
- యెస్ బ్యాంక్ నుంచి తీసుకున్న రూ.3 వేల కోట్ల అప్పులను దారి మళ్లించారని ఆరోపణ
న్యూఢిల్లీ: రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీ సంస్థలపై ముంబైలో మూడో రోజైన శనివారం కూడా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోదాలు కొనసాగించింది. వేరు వేరు ప్రదేశాల నుంచి డాక్యుమెంట్లు, కంప్యూటర్ హార్డ్‌డిస్కులను స్వాధీనం చేసుకుంది. రూ.3 వేల కోట్ల బ్యాంక్ రుణ మోసం, మనీలాండరింగ్, ఆర్థిక అక్రమాల ఆరోపణలతో పీఎంఎల్‌ఏ కింద 35 కి పైగా ప్రదేశాల్లో సోదాలను ఈ నెల 24 నుంచి నిర్వహిస్తోంది.
ఇందులో 50 సంస్థలు ఉన్నాయి. 25 మంది వ్యక్తులను ప్రశ్నించారు. 2017–-19 మధ్య యెస్ బ్యాంక్ అనిల్ అంబానీ గ్రూప్ సంస్థలకు ఇచ్చిన రూ.3 వేల కోట్ల రుణాలను అక్రమంగా దారి మళ్లించారని ఈడీ చెబుతోంది. ఈ అంశంపైన దృష్టి సారించింది. రిలయన్స్ పవర్, రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌లకు ఈ సోదాలు తమ వ్యాపారం, ఆర్థిక పనితీరు, షేర్‌హోల్డర్లపై ఎటువంటి ప్రభావం చూపలేదని తెలియజేశాయి. ఈ ఆరోపణలు రిలయన్స్ కమ్యూనికేషన్ (ఆర్‌కామ్), రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ (ఆర్‌హెచ్‌ఎఫ్‌ఎల్)కు సంబంధించిన 10 ఏళ్ల పాత లావాదేవీలకు సంబంధించినవని పేర్కొన్నాయి. ఈడీ ఆరోపణల ప్రకారం, రుణాల మంజూరుకు ముందు అనిల్ అంబానీ కంపెనీల నుంచి యెస్ బ్యాంక్ ప్రమోటర్లు డబ్బు తీసుకున్నారు. దీనిని ‘లంచం–-రుణం’ కేసుగా ఈడీ దర్యాప్తు చేస్తోంది. యెస్ బ్యాంక్ రుణ ఆమోదాల్లో తీవ్ర ఉల్లంఘనలు, బ్యాక్- డేటెడ్ (డేట్ మార్చిన) క్రెడిట్ మెమోరాండమ్‌లు, డ్యూ డిలిజెన్స్ లేకపోవడం, బ్యాంక్ క్రెడిట్ పాలసీ ఉల్లంఘనలు ఉన్నాయని ఈడీ తెలిపింది.
ఈ రుణాలు రిలయన్స్ గ్రూప్ కంపెనీలు, షెల్ కంపెనీలకు డైవర్ట్ అయినట్లు ఆరోపణలు ఉన్నాయి. నేషనల్ హౌసింగ్ బ్యాంక్, సెబీ, నేషనల్ ఫైనాన్స్ రిపోర్టింగ్ అథారిటీ (ఎన్ఎఫ్‌ఆర్‌ఏ), బ్యాంక్ ఆఫ్ బరోడా రిపోర్ట్‌ల ఆధారంగా సీబీఐ రెండు ఎఫ్‌ఐఆర్‌లు రిజిస్టర్ చేసింది. ఎస్‌బీఐ ఇటీవల ఆర్‌కామ్, అనిల్ అంబానీని ‘ఫ్రాడ్'గా వర్గీకరించింది.
సీబీఐకి ఫిర్యాదు చేసింది. ఆర్‌కామ్–-కెనరా బ్యాంక్ మధ్య రూ.1,050 కోట్ల రుణ మోసం, రిలయన్స్ మ్యూచువల్ ఫండ్ రూ.2,850 కోట్ల ఏటీ-1 బాండ్లలో పెట్టుబడి, రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రూ.10 వేల కోట్ల అప్పులను డైవర్ట్ చేయడం, ఆర్‌హెచ్‌ఎఫ్‌ఎల్‌పై సెబీ రిపోర్ట్‌ను కూడా ఈడీ పరిగణనలోకి తీసుకొని దర్యాప్తు జరుపుతోంది.