
న్యూఢిల్లీ: జీఎస్టీకి సంబంధించిన వివాదాల పరిష్కారం కోసం అప్పిలేట్ ట్రిబ్యునల్ ఏర్పాటుకానుంది. ఇందుకోసం ఫైనాన్స్ బిల్లులో మార్పులు చేయడానికి లోక్‌సభ శుక్రవారం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. అప్పీలేట్ ట్రిబ్యునల్ లేకపోవడంతో పన్ను చెల్లింపుదారులు హైకోర్టులలో రిట్ పిటిషన్లు దాఖలు చేయాల్సి వస్తోంది. లోక్‌సభ ఆమోదించిన ఫైనాన్స్ బిల్లు 2023లో ప్రతిపాదించిన సవరణల ప్రకారం, ప్రతి రాష్ట్రంలోనూ జీఎస్టీ అప్పీలేట్ ట్రిబ్యునల్ బెంచ్‌లు ఏర్పాటు అవుతాయి.
ఢిల్లీలో ప్రధాన బెంచ్ ఉంటుంది. జీఎస్‌టీ అమల్లోకి వచ్చి ఐదేళ్లు దాటినా అప్పిలేట్ ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేయలేదు. ఫలితంగా జీఎస్టీకి సంబంధించిన వివాదాలు పరిష్కారం కావడం లేదు. అప్పీలేట్ ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేయడం వల్ల హైకోర్టులపై, సుప్రీంకోర్టులపై భారం తగ్గుతుంది. పన్ను చెల్లింపుదారుల సమస్యలు కూడా త్వరగా పరిష్కారమవుతాయని ఎక్స్పర్టులు చెబుతున్నారు.