ఫుడ్‌‌‌‌ ప్రాసెసింగ్‌‌‌‌ జోన్లలో ప్లాంట్ల ఏర్పాటుకు నిర్ణయం

ఫుడ్‌‌‌‌ ప్రాసెసింగ్‌‌‌‌ జోన్లలో ప్లాంట్ల ఏర్పాటుకు నిర్ణయం

హైదరాబాద్‌‌‌‌, వెలుగు:  ప్రముఖ డెయిరీ సంస్థ అమూల్‌‌‌‌ రాష్ట్రంలో రూ.500 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న స్పెషల్‌‌‌‌ ఫుడ్‌‌‌‌ ప్రాసెసింగ్‌‌‌‌ జోన్లలో ఈ సంస్థ ప్లాంట్లు పెట్టనుంది. సంస్థ ప్రతినిధులు బుధవారం బేగంపేట క్యాంపు ఆఫీస్‌‌‌‌లో మంత్రి కేటీఆర్‌‌‌‌తో సమావేశమయ్యారు. ఆయన సమక్షంలో పరిశ్రమల శాఖతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు. రాష్ట్రంలో అమూల్‌‌‌‌ పెట్టుబడి పెట్టేందుకు ముందుకు రావడంతో మరో శ్వేత విప్లవం ప్రారంభమైందని మంత్రి కేటీఆర్‌‌‌‌ అన్నారు. తమ ప్రభుత్వం పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు ఇండస్ట్రీ ఫ్రెండ్లీ నిర్ణయాలు తీసుకుంటోందన్నారు. 

రెండు దశల్లో..
రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్న స్పెషల్‌‌‌‌ ఫుడ్‌‌‌‌ ప్రాసెసింగ్‌‌‌‌ జోన్లలలో రెండు దశల్లో రూ.500 కోట్ల పెట్టుబడి పెడుతామని అమూల్‌‌‌‌ సంస్థ ప్రతినిధులు తెలిపారు. మొదట 5 లక్షల లీటర్ల కెపాసిటీతో మొదటి ప్లాంట్‌‌‌‌ ఏర్పాటు చేసి, తర్వాతి దశలో 10 లక్షల లీటర్లకు పెంచుతామని తెలిపారు. బటర్‌‌‌‌ మిల్క్‌‌‌‌, పెరుగు, లస్సీ, పన్నీర్‌‌‌‌, స్వీట్స్‌‌‌‌ ఇక్కడి నుంచి ఉత్పత్తి చేస్తామన్నారు. బేకరీ ప్రొడక్షన్‌‌‌‌ డివిజన్‌‌‌‌ ద్వారా బ్రెడ్‌‌‌‌, బిస్కెట్‌‌‌‌, ఇతర బేకరీ ప్రొడక్ట్స్‌‌‌‌ తయారు చేస్తామని పేర్కొన్నారు. రానున్న18 నుంచి 24 నెలల్లోగా తమ సంస్థ కార్యకలాపాలు ప్రారంభిస్తామని తెలిపారు. ఈ ప్లాంట్‌‌‌‌ ద్వారా 500 మందికి ప్రత్యక్షంగా ఉపాధి దొరుకుతుందని, వేలాది మంది రైతులకు లబ్ధి కలుగుతుందని వివరించారు. తమ సంస్థ ఎండీ డాక్టర్‌‌‌‌ ఆర్‌‌‌‌.ఎస్‌‌‌‌. సోధి త్వరలోనే రాష్ట్రంలో పర్యటిస్తారని, ఆయన పర్యటనలోనే కంపెనీ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తామన్నారు. కార్యక్రమంలో సభార్కంత జిల్లా మిల్క్‌‌‌‌ ప్రొడ్యూసర్స్‌‌‌‌ కో ఆపరేటివ్‌‌‌‌ సొసైటీ యూనియన్‌‌‌‌ ఎండీ బాబుభాయ్‌‌‌‌ ఎం. పటేల్‌‌‌‌, జయేశ్‌‌‌‌ రంజన్‌‌‌‌, అఖిల్‌‌‌‌ తదితరులు పాల్గొన్నారు.