నిర్మల్/కాగజ్ నగర్, వెలుగు: వంద రోజుల్లో అందరికీ అక్షరాస్యత కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అమ్మకు అక్షరమాల కార్యక్రమంలో భాగంగా నిర్మల్జిల్లాలో 18 వేల మంది అమ్మలు, అమ్మమ్మలు పరీక్షలు రాశారు. 100 రోజుల నుంచి వీరందరికీ ఆయా స్కూళ్ల పరిధిలోని వాలంటీర్లు బోధన చేపట్టారు. ఇలా శిక్షణ పొందిన వారందరికీ ఆదివారం పరీక్షలు నిర్వహించారు.
పరీక్షా కేంద్రాలను డీఈఓ భోజన్నతో పాటు విద్యాశాఖ అధికారులు సందర్శించారు. ఆసిఫాబాద్జిల్లా కౌటాల మండల వ్యాప్తంగా 20 గ్రామ పంచాయతీల పరిధిలో నిర్వహించిన పరీక్షకు 836 మంది మహిళా సంఘాల సభ్యులు హాజరైనట్టు ఏపీఎం వినేశ్ తెలిపారు.
జగిత్యాల టౌన్, : మెప్మా ఆధ్వర్యంలో చేపట్టిన 'అమ్మకు అక్షరమాల' కార్యక్రమంలో భాగంగా జిల్లాలో అక్షరాస్యత దిశగా అడుగు పడింది. మహిళా సంఘాల ద్వారా గుర్తించిన నిరక్షరాస్యులైన మహిళలకు వాలంటీర్లు చదవడం, రాయడం నేర్పించారు. జిల్లాలోని మున్సిపాలిటీల పరిధిలోని శిక్షణ పూర్తి చేసుకున్న మహిళా సంఘం సభ్యులకు వయోజన విద్య శాఖ ఆధ్వర్యంలో ఆదివారం 'ఉల్లాస్' పరీక్షలను నిర్వహించారు.
ఆదివారం జరిగిన ఈ పరీక్షల్లో జిల్లా వ్యాప్తంగా ఉన్న ఐదు మున్సిపాలిటీల నుంచి సుమారు 900 మంది మహిళలు ఎంతో ఉత్సాహంగా హాజరై తమ అక్షర జ్ఞానాన్ని పరీక్షించుకున్నారు. తాము చదువుకోవడానికి, ఈ స్థాయికి చేరడానికి ఎంతో కృషి చేసి, ప్రోత్సహించిన జిల్లా కలెక్టర్ కు మహిళలు కృతజ్ఞతలు తెలియజేశారు.
