- మంచిర్యాల కార్పొరేషన్‌తోపాటు ఐదు మున్సిపాలిటీల్లో కొనసాగుతున్న పనులు
- రూ.305 కోట్ల నిధులు కేటాయించిన ప్రభుత్వం
- చెన్నూర్ సెగ్మెంట్‌పై మంత్రి వివేక్ స్పెషల్ ఫోకస్
- మూడు చోట్ల సమ్మర్‌లోగా పూర్తికానున్న పనులు
- మరో మూడు చోట్ల జూన్ నాటికి పూర్తయ్యే చాన్స్
మంచిర్యాల, వెలుగు: మంచిర్యాల జిల్లాలో అమృత్ 2.0 పనులు స్పీడ్‌గా జరుగుతున్నాయి. మంచిర్యాల కార్పొరేషన్‌తోపాటు బెల్లంపల్లి, మందమర్రి, క్యాతనపల్లి, చెన్నూరు, లక్సెట్టిపేట మున్సిపాలిటీల్లో సుమారు రూ.305 కోట్లతో ఈ పనులు చేపడుతున్నారు. పట్టణ ప్రాంత ప్రజలకు సురక్షితమైన ఫిల్టర్ వాటర్ అందించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో అమృత్ 2.0 స్కీమ్ ప్రారంభించారు.
గత ప్రభుత్వం చేపట్టిన మిషన్ భగీరథ స్కీమ్ ఫెయిల్ కావడంతో ఇప్పుడు మున్సిపాలిటీల్లో తాగునీటి అవసరాలను అమృత్ స్కీమ్ ద్వారా తీర్చడానికి చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా పట్టణాల్లో కొత్తగా విస్తరించిన శివారు కాలనీలకు సైతం వాటర్ సప్లై చేయనున్నారు.
దీంతో ఆయా మున్సిపాలిటీల్లో కొత్తగా వాటర్ ట్యాంకులు నిర్మించడంతో పాటు కొత్త పైపులైన్లు వేసి ప్రతి ఇంటికీ నల్లా కనెక్షన్ ఇవ్వనున్నారు. మంచిర్యాల జిల్లాలో 2024 జూన్‌లో పనులు ప్రారంభించినప్పటికీ కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం కారణంగా స్లోగా కొనసాగుతున్నాయి. దీంతో ఈ ఏడాది జూన్ నాటికి కంప్లీట్ చేయాలనే లక్ష్యంతో పనులు స్పీడప్ చేశారు. చెన్నూర్ నియోజకవర్గంలోని మూడు మున్సిపాలిటీలపై రాష్ట్ర లేబర్, మైనింగ్ మినిస్టర్ డాక్టర్ జి.వివేక్ వెంకటస్వామి స్పెషల్ ఫోకస్ పెట్టి అటు కాంట్రాక్టర్లను, ఇటు అధికారులను పరుగెత్తిస్తున్నారు.
ఇదీ ప్రోగ్రెస్
చెన్నూర్, మందమర్రి, బెల్లంపల్లి మున్సిపాలిటీల్లో అమృత్ 2.0 వర్క్స్ మే నెలాఖరు నాటికి కంప్లీట్ చేసి వాటర్ సప్లై చేయనున్నట్టు కాంట్రాక్టు సంస్థ ప్రతినిధులు తెలిపారు. మంచిర్యాల కార్పొరేషన్‌తోపాటు క్యాతనపల్లి, లక్సెట్టిపేట మున్సిపాలిటీల్లో జూన్‌లోగా పూర్తిచేయడానికి పనులు స్పీడప్ చేశామన్నారు.
- చెన్నూరులో కొత్తగా మూడు ట్యాంకులకు గాను రెండు ట్యాంకుల నిర్మాణం పూర్తయ్యింది. మరో ట్యాంక్ నిర్మిస్తున్నారు. 52 కిలోమీటర్ల పైపులైన్‌కు గాను సగానికి పైగా పనులు పూర్తయ్యాయి.
- మందమర్రి మున్సిపాలిటీలో కొత్తగా ట్యాంకుల నిర్మాణం చేపట్టడం లేదు. 12.20 కిలోమీటర్ల మేర పైపులైన్ నిర్మించాల్సి ఉండగా, ఇప్పటికే దాదాపు 10 కి.మీ. మేర పైపులు వేశారు.
- బెల్లంపల్లి మున్సిపాలిటీలో కొత్తగా చేపట్టిన వాటర్ ట్యాంక్ నిర్మాణం చివరి దశకు చేరింది. ఇక్కడ 35 కిలోమీటర్లు పైపులైన్ వేయాల్సి ఉండగా, సుమారు 20 కి.మీ. పూర్తయింది. మే నెలాఖరులోగా ఈ పనులు కంప్లీట్ కానున్నాయి.
- మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలో కొత్తగా ఒక వాటర్ ట్యాంక్ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. 33 కి.మీ. పైపులైన్ నిర్మించాల్సి ఉండగా, ఇప్పటివరకు 20 కి.మీ. పూర్తయింది. రాళ్లవాగుతో పాటు మరికొన్ని చోట్ల పైపులైన్ పనులు పెండింగ్ ఉన్నాయి. వారం రోజుల్లో 4 కి.మీ. వరకు వాటర్ సప్లై చేయనున్నారు.
- క్యాతనపల్లిలో రెండు వాటర్ ట్యాంకులు నిర్మిస్తున్నారు. 66 కి.మీ. పైపులైన్ వేయాల్సి ఉండగా, సగానికిపైగా పనులు జరిగాయి.
- లక్సెట్టిపేట మున్సిపాలిటీ పరిధిలో మూడు ట్యాంకులకు గాను రెండింటిని నిర్మిస్తున్నారు. మరో ట్యాంక్ పనులు చేపట్టాల్సి ఉంది. 15.50 కి.మీ. పైపులైన్ వేయాల్సి ఉండగా, ఇప్పటివరకు 5 కి.మీ. పనులు జరిగాయి.
