బీఆర్ఎస్ హయాంలో రాష్ట్రంలో డ్రగ్స్ దందా : కాంగ్రెస్ ఎంపీ చామల

బీఆర్ఎస్ హయాంలో రాష్ట్రంలో డ్రగ్స్ దందా  : కాంగ్రెస్ ఎంపీ చామల

హైదరాబాద్, వెలుగు: తెలంగాణకు ముంబై పోలీసులు వచ్చి డ్రగ్స్‌‌‌‌‌‌‌‌ను పట్టుకుంటే రాష్ట్ర పోలీసులు ఏం చేస్తున్నారని కేటీఆర్ ప్రశ్నించడంపై కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఫైర్ అయ్యారు. బుధవారం ఆయన గాంధీ భవన్​లో మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ హయాంలో తెలంగాణలో విచ్చలవిడిగా డ్రగ్స్ దందా నడిచిందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే గట్టి నిఘాతో ఎక్కడికక్కడ కేసులు పెట్టి అరెస్టులు చేస్తున్నామని చెప్పారు. 

గ్రూప్ –1పై సీఎం రేవంత్ స్పందించడం లేదని, అసలు ఆయన ఎక్కడున్నారని కేటీఆర్ ప్రశ్నించారని, కేటీఆర్ ప్రశ్న అడిగిన సమయంలో సీఎం సెక్రటేరియెట్​లో విద్యాశాఖపై సమీక్ష చేస్తున్నారని పేర్కొన్నారు. గ్రూప్–1 విద్యార్థులపై కేటీఆర్ విషం కక్కుతున్నరని, వారి ప్రతిభను అవమానిస్తున్నరని.. ఈ విషయంలో కేటీఆర్​పై చర్యలు తీసుకోవాలని రేవంత్ రెడ్డిని కోరుతున్నానన్నారు. బీఆర్ఎస్​కు ఓటేయలేదు, అనుభవించాలని అధికారంలోకి వచ్చిన రోజుల్లోనే కేటీఆర్ నిరుద్యోగులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను గుర్తు చేశారు. కేటీఆర్​కు నిరుద్యోగులపై ఎంత కక్ష ఉందనేది ఆ మాటలతోనే అర్థంమైందన్నారు.