
- 1000 డ్రైవర్, 743 శ్రామిక్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
- అక్టోబర్ 8 నుంచి 28 దాక ఆన్‌లైన్ లో దరఖాస్తు స్వీకరణ
హైదరాబాద్, వెలుగు:తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (టీజీఎస్ఆర్టీసీ)లో 1,743 పోస్టుల భర్తీకి రంగం సిద్ధమైంది. 1,000 డ్రైవర్ పోస్టులు, 743 శ్రామిక్ పోస్టుల భర్తీకి తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ (టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ) బుధవారం నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఆన్‌లైన్ ద్వారా అక్టోబర్ 8 వ తేదీ ఉదయం 8గంటల నుంచి 28వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఆసక్తి గల అభ్యర్థులు www.tgprb.in అధికారిక వెబ్‌సైట్ లో దరఖాస్తు చేసుకోవాలని బోర్డు డైరెక్టర్ వీవీ శ్రీనివాస్ రావు సూచించారు. నియామకాలు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జోన్‌లలో జరగనున్నట్లు తెలిపారు. డ్రైవర్‌కు రూ.20,960–రూ.60,080, శ్రామిక్‌కు గాను రూ.16,550– రూ.45,030 పేస్కేల్ నిర్ధారించారు.
అభ్యర్థులు దరఖాస్తు చేయడానికి అధికారిక నోటిఫికేషన్‌లో పేర్కొన్న అర్హత ప్రమాణాలను తప్పనిసరిగా సరి చూసుకోవాలి. డ్రైవర్ ఉద్యోగానికి 10వ తరగతి లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత, హెవీ మోటార్ వెహికల్(హెచ్‌ఎంవీ) డ్రైవింగ్ లైసెన్స్, సంబంధిత అనుభవం కలిగి ఉండాలి.
శ్రామిక్ పోస్టుకు గాను 8వ తరగతి లేదా 10వ తరగతి ఉత్తీర్ణత, టీజీఎస్ఆర్టీసీ నిర్దేశించిన నిబంధనల మేరకు అర్హతలు ఉండాలి. సాధారణంగా 18 నుంచి 44 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న వారు దరఖాస్తు చేసుకోవచ్చు. రిజర్వేషన్ వర్గాలకు సడలింపులు వర్తిస్తాయి. డ్రైవర్ పోస్టులకు శారీరక దృఢత్వం, డ్రైవింగ్ స్కీల్టెస్ట్ ఉంటాయి. కచ్చితమైన అర్హత వివరాల కోసం అభ్యర్థులు నోటిఫికేషన్‌ను www.tgprb.in వెబ్‌సైట్‌లో డౌన్‌లోడ్ చేసుకోవాలి