బాలిక వీడియో తీసి వైరల్ చేసిన ఇంటి ఓనర్‌పై పోక్సో కేసు

బాలిక వీడియో తీసి వైరల్ చేసిన ఇంటి ఓనర్‌పై పోక్సో కేసు

పటాన్ చెరు సమీపంలోని అమీన్‌పూర్ బాలిక అత్యాచారం కేసు ఊహించని ట్విస్ట్ ఎదురైంది. ఆమెపై అసలు అత్యాచారమే జరగలేదని ఎంక్వైరీలో తేలింది. అయితే ఈ కేసులో ఆ బాలిక తల్లిదండ్రులు వాచ్‌మెన్‌గా పని చేస్తున్న ఇంటి యజమానికి పోలీసులు షాక్ ఇచ్చారు. స్పాట్‌కి వెళ్లి ఆమెను వీడియో తీసి వాట్సాప్, ఫేస్‌బుక్ లాంటి సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేసినందుకు పోక్సో చట్టం కింది కేసు పెట్టారు.

అమ్మాయి కంప్లైంట్ ఇదీ

అమీన్ పూర్ చక్రపురి కాలనీకి చెందిన పదహారేళ్ల బాలిక గురువారం సాయంత్రం తనపై రేప్ జరిగిందంటూ తల్లిదండ్రులకు ఫోన్ చేసింది. తనను గుర్తు తెలియని వ్యక్తులు కారులో కిడ్నాప్ చేసి, పొదల్లోకి తీసుకెళ్లి గ్యాంగ్ రేప్ చేశారని చెప్పింది. దీంతో ఆమె తల్లిదండ్రులు వాచ్‌మెన్ డ్యూటీ చేస్తున్న ఇంటి ఓనర్‌కి విషయం చెప్పడంతో వాళ్లు ఆ స్పాట్‌కి వెళ్లారు. దీనిపై పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు ఆమెను వైద్య పరీక్షలకు పంపారు. అయితే ఆమె అత్యాచారం జరగలేదని డాక్టర్లు తేల్చడంతో పోలీసులకు అనుమానం వచ్చింది. సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేసి, వారు అసలు విషయాలను రాబట్టారు.

అసలు జరిగింది ఇదీ

ఆ బాలిక ఊరి నుంచి పది రోజుల క్రితమే ఇక్కడ ఉంటున్న తల్లిదండ్రుల వద్దకు వచ్చింది. ఆమెకు సిటీ చూడాలన్న ఆశ ఉండేది. కానీ తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడంతో ఇంట్లోనే ఉండేది. అయితే మున్సిపల్ ఎన్నికల్లో తమ ఇంటి యజమాని రవి భార్య పోటీ చేయడంతో ఆ ప్రచారంలో ఆమె కూడా తిరిగింది. ఆ సమయంలో ఈ బాలికకు సందీప్ (22) అనే యువకుడు పరిచయం అయ్యాడు. అతడితో రోజూ ఫోన్‌లో కూడా మాట్లాడేది. దీంతో కలిసి సినిమాకు వెళ్దామని ఆమె ఫోన్ చేయడంతో గురువారం ఉదయం సందీప్ బైక్‌పై మియాపూర్ తీసుకెళ్లి మూవీ చూపించాడు. తిరిగి ఇంటికి వచ్చేప్పటికి మధ్యాహ్నం 3 గంటలకు పైగా కావడంతో ఎక్కడికి వెళ్లావని పేరెంట్స్ తిడుతారన్న భయంతో కాలనీకి దూరంగా బైక్ దిగిపోయింది. రేప్ నాటకమాడి సింపతీ కోసం ప్రయత్నించింది. కానీ పోలీసులు వైద్య పరీక్షలు, సీసీ కెమెరా ఫుటేజీలో వాళ్లు బైక్‌పై వెళ్లడం, వారిద్దరి కాల్ డేటా ఆధారంగా కేసు బూటకమని తేల్చారు.

అడ్డంగా బుక్కైన ఇంటి ఓనర్

రేప్ అని ఆ బాలిక ఫోన్ చేయడంతో ఆమె ఉన్న స్పాట్‌కి వెళ్లిన ఇంటి ఓనర్ అత్యుత్సాహం ప్రదర్శించి అడ్డంగా బుక్కయ్యాడు. ‘రేప్ ఎవరు చేశారు? ఎలా జరిగింది’ అంటూ ఆమెను ప్రశ్నిస్తూ వీడియో తీసి దాన్ని సర్క్యులేట్ చేశాడు. అయితే ఆమె మైనర్ కావడంతో ఇలా వీడియో తీసి వైరల్ చేయడం చట్ట వ్యతిరేకం. దీంతో అతడిపై పోక్సో చట్టం కింద కేసు పెట్టామని పోలీసు అధికారులు చెప్పారు. అలాగే ఆమెను ఇంట్లో తెలియకుండా తీసుకెళ్లినందుకు సందీప్‌పై కూడా కేసు పెట్టామన్నారు. ఆ బాలికకు కౌన్సిలింగ్ ఇచ్చామని తెలిపారు.