వాళ్లెవరూ ప్రాణాలతో మిగల్లే: ఇండియన్ ఎయిర్ ఫోర్స్

వాళ్లెవరూ ప్రాణాలతో మిగల్లే: ఇండియన్ ఎయిర్ ఫోర్స్

ఏఎన్ 32 విమానం గల్లంతు ఘటనపై ఐఏఎఫ్​ అధికారిక ప్రకటన

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన ఏఎన్​32 విమానం గల్లంతైన ఘటనలో అందులో ప్రయాణించిన వారెవరూ ప్రాణాలతో బయటపడలేదని ఐఏఎఫ్​గురువారం అధికారికంగా ప్రకటించింది. బ్లాక్‌‌ బాక్స్‌‌ కూడా దొరికిందని తెలిపింది. అరుణాచల్ ప్రదేశ్​లోని లిపో ప్రాంతం వద్ద విమానం శకలాలను మంగళవారం గుర్తించిన ఐఏఎఫ్​.. అందులో ప్రయాణించిన 13మంది చనిపోయి ఉంటారని ధృవీకరించింది. ఈ విషయాన్ని ఇప్పటికే వారి కుటుంబ సభ్యులకు తెలియజేసినట్లు తెలిపింది.

జూన్ 3న మధ్యాహ్నం 12.35 గంటలకు అస్సాంలోని జోర్హాత్ నుంచి అరుణాచల్ ప్రదేశ్​లోని మెన్​చుకా ఏయిర్ పోర్టుకు బయలుదేరిన ఏఎన్​32 విమానం..30 నిమిషాల తర్వాత గల్లంతైంది. ఆ సమయంలో విమానంలో 13 మంది ఐఏఎఫ్ సిబ్బంది ఉన్నారు. ఈ విమానం ఆచూకీ కోసం సుఖోయ్ 30, ఏఎన్ 32, సీ 130 జె, పీ 8ఐ ఏయిర్ క్రాఫ్ట్ లు, ఎమ్​ఐ 17, ఏఎల్ హెచ్ వంటి అధునాతన హెలికాఫ్లర్లతో గాలించగా… ఈ నెల 11న అరుణాచల్​బార్డర్​లోని లిపో నుంచి16 కిలోమీటర్ల దూరంలో సమద్ర మట్టానికి 12వేల అడుగుల ఎత్తులోని కొండపైన ఏఎన్ 32 విమానం శకలాలు గుర్తించారు. అప్పటినుంచి ప్రతికూల వాతావరణంలో రెండ్రోజుల పాటు అందులో ప్రయాణించిన వారికోసం అన్వేషించారు. అయినా 13మందిలో ఎవరి ఆచూకీ లభించలేదు. ఈ పరిస్థితుల్లో వారంతా ప్రాణాలతో ఉండే అవకాశం లేదని అధికారులు ప్రకటించారు.

అమరులైన జవాన్లు వీరే
ఏఎన్ 32 విమానంలో అమరులైన 13మందికి నివాళులర్పించిన ఐఏఎఫ్.. చనిపోయిన వారి పేర్లు వెల్లడించింది. వింగ్ కమాండర్ జీఎం చార్లెస్, స్క్వాడ్రన్ లీడర్ హెచ్ వినోద్, ఫ్లైట్ లెఫ్టినెంట్లు ఎల్​ఆర్ థాపా, ఎమ్​కే గార్గ్, ఆశిశ్​ తన్వార్, సుమిత్ మహంతి, వారెంట్ ఆఫీసర్ కేకే మిశ్రా, సెర్జంట్ అనూప్ కుమార్, కార్పొరల్ శెరిన్, లీడింగ్ ఎయిర్ క్రాఫ్ట్ మెన్ ఎస్​కే సింగ్, పంకజ్, నాన్ కంబాటెంట్స్ రాజేశ్​కుమార్, పతాలి.