రాష్ట్ర వ్యాప్తంగా 6.31 లక్షల మంది మహిళలకు అక్షరాస్యత పరీక్ష : మంత్రి సీతక్క

రాష్ట్ర వ్యాప్తంగా 6.31 లక్షల మంది మహిళలకు అక్షరాస్యత పరీక్ష : మంత్రి సీతక్క
  •     అక్షరానికి మించిన  ఆయుధం లేదు.. : మంత్రి సీతక్క

హైదరాబాద్, వెలుగు: మహిళల సాధికారతకు అక్షరాస్యతే బలమైన పునాది అనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘అమ్మకు అక్షరమాల’ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతున్నది. ఈ బృహత్తర యజ్ఞంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా సుమారు 7,01,357 మంది మహిళలు అక్షరాలు నేర్చుకుంటున్నారు.ఇటీవల ఆదివారం నిర్వహించిన అక్షరాస్యత పరీక్షకు 6,31,656 మంది మహిళలు (దాదాపు 90 శాతం)హాజరయ్యారు. ఈ పరీక్షా ఫలితాలు ఏప్రిల్ లేదా మే నెలల్లో విడుదల కానున్నాయి. ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన మహిళలు నేరుగా పదో తరగతి పరీక్షలు రాసేందుకు అర్హత సాధిస్తారు. 

ఈ కార్యక్రమం పూర్తిగా స్వచ్ఛంద సేవా దృక్పథంతో సాగుతుండటం విశేషం. గ్రామ స్థాయిలోని వాలంటీర్లు, కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్లు (సీఆర్‌‌‌‌పీ) ముందుకు వచ్చి మహిళలను విద్యావంతులను చేస్తున్నారు. ప్రతి గ్రామంలో 40 నుంచి 60 మంది నిరక్షరాస్య మహిళలను గుర్తించి, వారికి స్థానికంగా ఉన్న 8 నుంచి 10 మంది వాలంటీర్లు శిక్షణనిచ్చారు. 

అక్షరానికి మించిన ఆయుధం లేదని.. మహిళలు చదువుకోవడం ద్వారా తమ జీవితాలను స్వయంగా మార్చుకునే శక్తిని పొందుతారని మంత్రి సీతక్క తెలిపారు. మహిళల ఆర్థికాభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని, రాష్ట్రంలోని కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దాలన్న ప్రభుత్వ సంకల్పానికి ఈ అక్షరాస్యత కార్యక్రమం ఒక బలమైన పునాదిగా మారుతుందని సెర్ప్ సీఈఓ దివ్యా దేవరాజన్ ఆశాభావం వ్యక్తం చేశారు.