- మూడున్నరేళ్ల కింద స్మార్ట్ సిటీ ఫండ్స్ రూ.16 కోట్లతో పనులు
- వాటిని పూర్తిగా ఖర్చు చేయకుండానే మళ్లీ ఎస్బీఎం 2.0 నిధులు రూ.2 కోట్లతో మళ్లీ టెండర్
- మున్సిపల్ అధికారుల తీరు, నిధుల వినియోగంపై అనుమానాలు
కరీంనగర్, వెలుగు: కరీంనగర్ స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో భాగంగా మానేరు తీరంలోని డంపింగ్ యార్డులో చేపట్టిన బయోమైనింగ్ ప్రాసెస్‌ను సదరు కాంట్రాక్ట్ ఏజెన్సీ పూర్తి చేయకముందే.. మరో స్కీమ్ కింద విడుదలైన నిధులతో టెండర్ నోటిఫికేషన్ జారీ చేయడం వివాదాస్పదంగా మారింది. బయోమైనింగ్ కోసం స్మార్ట్ సిటీ ప్రాజెక్టు కింద రూ.16 కోట్లు కేటాయించిన విషయం తెలిసిందే.
కాంట్రాక్ట్ ఏజెన్సీ, ఆఫీసర్ల నిర్లక్ష్యం కారణంగా ఈ నిధుల్లో సగం కూడా సద్వినియోగం కాలేదనే విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే స్వచ్ఛ భారత్ మిషన్ 2.0 కింద మరో రూ.2 కోట్లతో బయోమైనింగ్ కోసం టెండర్ నోటిఫికేషన్ జారీ చేయడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
రూ.16 కోట్లు కేటాయించినా చెత్త సాఫ్ కాలే..
కరీంనగర్– రామగుండం బైపాస్‌లో మానేరు నదీ తీరాన తొమ్మిది ఎకరాల్లో డంపింగ్ యార్డు విస్తరించి ఉంది. దశాబ్దాలుగా ఈ యార్డులో పేరుకుపోయిన చెత్తను తొలగించి.. మానేరు తీరాన్ని అందంగా తీర్చిదిద్దేందుకు కరీంనగర్ స్మార్ట్ సిటీ ప్రాజెక్టు కింద రూ.16 కోట్లతో 2022 జూన్‌లో బయో మైనింగ్ ప్రారంభించారు. అగ్రిమెంట్ ప్రకారం.. ఏడాదిలోనే డంప్ యార్డ్ లో పేరుకుపోయిన చెత్త నుంచి మట్టి, ప్లాస్లిక్ వేరు చేయాలని, సేంద్రియ ఎరువులు కూడా ఉత్పత్తి చేయాలని నిర్ణయించారు. మొత్తం చెత్తను తొలగించి పార్కుగా అభివృద్ధి చేయాలని భావించారు.
కానీ ప్రారంభించిన ఏడాదికే బయో మైనింగ్ ప్రక్రియ నిలిచిపోయింది. చాలాసార్లు ప్రారంభించడం, ఆగిపోవడం పరిపాటిగా మారింది. ఇప్పటికే ఏడాదిగా బయోమైనింగ్ ముందుకు సాగడం లేదు. మెషినరీ కూడా పనిచేయడం లేదని తెలిసింది. సంబంధిత కాంట్రాక్ట్ ఏజెన్సీకి ఇప్పటికే 40 శాతం మేర బిల్లులు చెల్లించగా.. ఇప్పటికే స్మార్ట్ సిటీ ప్రాజెక్టు కాలపరిమితి కూడా ముగియడంతో మిగతా నిధుల విడుదలపై గందరగోళం నెలకొంది.
మరోవైపు కరీంనగర్ సిటీ నుంచి రోజూ సుమారు 150 నుంచి 180 మెట్రిక్ టన్నుల చెత్త వచ్చి చేరుతోంది. ఎండాకాలంలో డంప్ యార్డ్ కు నిప్పంటించడం ద్వారా చెత్తను తగ్గించే ప్రయత్నాలు చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. దీంతో చుట్టుపక్కల జనం ఊపిరాడక ఇబ్బందులు పడాల్సి వస్తోంది.
మళ్లీ ఎస్బీఎం 2.0 నిధులతో మళ్లీ టెండర్
స్వచ్ఛ భారత్ మిషన్(అర్బన్) 2.0 కింద రూ.2 కోట్ల తో డంపింగ్ యార్డును బయోమైనింగ్ ద్వారా క్లియర్ చేసేందుకు తాజాగా టెండర్ నోటిఫికేషన్ విడుదల చేశారు. సకాలంలో బయోమైనింగ్ పూర్తి చేయకపోవడమేగాక స్మార్ట్ సిటీ నిధులు వృథా అయ్యేలా వ్యవహరించిన గత కాంట్రాక్ట్ ఏజెన్సీపై ఎలాంటి చర్యలు తీసుకోకపోగా.. మళ్లీ కొత్తగా మరో సంస్థకు బయోమైనింగ్‌ను అప్పగించేందుకు అధికారులు సిద్ధం కావడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
నెరవేరని కేంద్ర మంత్రి హామీ..
కరీంనగర్ లో ఈ ఏడాది జనవరిలో పర్యటించిన కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ మానేరు ఒడ్డున ఉన్న డంపింగ్ యార్డును పరిశీలించారు. కరీంనగర్ ప్రజలను తీవ్రంగా వేధిస్తున్న డంపింగ్ యార్డును కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్, రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ అభ్యర్థన మేరకు యార్డును క్లియర్ చేసేందుకు ఎన్ని కోట్లయినా వెచ్చిస్తామని హామీ ఇచ్చారు కానీ నెరవేర్చలేదు. తాజాగా మంగళవారం హైదరాబాద్‌కు వచ్చిన కేంద్ర మంత్రిని బీజేపీ నేత, మాజీ మేయర్ సునీల్ రావు మరోసారి కలిసి సిటీలో డంప్ యార్డు ప్రక్షాళనకు నిధులను విడుదల చేసి... స్థానిక ప్రజల సమస్యలను తీర్చాలని కోరారు.
