుతున్నాయా అనే కోణంలో ఉన్న రిపోర్ట్ ను అమితాబ్ బచ్చన్ షేర్ చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అనిల్ అంబానీకి, అమితాబ్ బచ్చన్ కు చాలా ఏళ్లుగా మంచి ఫ్రెండ్ షిప్ ఉంది. అందులో భాగంగా ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న అనిల్ అంబానీపై మరోసారి ఈడీ పేరున దాడులు చేస్తున్నారా..? అనే కోణంలో ఎక్స్ లో రిపోర్ట్ షేర్ చేసినట్లు స్పష్టమవుతోంది.