
బెంగళూరులోని ఓ షాపింగ్ మాల్ సిబ్బంది తీరుపై పెను దుమారం రేగింది. ధోతీ ధరించాడన్న కారణంగా ఒక పెద్దాయనను షాపింగ్ మాల్లోకి అనుమతించకపోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆ పెద్దాయన కొడుకు ఈ విషయమై షాపింగ్ మాల్ సిబ్బందితో వాగ్వాదానికి దిగిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. బెంగళూరులోని జీటీ మాల్లో ఈ ఘటన జరిగింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.. బెంగళూరులో ఉంటున్న ఒక యువకుడు ఊరి నుంచి వచ్చిన తన తండ్రిని జీటీ మాల్కు తీసుకెళ్లాడు. జీటీ మాల్లో తన తండ్రితో కలిసి సినిమా చూద్దామనుకున్నాడు. ఊరి నుంచి వచ్చిన తన తండ్రికి బెంగళూరు సిటీ తళుకుబెళుకులను చూపించాలని భావించడమే ఆ యువకుడు తప్పనట్టుగా షాపింగ్ మాల్ సిబ్బంది ప్రవర్తించారు. మాల్ ఎంట్రన్స్లోనే తండ్రీకొడుకులను సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు.
మాల్లో ఉన్న మల్టీప్లెక్స్లో సినిమా చూసేందుకు టికెట్లు కూడా బుక్ చేసుకున్నామని చెప్పినా సెక్యూరిటీ సిబ్బంది వినిపించుకోలేదు. ఎందుకు అనుమతించడం లేదని అడిగితే ధోతీ ధరించి మాల్లోకి రాకూడదని, దుస్తులు మార్చుకుని వస్తే అనుమతిస్తామని మాల్ సెక్యూరిటీ సిబ్బంది బదులిచ్చారు. చాలా దూరం నుంచి వచ్చామని, అంత దూరం వెళ్లి మళ్లీ తిరిగి రావడం కష్టమని, అనుమతించాలని ఆ పెద్దాయన బతిమాలినా మాల్ సిబ్బంది పట్టించుకోలేదు. ధోతీ ధరించి వస్తే అనుమతించకూడదని మేనేజ్మెంట్ నుంచి స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయని మాల్ సూపర్వైజర్ చెప్పుకొచ్చాడు. ప్యాంట్ ధరిస్తేనే మాల్లోకి అనుమతిస్తామని సెక్యూరిటీ సిబ్బంది ఒకరు తేల్చి చెప్పారు. దీంతో.. ఆ పెద్దాయన కొడుకుకు చిర్రెత్తుకొచ్చి మాల్ సిబ్బందితో వాగ్వాదానికి దిగాడు. తన తండ్రి ఒక రైతు అని, రైతులు అలాంటి దుస్తులు ధరించడంలో తప్పేం ఉందని నిలదీశాడు. దాదాపు అరగంట సేపు వాదించినా మాల్ సిబ్బంది ఆ తండ్రీకొడుకులను షాపింగ్ మాల్లో అడుగు కూడా పెట్టనీయలేదు. దీంతో.. తీవ్ర నిరాశతో ఆ యువకుడు, అతని తండ్రి వెనుదిరిగి వెళ్లిపోయారు.
ALSO READ : హల్వా తయారు చేసిన ఆర్థికమంత్రి నిర్మల సీతారామన్
ఈ ఘటనపై ఖండనలతో సోషల్ మీడియా హోరెత్తింది. షాపింగ్ మాల్ సిబ్బంది తీరును మెజార్టీ నెటిజన్లు తీవ్రంగా తప్పుబట్టారు. దేశానికి వెన్నెముక లాంటి రైతుకు తన వస్త్రధారణ కారణంగా ఇలాంటి అవమానం జరగడం అత్యంత బాధాకరమని నెటిజన్లు ట్వీట్ చేశారు. షాపింగ్ మాల్ చేసిన తప్పుకు ప్రతిఫలంగా ఆ పెద్దాయనకు సంవత్సరం పాటు ఫ్రీ మూవీ పాస్ ఇవ్వాలని ఒక నెటిజన్ డిమాండ్ చేశాడు. ఆ పెద్దాయన సొంతూరు కర్నాటకలోని హవేరి జిల్లాలోని రాణేబెన్నూరు తాలూకాలో ఉన్న ఆరెమల్లాపూర్ గ్రామం. వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. తన కొడుకు నాగార్జున బెంగళూరులో ఉద్యోగ రీత్యా ఉంటుండటంతో చూసి వెళ్లేందుకు సిటీకి వెళ్లాడు. తన తండ్రి రాకరాక బెంగళూరుకు వచ్చాడని భావించిన నాగార్జున షాపింగ్ మాల్కు తీసుకెళ్లి సినిమా చూపించాలని, సిటీ కల్చర్ను పరిచయం చేయాలని చూడగా ఈ చేదు అనుభవం ఎదురైంది. ఇంత జరిగినా ఈ ఘటనపై జీటీ మాల్ యాజమాన్యం స్పందించకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.