చెన్నూరులో ఏటీసీ..మంత్రి వివేక్ వెంకటస్వామి చొరవతో మంజూరు

చెన్నూరులో ఏటీసీ..మంత్రి వివేక్ వెంకటస్వామి చొరవతో మంజూరు
  •     రూ.47.11 కోట్లతో బిల్డింగ్ నిర్మాణానికి భూమిపూజ
  •     వచ్చే అకాడమిక్ ఇయర్​లో అడ్మిషన్లు
  •     చెన్నూర్, కోటపల్లి, జైపూర్, వేమనపల్లి మండలాల స్టూడెంట్స్ కు అందుబాటులోకి సాంకేతిక విద్య
  •     జిల్లాలో ఐదుకు చేరిన ఏటీసీల సంఖ్య

మంచిర్యాల, వెలుగు: మంచిర్యాల జిల్లా చెన్నూర్ నియోజకవర్గంలో అడ్వాన్స్డ్​​ టెక్నాలజీ సెంటర్(ఏటీసీ) మంజూరైంది. స్థానిక ఎమ్మెల్యే, కార్మిక, గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి జిల్లా ఇన్​చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి సోమవారం ఏటీసీ బిల్డింగ్ నిర్మాణానికి భూమిపూజ చేశారు. ఏటీసీ నిర్మాణానికి చెన్నూర్ తహసీల్దార్ ఆఫీస్ సమీపంలో ఎకరం గవర్నమెంట్ ల్యాండ్ కేటాయించారు. 

అధికారులు మరో ఎకరం భూమి కేటాయించాలని కోరగా మంత్రి సానుకూలంగా స్పందించారు. రూ.47.11 కోట్లతో ఏటీసీ బిల్డింగ్ తో పాటు అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్, క్లాస్ రూమ్స్, లైబ్రరీ నిర్మించనున్నారు. ఇందులో 86.75 పర్సెంట్ షేర్​ టాటా టెక్నాలజీస్ లిమిటెడ్(టీటీఎల్)ది కాగా, మిగతా 13.25 శాతం రాష్ట్ర ప్రభుత్వం భరిస్తోంది. త్వరలోనే టెండర్లు నిర్వహించి పనులు ప్రారంభించడానికి చర్యలు తీసుకుంటున్నారు. ఈ ఏడాది ఆగస్టులోగా నిర్మాణ పనులు పూర్తి చేసి వచ్చే అకాడమిక్ ఇయర్ లో అడ్మిషన్లు చేపట్టనున్నారు. 

అందుబాటులోకి సాంకేతిక విద్య 

చెన్నూర్ లో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ ఏర్పాటుతో ఈ ప్రాంత విద్యార్థులకు మెరుగైన సాంకేతిక విద్య అందుబాటులోకి రానుంది. చెన్నూర్, జైపూర్, కోటపల్లితో పాటు బెల్లంపల్లి సెగ్మెంట్​లోని వేమనపల్లి మండల స్టూడెంట్లకు సైతం ఇది అనుకూలంగా ఉంటుంది. పారిశ్రామిక రంగంలో వస్తున్న నూతన టెక్నాలజీకి అనుగుణంగా పరిశ్రమలకు అవసరమైన సాంకేతిక నిపుణుల కొరత ఏటీసీల ద్వారా తీరనుంది. 

దూర ప్రాంతాలకు వెళ్లి చదువుకునే పరిస్థితి లేని మారుమూల గ్రామీణ విద్యార్థులకు ఏటీసీ ఏర్పాటు వరం లాంటిది. మంత్రి వివేక్ వెంకటస్వామి గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఈ ప్రాంత యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ మేరకు చెన్నూర్ లో ఏటీసీ మంజూరుతో యువతకు స్కిల్ డెవలప్​మెంట్ ట్రైనింగ్ అందనుంది. దీంతో వారికి వివిధ పరిశ్రమల్లో మెరుగైన ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఉంది. 

జిల్లాలో ఐదో ఏటీసీ 

మారుతున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా విద్యార్థుల్లో నైపుణ్యాలను పెంపొందించడానికి రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా తొలి విడతలో 65 ఏటీసీలను సాంక్షన్ చేసింది. ఇందులో మంచిర్యాల జిల్లాలో 2025–26 విద్యా సంవత్సరంలో నాలుగు ఏటీసీలను ప్రారంభించారు. ప్రస్తుతం మంచిర్యాల, నస్పూర్, మందమర్రి, జన్నారంలో నడుస్తున్నాయి. చెన్నూర్ లో ఏర్పాటయ్యే ఏటీసీతో కలిపి జిల్లాలో వీటి సంఖ్య ఐదుకు చేరింది. 

ఏటీసీల్లో వర్చువల్ అనాలసిస్ అండ్ డిజైనర్, సీఎన్సీ మెషినింగ్ టెక్నీషియన్, మెకానిక్ ఎలక్ట్రిక్ వెహికల్, ఇంజనీరింగ్ డిజైన్ టెక్నీషియన్, ఇండస్ట్రియల్ రోబోటిక్స్ అండ్ డిజిటల్ మాన్యుఫ్యాక్చర్ టెక్నీషియన్, మాన్యుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ కంట్రోల్ అండ్ ఆటోమేషన్ టెక్నీషియన్ వంటి ఆధునిక కోర్సులు ఆఫర్ చేస్తున్నారు. చెన్నూర్​లో ఏసీటీ ఏర్పాటుతో ఈ ప్రాంత విద్యార్థులు, తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

వచ్చే విద్యా సంవత్సరంలో అడ్మిషన్లు

మంత్రి వివేక్ వెంకటస్వామి చొరవతో చెన్నూరులో ఏటీసీ మంజూరైంది. దీంతో ఈ ప్రాంత విద్యార్థులకు ఆధునిక సాంకేతిక విద్య అందుబాటులోకి రానుంది. నిర్మాణ పనులు వచ్చే ఆగస్టులోగా పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటున్నారు.  2026–27 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు చేపట్టి తరగతులు నిర్వహించేలా ప్లాన్​చేస్తున్నాం. 
- వై. రమేశ్, ఐటీఐ, ఏటీసీ జిల్లా కోఆర్డినేటర్