కొడుకు పట్టించుకోవట్లేదని.. వృద్ధురాలి ఆత్మహత్యాయత్నం

కొడుకు పట్టించుకోవట్లేదని.. వృద్ధురాలి ఆత్మహత్యాయత్నం

కరీంనగర్ క్రైం, వెలుగు: కన్నకొడుకు ఆదరణ కరువై.. కోడలి వేధింపులు భరించలేక ఓ వృద్ధురాలు ఆత్మహత్యకు యత్నించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..వేములవాడలో నివాసం ఉంటున్న లచ్చవ్వ(90) భర్త చనిపోవడంతో కొడుకుకు ఆ ఉద్యోగం వచ్చింది. ప్రస్తుతం సిరిసిల్లలోని బీసీ హాస్టల్లో పనిచేస్తున్నాడు. లచ్చవ్వకు వస్తున్న రూ. 10 వేల పింఛన్ తీసుకుంటున్న కొడుకు ఆమెను ఆదరించకపోవడం, కోడలు సైతం వేధిస్తుండడంతో జీవితంపై విరక్తి చెందింది.

ఆత్మహత్య చేసుకుందామని లోయర్ మానేరు డ్యామ్ నీటిలోకి నడుచుకుంటూ వెళుతోంది. గమనించిన లేక్ పోలీసులు అక్కడికి చేరుకుని ఆమెను రక్షించారు. అనంతరం ఆమె కొడుకును పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చి అప్పగించారు. తల్లిబాగోగులు చూసుకోవాలని, ఇలాంటి సంఘటన పునరావృతం అయితే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.