వెటర్నరీ వర్సిటీలో అక్రమాలపై ఎంక్వైరీ వేయాలి

వెటర్నరీ వర్సిటీలో అక్రమాలపై ఎంక్వైరీ వేయాలి
  • అభ్యర్థులు, నిరుద్యోగుల డిమాండ్‌‌
  • రూల్స్​కు విరుద్ధంగా నియమించారని ఆరోపణ
  • బోగస్ సర్టిఫికెట్లతో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలు
  • ఇంట్లో కూర్చోబెట్టి జీతం ఇస్తున్నరు

హైదరాబాద్‌‌, వెలుగు: పీవీ నరసింహారావు వెటర్నరీ యూనివర్సిటీలో ప్రొఫెసర్‌‌ ఉద్యోగాల భర్తీలో అవకతవకలు జరిగాయని వాటిపై దర్యాప్తు చేయాలని అభ్యర్థులు, నిరుద్యోగులు డిమాండ్‌‌ చేస్తున్నారు. వర్సిటీ వైస్‌‌ చాన్స్​లర్‌‌ పదవీకాలం ఈ నెల 17న పూర్తవుతుండగా రూల్స్​కు విరుద్ధంగా తనకు కావాల్సిన వారికి  ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలిచ్చారనే ఆరోపణలు వస్తున్నాయి. 

గత బీఆర్ఎస్​ప్రభుత్వం ప్రత్యేక అనుమతితో వెటర్నరీ వర్సిటీలో చేపట్టిన నియామకాలను నిలిపివేయాలనీ, 2018లో చేపట్టిన నియామకాలనూ పునఃసమీక్షించాలని, ఈ మొత్తం నియామకాలపై సిట్టింగ్ జడ్జితో ఎంక్వైరీ చేపట్టాలనే డిమాండ్‌‌ వ్యక్తమవుతున్నది. ఎస్సీ, ఎస్టీ, బీసీ బ్యాక్​లాగ్ పోస్టుల సంఖ్యను తేల్చాలనీ, హారిజంటల్ రోస్టర్ సిస్టమ్ అమలు చేయాలని కొత్త చట్టాన్ని అమలులోకి తీసుకొచ్చి ఖాళీగా ఉన్న అసిస్టెంట్‌‌ ప్రొఫెసర్‌‌ పోస్టులను భర్తీ చేయాలని కోరుతున్నారు.

టర్మినేట్‌‌ చేసిన జీవోతో ఉద్యోగాలు..

జీవో నంబరు 420 ప్రకారం చేపట్టిన నియామకాలను హైకోర్టు టర్మినేట్ చేసింది. అయితే ఆ జీవో ప్రకారం వెటర్నరీ యూనివర్సిటీలో నియామకాలు చేపట్టడంపై అభ్యర్థుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి ప్రత్యేక అనుమతి తీసుకొని నియామకాలు చేపట్టడంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. దీనిపై కొందరు హైకోర్టును ఆశ్రయించారు. ఇంత జరుగుతుంటే మరోవైపు యూనివర్సిటీ వీసీ తన పదవీవిరమణ లోపు అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి.

ఫేక్‌‌ సర్టిఫికెట్లతో పోస్టింగ్‌‌.. ఇంట్లో కూర్చోబెట్టి జీతం

నెట్ సర్టిఫికెట్ లేని అభ్యర్థులకు మార్కులు కేటా యించి అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగం ఇచ్చారని వర్సిటీపై విమర్శలు ఉన్నాయి. నకిలీ నెట్‌‌ సర్టిఫికెట్ సమర్పించిన అభ్యర్థిపై ఫిర్యాదు రావడంతో పోలీసు ఎంక్వైరీలో నకిలీ అని తేల్చారు. అయితే ఆ అభ్యర్థిపై ఎలాంటి కేసులు పెట్టకుండా సస్పెన్షన్‌‌ చేసి చేతులు దులుపుకున్నారనే విమర్శలు ఉన్నాయి. ఈ సస్సెండ్‌‌ అయిన వ్యక్తికి రెండేండ్లుగా టర్మినేట్‌‌ చేయుకుండా ఇంట్లో కూర్చోబెట్టి జీతాలు చెల్లిస్తున్నారని వర్సిటీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. రిజర్వేషన్లలోనూ ప్రభుత్వ రూల్స్ పాటించలేదనే ఆరోపణలు ఉన్నాయి. ఎత్తున అక్రమాలకు పాల్పడ్డారని... కర్నాటక, ఆంధ్రా రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులకు ఉద్యోగాలు ఇచ్చారని ఆరోపిస్తున్నారు.

వీసీ చేపట్టే నియామకాలు నిలిపేయాలి

బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వెటర్నరీ యునివర్సిటీలో జరిగిన అక్రమ నియామకాలపై ఎంక్వైరీ చేపట్టాలి. నకిలీ నెట్ సర్టిఫికెట్​లతో ఉద్యోగాలు పొందిన వారిని తొలగించాలి. టర్మ్ అయిపోతుందనగా వీసీ చేపట్టే నియామకాలు నిలిపి వేయాలి.
- చరణ్ కౌశిక్ యాదవ్, పీసీసీ జనరల్ సెక్రటరీ