అమృల్లా సలేహ్ సోదరుడిని హత్య చేసిన తాలిబన్లు

 అమృల్లా సలేహ్ సోదరుడిని హత్య చేసిన తాలిబన్లు

ఆఫ్ఘనిస్థాన్ లో తాలిబన్ల అకృత్యాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. అఫ్గాన్‌ను హస్తగతం చేసుకొని..ఆ తర్వాత పంజ్‌షేర్‌లోకి అడుగుపెట్టిన తాలిబన్లు అక్కడ నరమేధం సృష్టిస్తున్నట్లు సమాచారం. అఫ్గాన్‌ మాజీ ఉపాధ్యక్షుడు అమ్రుల్లా సలేహ్‌ సోదరుడు రోహుల్లా సలేహ్‌ను తాలిబన్లు హతమార్చినట్లు సమాచారం. 

ఆగస్టు 15న తాలిబన్లు కాబుల్‌ను ఆక్రమించుకోవడంతో రెసిస్టెన్స్‌ ఫోర్సెస్‌ నాయకుడు అహ్మద్‌ మసూద్‌తో కలిసి అమ్రుల్లా సలేహ్‌ పంజ్‌షేర్‌కు వెళ్లిపోయారు. ఆ తర్వాత తనను తాను అఫ్గాన్‌ ఆపద్ధర్మ అధ్యక్షుడిగా ప్రకటించుకున్నారు. అయితే ప్రస్తుతం పంజ్‌షేర్‌లో ఉన్న అమ్రుల్లా సలేహ్‌ అన్నయ్య రోహుల్లా సలేహ్‌ను గుర్తించిన తాలిబన్లు ఆయనను కిరాతకంగా హత్య చేసినట్లు సమాచారం. ఆ ప్రాంతంలోని అమ్రుల్లా ఇంట్లోకి చొరబడిన తాలిబన్లు రోహుల్లాను కాల్చి చంపినట్లు తెలుస్తోంది.

అంతేకాదు..పంజ్ షీర్ లోయలో రోహుల్లా సలేహ్ కు చెందిన గ్రంథాలయం ఇప్పుడు తాలిబన్ ముష్కరుల వశమైంది. ఈ గ్రంథాలయంలోకి తమ సాయుధులు ప్రవేశించిన ఫొటోలను తాలిబన్ వర్గాలు విడుదల చేశాయి.