రెండు ప్యాకేజీలుగా.. గ్రీన్ ఫీల్డ్ హైవే ..ఆర్మూర్ టు మంచిర్యాల హైవే పనులకు టెండర్లు పిలిచిన NHAI

రెండు ప్యాకేజీలుగా.. గ్రీన్ ఫీల్డ్ హైవే ..ఆర్మూర్ టు మంచిర్యాల హైవే పనులకు టెండర్లు పిలిచిన NHAI
  • ప్యాకేజీ–1 కింద ఆర్మూర్ టు జగిత్యాల  
  • ప్యాకేజీ –2  కింద జగిత్యాల టు మంచిర్యాల  
  • వచ్చే నెలలో టెండర్లు ఫైనల్.. మార్చిలో పనులు స్టార్ట్ 
  • కాంట్రాక్ట్ సంస్థలకు రెండున్నరేండ్లు గడువు విధింపు 
  • ధర్మపురి, మెట్ పల్లి వద్ద రెండు టోల్ గేట్లు ఏర్పాటు 
  • మంచిర్యాల, ఆర్మూర్ మధ్య తగ్గనున్న 10 కి.మీ  దూరం

మంచిర్యాల, వెలుగు : నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్ నుంచి మంచిర్యాల వరకు గ్రీన్ ఫీల్డ్ హైవే(ఎన్ హెచ్– 63) ను రెండు ప్యాకేజీలుగా విభజించి నిర్మాణ పనులు చేపట్టేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆర్మూర్ నుంచి మంచిర్యాల వరకు రెండు ప్యాకేజీల్లో మొత్తం132 కిలోమీటర్ల మేర రూ.4,838 కోట్లతో నిర్మించ నుంది.  

ప్యాకేజీ–1 కింద ఆర్మూర్– జగిత్యాల(64 కి.మీ), ప్యాకేజీ–2 కింద జగిత్యాల– మంచిర్యాల(68 కి.మీ) వరకు పనులకు ఎన్ హెచ్ఏఐ(నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా) ఇప్పటికే టెండర్లను పిలిచింది. డిసెంబర్ లో ఫైనల్ చేయనుంది. 2026, మార్చిలో నిర్మాణాన్ని ప్రారంభించేందుకు ఎన్ హెచ్ఏఐ అధికారులు ప్రణాళికలు రూపొందించారు. పనులు దక్కించుకున్న కాంట్రాక్ట్ సంస్థలు రెండున్నరేండ్లలో  పూర్తి చేయాలనే నిబంధన ఉంది. 

రూ.4,850 కోట్లతో 132 కిలోమీటర్ల నిర్మాణం

ఆర్మూర్ – జగిత్యాల వరకు రూ.2,338 కోట్లకు టెండర్ పిలవగా..  ఇప్పటికే 288.3 హెక్టార్ల భూమిని, అదేవిధంగా జగిత్యాల – మంచిర్యాల వరకు రూ.2,500 కోట్లు వెచ్చిస్తుండగా..  దీనికి 317 హెక్టార్ల ల్యాండ్  సేకరించారు. ప్యాకేజీ–1లో హైబ్రిడ్ యాన్యుటీ మోడల్(హ్యామ్), ప్యాకేజీ–2లో ఇంజనీరింగ్ ప్రొక్యూర్ మెంట్ కన్ స్ట్రక్షన్(ఈపీసీ) సిస్టమ్ కింద నిర్మించనున్నారు. 60 కి.మీకు ఒక టోల్ గేట్ ను ఏర్పాటు చేస్తారు. ఒకటి  మెట్ పల్లి వద్ద, ఇంకొకటి ధర్మపురి సమీపంలో రానుంది. 

ప్యాకేజీ–1లో 16 ప్రాంతాల్లో 32 కిలోమీటర్ల సర్వీస్ రోడ్లు,15 అండర్ పాస్ లు, బైపాస్ లను అంకాపూర్, మోర్తాడ్, కమ్మర్ పల్లి, మేడిపల్లి, మెట్ పల్లి, కోరుట్లలో నిర్మించనున్నారు. ప్యాకేజీ–2లో 10 ప్రాంతాల్లో 14 కిలోమీటర్ల సర్వీస్ రోడ్లు,15 అండర్ పాస్ లతో పాటు జగిత్యాల, ధర్మపురి, లక్సెట్టిపేట, మంచిర్యాల వద్ద బైపాస్ లు రానున్నాయి. 

క్యాతన్ పల్లి వద్ద ఎన్ హెచ్–363కు లింక్ 

ఎన్ హెచ్–63లో భాగంగా మంచిర్యాలలో దాదాపు 10 కిలోమీటర్లు బైపాస్ రోడ్డు రానుంది. జగిత్యాల నుంచి ముల్కల్ల వరకు 58 కి.మీ గ్రీన్ ఫీల్డ్ హైవే కాగా.. ముల్కల్ల నుంచి క్యాతన్ పల్లి వరకు 10 కి.మీ బైపాస్ నిర్మించి ఎన్ హెచ్ –363కి అనుసంధానిస్తారు. అక్కడ్నుంచి శ్రీరాంపూర్ జీఎం ఆఫీస్ జంక్షన్ వద్ద తిరిగి ఎన్ హెచ్ –63తో లింక్ కలుపుతారు. 

ఫోర్ లేన్ హైవేను ఒక మీటరు కంటే ఎత్తులో నిర్మిస్తారు. దీంతో వాహనాలు ఎక్కడంటే అక్కడ రోడ్డుపైకి రావడానికి వీలు ఉండదు.  సర్వీస్ రోడ్ల ద్వారా మాత్రమే హైవే పైకి చేరుకోవాల్సి ఉంటుంది.  

ఎనిమిదేండ్లుగా ఎదురుచూపు 

నిజామాబాద్ జిల్లా బోధన్ నుంచి చత్తీస్ గఢ్ లోని జగదల్ పూర్ వరకు ఎన్ హెచ్–63 విస్తరించి ఉంది. దీనిపై ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉండే ఆర్మూర్ నుంచి మంచిర్యాల వరకు 132 కి.మీ గ్రీన్ ఫీల్డ్ హైవేను కేంద్రం 2017లో మంజురు చేసింది. భూసేకరణ సమస్యలు, రైతుల నుంచి అభ్యంతరాలు రావడంతో పలుమార్లు అలైన్ మెంట్ మార్చారు. 

ఒకసారి గ్రీన్ ఫీల్డ్ హైవే అని, మరోసారి బ్రౌన్ ఫీల్డ్ హైవే అని పేర్కొనడంతో గందరగోళం ఏర్పడింది. చివరకు మూడో అలైన్ మెంట్ ను ఆమోదిస్తూ గ్రీన్ ఫీల్డ్ హైవేకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. దీంతో ఎనిమిది ఏండ్లుగా ఆలస్యమైంది. ఎట్టకేలకు రోడ్డు నిర్మాణానికి టెండర్లు ఆహ్వానించడంతో స్థానిక ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.