ఎలక్ట్రిక్ టూవీలర్ల రేట్లు తగ్గినయ్!

ఎలక్ట్రిక్ టూవీలర్ల రేట్లు తగ్గినయ్!

న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్ వెహికల్స్ వాడకాన్ని భారీగా పెంచాలనే టార్గెట్‌‌తో కేంద్ర ప్రభుత్వం వీటిపై ఇస్తున్న సబ్సిడీని ఏకంగా 50 శాతం పెంచింది. ఇక నుంచి కిలోవాట్ కెసాసిటీ గల ఈ–టూవీలర్‌‌‌‌పై ఫేమ్ స్కీమ్ కింద ఇచ్చే సబ్సిడీ రూ.15 వేలకు చేరింది. చమురు దిగుమతులను, గాలి కాలుష్యాన్ని తగ్గించడం కోసం ఎన్‌‌డీయే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఫలితంగా చాలా ఎలక్ట్రిక్ టూవీలర్ల ధరలు రూ. 70,000 లోపునకు దిగొచ్చాయి. ప్రస్తుత ధరలు రూ.80 వేల నుంచి రూ.1.4 లక్షల వరకు ఉన్నాయి. ఈ ప్రైస్ సెగ్మెంట్లో సాధారణంగా టూవీలర్ల కంపెనీల ఆధిపత్యం ఎక్కువగా ఉంటుంది. ఈవీలను ఎంకరేజ్ చేయడానికి కేంద్రం ఫాస్టర్ అడాప్షన్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ (ఫేమ్–2) స్కీమును 2019 నుండి అమల్లోకి తెచ్చింది. ఈ స్కీమ్‌‌ కింద ఇస్తున్న సబ్సిడీని తాజాగా పెంచింది. తాజాగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల ఈ–టూవీలర్ ఇండస్ట్రీకి తప్పకుండా మేలు జరుగుతుందని సొసైటీ ఆఫ్ మానుఫ్యాక్చరర్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ (ఎస్ఎంఈవీ) డైరెక్టర్ జనరల్ సోహీందర్ గిల్ చెప్పారు. అయితే వచ్చే రెండు-మూడు నెలల్లో అమ్మకాలు తాత్కాలికంగా తగ్గుతాయని, కంపెనీలు ప్రొడక్ట్ మిక్స్, ఇన్వెస్ట్‌‌మెంట్లు, కొత్త టెక్నాలజీలపై పనిచేయడమే ఇందుకు కారణమని  ఎస్‌‌ఎంఈవీ తెలిపింది. 

రివోల్ట్‌‌కు క్రేజ్..

ఫేమ్ సబ్సిడీ పెరిగిన నేపథ్యంలో రివోల్ట్ మోటార్స్ వంటివి తిరిగి బుకింగ్స్‌‌ను మొదలుపెట్టాయి. మైక్రోమాక్స్ ఫౌండర్  రాహుల్ శర్మ ప్రమోట్ చేసిన ఈ సంస్థ కేవలం రెండు గంటల్లో రూ. 50 కోట్ల విలువైన  బుకింగ్స్‌‌ను  సాధించింది.  తమ ఫ్లాగ్‌‌షిప్ బైక్ ఆర్‌‌‌‌వీ 500 బైక్  ధర రూ. లక్ష కన్నా తక్కువగానే ఉంటుంది. సబ్సిడీల వల్ల సేల్స్ పెరగడమే గాక ఆర్ అండ్ డీపైనే ఇన్వెస్ట్‌‌మెంట్లు ఎక్కువ అవుతాయని ఎక్స్‌‌పర్టులు చెబుతున్నారు.  రాబోయే ఐదేళ్ళలో టూవీలర్ మార్కెట్లో ఎలక్ట్రిక్ బైకుల వాటా 30 శాతానికి పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం వీటి వాటా కేవలం ఒక శాతం మాత్రమే ఉంది. 2020–-21లో దేశంలో ఎలక్ట్రిక్ వెహికల్స్ అమ్మకాలు 1,40,000 యూనిట్లుగా ఉన్నాయి.

ఫేమ్ సబ్సిడీ పెరగడంతో ధరలను తగ్గించిన కంపెనీలు..

గ్రీవ్స్ కాటన్  ఈ–మొబిలిటీ ఆర్మ్ ఆంపియర్ వెహికల్స్  ఈ–స్కూటర్ల ధరలను రూ .9 వేల వరకు తగ్గించింది. దీంతో ఆంపియర్  జీల్ మోడల్‌‌ ధర రూ. 60 వేలకు తగ్గింది. మాగ్నస్ ప్రో మోడల్ ధర రూ.74,990 నుండి రూ .65,990లకు దిగొచ్చింది.  సబ్సిడీల వల్ల ఈ–టూవీలర్ల ధరలు సామాన్యుడికీ అందుబాటులోకి వస్తాయని, తమ కస్టమర్ బేస్ పెరుగుతుందని  ఆంపియర్ ఈ– మొబిలిటీ బిజినెస్ (ఈ–టూవీలర్ , త్రీవీలర్)  సీఓఓ రాయ్ కురియన్ అన్నారు. 

రూ.150 కోట్ల ఖర్చుతో ఒకినావా ప్లాంటు

మరో ఈ–టూవీలర్ కంపెనీ ఒకినావా ఆటోటెక్ తన ఈ–టూవీలర్ ధరలను తగ్గించింది. మోడల్ ను బట్టి తగ్గింపులు రూ.7,200 నుంచి రూ.17,800 వరకు ఉన్నాయి. “ఎలక్ట్రిక్ స్కూటర్ల ధరలను తగ్గించడం వల్ల పెట్రోల్ బండ్లు వాడేవాళ్లు ఎలక్ట్రిక్ వెహికల్స్ కొనేందుకు మొగ్గుచూపుతారు. పెట్రోల్ ధరలు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ఈ–వెహికల్స్ కొనడం తెలివైన నిర్ణయం ”అని ఒకినావా ఆటోటెక్ మేనేజింగ్ డైరెక్టర్ జితేందర్ శర్మ అన్నారు. ఒకినావాకు రాజస్థాన్‌‌లో ఈ–టూవీలర్ ప్లాంటు ఉంది. ప్రొడక్షన్‌‌ను పెంచేందుకు ఇక్కడ మరో ప్లాంటు నిర్మాణం కోసం కంపెనీ రూ. 150 కోట్లు పెట్టుబడి పెట్టింది.  ఈ–టూవీలర్ల వాడకాన్ని పెంచేందుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చాలా ముఖ్యమైనదని ఈవీల తయారీ కంపెనీ ఎథర్ ఎనర్జీ సీఈఓ తరుణ్ మెహతా అన్నారు. ఫ్లిప్‌‌కార్ట్ ఫౌండర్లు సచిన్ బన్సాల్,  బిన్నీ బన్సాల్‌‌తో పాటు హీరో మోటోకార్ప్  టైగర్ గ్లోబల్‌‌ వంటి ప్రముఖ ఇన్వెస్టర్లు ఈ కంపెనీలో పెట్టుబడులు పెట్టారు. రాబోయే ఆరు నెలల్లో డిస్ట్రిబ్యూషన్‌‌ను  30 సిటీలకు పెంచాలని ఎథర్ ఎనర్జీ భావిస్తోంది. ఎథర్‌‌‌‌ 450 ప్లస్ ధర సుమారు రూ.1.3 లక్షల వరకు ఉంది. వెస్పా లేదా అప్రిలియా స్కూటర్ల ధరలకు ఇది సమానం. సబ్సిడీ కారణంగా 2025 నాటికి ఎలక్ట్రిక్ టూవీలర్లు వెహికల్స్ అమ్మకాలలో 20–-30శాతం పెరుగుదల ఉంటుందని తరుణ్ అన్నారు.