
- నత్తనడకన సాగుతున్న తాగునీటి రిజర్వాయర్లు, పైప్ లైన్ నిర్మాణాలు
- ఇంకా ప్రారంభం కాని మరికొన్ని పనులు
- వచ్చే ఏడాది జూన్ వరకు గడువుa
కరీంనగర్, వెలుగు : తాగునీటి అవసరాలు తీర్చేలా అమృత్ 2.0 స్కీమ్ కింద ప్రారంభించిన రిజర్వాయర్లు, పైప్ లైన్ పనులు కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ తోపాటు ఇతర మున్సిపాలిటీల్లో నత్తనడకన సాగుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమాన వాటాతో చేపట్టిన ఈ పనులను పూర్తి చేయడంలో కాంట్రాక్టర్లు, ఆఫీసర్లు నిర్లక్ష్యం వహిస్తున్నారు. నిధులు ఉన్నా.. పనులు పూర్తి చేయడం లేదు.
ఈ స్కీమ్ లో చేపట్టాల్సిన కొన్ని పనులను ఇంకా ప్రారంభించనే లేదు. వచ్చే ఏడాది జూన్ వరకు ఈ పనులు పూర్తిచేయాల్సి ఉండగా.. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ తోపాటు చొప్పదండి, హుజురాబాద్, జమ్మికుంట మున్సిపాలిటీల్లో 30 శాతం పనులు కూడా పూర్తి కాలేవు.
రూ.257.20 కోట్ల తో పనులు..
కరీంనగర్ సిటీలో అమృత్ 2.0 కింద తాగునీటి సౌకర్యాన్ని మెరుగుపరిచేందుకు రూ.147 కోట్లతో పనులు చేపట్టారు. తాగునీటితోపాటు సీవరేజీ, పార్కుల అభివృద్ధిని చేపట్టాల్సి ఉంది. ఇందులో భాగంగా కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలో 10 చోట్ల రిజర్వాయర్లు, సంపుల నిర్మాణ పనులు చేపట్టాల్సి ఉంది. కరీంనగర్ ఫిల్టర్ బెడ్ లో 15 లక్షల లీటర్ల క్లియర్ వాటర్ సంపు, ఉజ్వల పార్కులో 45 లక్షల లీటర్ల వాటర్ సంపు, తీగలగుట్టపల్లి 2 బీహెచ్ కే సైట్ సమీపంలో 13 లక్షల లీటర్లు, 17 లక్షల లీటర్ల ట్యాంకులు, సీతారాంపూర్ సాయిబాబా గుడి పక్కన 14 లక్షల లీటర్ల ట్యాంక్ నిర్మాణ పనులు ప్రారంభించారు. రేకుర్తిగుట్ట మీద, ఎల్ఎండీ అలుగునూరులో రిజర్వాయర్ పనులు ఇప్పటివరకు ప్రారంభించలేదు. బల్దియా పరిధిలో 157.95 కిలోమీటర్ల పొడువునా పైపులైన్ వేయాల్సి ఉండగా, 69.54 కి.మీ. మాత్రమే పూర్తయ్యింది.
పనుల్లో జాప్యం..
చొప్పదండి పట్టణంలోని నల్లాలబావి వద్ద అమృత్ 2.0, వాటర్ ఇంప్రూవ్ మెంట్ స్కీం కింద రూ.36.30 కోట్లతో నిర్మించే వాటర్ సంప్, 46.21 కిలోమీటర్ల మేరకు పైప్ లైన్ పనులకు కేంద్రమంత్రి బండి సంజయ్, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఈ ఏడాది జూన్ లో శంకుస్థాపన చేశారు. సంప్ నిర్మాణ పనులు ఇటీవల ప్రారంభించగా, పైప్ లైన్ పనులు పక్కన పెట్టేశారు. కొత్తపల్లిలో రూ.26.15 కోట్లతో మూడు రిజర్వాయర్లు, సంపులు నిర్మించాల్సి ఉండగా, రెండు చోట్ల పనులు ప్రారంభించారు.
32.97 కిలో మీటర్ల పొడవునా పైపులైను వేయాల్సి ఉండగా, 5.48 కిలో మీటర్ల మేర చేశారు. జమ్మికుంటలో రూ.33 కోట్లతో రెండు చోట్ల సంప్‌లు, రిజర్వాయర్ పనులు ప్రారంభించినా చాలా స్లోగా నడుస్తున్నాయి. 44.30 కిలో మీటర్ల పొడవు పైపులైన్ విస్తరించాల్సి ఉండగా, ఇప్పటివరకు 10 కిలోమీటర్ల పనులే పూర్తి చేశారు. హుజురాబాద్ లో 16.25 కోట్లతో రెండు చోట్ల రిజర్వాయర్ పనులు ప్రారంభించారు. పైప్ లైన్ పనులు పూర్తి చేయాల్సి ఉంది.
గడువులోగా పూర్తయ్యేలా చూస్తాం..
అమృత్ 2.0 పనుల్లో జాప్యం వాస్తవమే. అలుగునూరు, రేకుర్తిలో సంప్ పనులు ప్రారంభించాల్సి ఉంది. కాంట్రాక్టర్లను పదేపదే హెచ్చరిస్తున్నాం. వచ్చే ఏడాది జూన్ లోగా పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటాం.- సంపత్ రావు, ఈఈ, పబ్లిక్ హెల్త్, కరీంనగర్