- గుజరాత్ ఉమార్గావ్ గ్యాంగ్‌గా తేల్చిన పోలీసులు
- ఎల్ఎల్బీ, బీబీఏ చదివి చోరీల బాట
- ఇప్పటికే పలు రాష్ట్రాల్లోని కాలేజీల్లో దొంగతనాలు
- ఎత్తులకు పైఎత్తులతో తప్పించుకునే ప్లాన్లు
- చిత్తు చేసిన రాచకొండ పోలీస్
ఎల్బీనగర్, వెలుగు : రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బ్రిలియంట్ ఇంజినీరింగ్ కాలేజీలో అక్టోబర్ 10న జరిగిన చోరీ కేసును రాచకొండ పోలీసులు ఛేదించారు. ఎక్కడో గుజరాత్ నుంచి వచ్చిన ముఠా బ్రిలియంట్ కాలేజీ అల్మారాలోని విద్యార్థుల ఫీజులకు సంబంధించిన రూ. కోటి ఏడు లక్షలను ఎత్తుకెళ్లింది. ఎల్ఎల్బీ, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ చదివిన ఈ గ్యాంగ్‌లోని ఇద్దరు మెంబర్స్‌తో పాటు మరికొందరు తప్పిం చుకోవడానికి ఎన్నో ఎత్తులు వేశారు. సినిమా సీన్లకు ఏ మాత్రం తగ్గని రీతిలో ప్లాన్లు అమలు చేశారు. సీసీ టీవీ డీవీఆర్ ఎత్తుకువెళ్లారు.
బస్సులు, ఆటోలు, క్యాబ్‌లు మారుతూ సంబంధం లేని రాష్ట్రానికి వెళ్లి దృష్టి మళ్లించారు. కాలేజీ నాగర్‌కర్నూల్‌జిల్లా కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డిది కావడం, భారీ నగదు పోవడంతో పోలీసులు కేసును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. సుమారు 20 మంది నాలుగు బృందాలుగా ఏర్పడి నిందితుల కోసం మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో గాలించారు. వెయ్యికి పైగా సీసీ కెమెరాలను జల్లెడ పట్టి గుజరాత్ లోని ఉమర్గావ్ గ్యాంగ్ మెంబర్లను అరెస్ట్ చేశారు. కొట్టేసిన డబ్బుల నుంచి రూ. 37,05,000 నగదు స్వాధీనం చేసుకున్నారు. ఆ వివరాలను ఎల్బీనగర్ డీసీపీ ఆఫీసులో మంగళవారం డీసీపీ అనురాధ వెల్లడించారు.
దొంగలు బీబీఏ, ఎల్ఎల్బీ స్టూడెంట్స్..
గుజరాత్ రాష్ట్రానికి చెందిన రాజ్ మనోహర్ పవార్ (22)బీబీఏ స్టూడెంట్. మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన విద్యార్థి రితిక్ అలియాస్ రితిక్ మోహిత్ (24)బీఏ ఎల్ఎల్ బీ విద్యార్థి. గుజరాత్ కి చెందిన దినేష్ మోహిత్ (27), మధ్యప్రదేశ్ కి చెందిన అరుణ్ మోహిత్ (18), మహారాష్ట్రకి చెందిన విలాస్ చౌహాన్ (22), మరో మైనర్(16) అంతా సమీప బంధువులు..వీరందరికీ కేంద్రం గుజరాత్‌లోని ఉమర్గావ్. చదువుకుంటూనే దూరపు రాష్ట్రాల్లోని శివారు కాలేజీల్లో దొంగతనాలు చేయడం వృత్తిగా పెట్టుకున్నారు. ఎక్కువగా క్రైమ్ ఇన్వెస్టిగేషన్ సినిమాలు చూసి తప్పించుకోవడానికి అందులోని పద్ధతులు ఫాలో అయ్యేవారు. ఇప్పటికే వీరు పలు రాష్ట్రాల్లోని కాలేజీలను కొల్లగొట్టిన అనుభవం ఉంది. అందులో భాగంగా అక్టోబర్ రెండో వారంలో నగరంలో చోరీలకు స్కెచ్ వేశారు.
ముందు ఉమర్గావ్లో మీటింగ్....
నిందితులందరూ ముందుగా గుజరాత్‌లోని వల్సాద్ జిల్లాలోని ఉమర్గావ్ లో సమావేశమయ్యారు. అక్టోబర్ రెండో వారంలో హైదరాబాద్‌లో చోరీ చేయాలనుకున్న కాలేజీలను గూగుల్ చేశారు. గుజరాత్‌లోని వాప్పి నుంచి ముంబయికి, అక్కడి నుంచి ఔరంగాబాద్‌కు బయలుదేరారు. 2025 అక్టోబర్ 8న స్లీపర్ బస్సులో హైదరాబాద్ లోని మియాపూర్ లో దిగారు. లింగంపల్లి రైల్వే స్టేషన్‌లో స్నానం చేసి..జూపార్క్ కు ఆటోలో వచ్చి సమీపంలోని దుకాణంలో ఫింగర్‌ప్రింట్స్ పడకూడదని హ్యాండ్ గ్లవ్స్ కొన్నారు. గూగుల్ మ్యాప్ చూసి తట్టి అన్నారంలోని ఉండే శ్రేయాస్ కాలేజీకి వెళ్లారు. అక్కడ భద్రతా సిబ్బందిని చూసి చోరీ చేయలేమని భావించి వెనకడుగు వేశారు.
నెక్ట్స్టార్గెట్‘బ్రిలియంట్’
ప్లాన్ బిలో భాగంగా బాటసింగారంలోని బ్రిలియంట్ ఇంజినీరింగ్ కాలేజీని ఎంచుకున్నారు. ఆ కాలేజీ సమాచారాన్ని గూగుల్ నుంచి సేకరించారు. ఈ క్యాంపస్ఆవరణలో మొత్తం మూడు కాలేజీలు ఉండడంతో తమకు అనుకూలంగా ఉంటుందని గుర్తించారు. ఆటోలో కాలేజీకి వెళ్లి చూడగా కేవలం ఇద్దరు సెక్యూరిటీ గార్డులు మాత్రమే బయట గేటు దగ్గర కనిపించారు. దీంతో వారి కళ్లు గప్పి అర్ధరాత్రి 12 గంటలకు లోపలకు ప్రవేశించారు. అడ్మిన్ బ్లాక్‌లోని గ్రిల్, డోర్ లాక్ పగలగొట్టి అల్మారాలోని దాదాపు రూ.1.07 కోట్ల నగదును చోరీ చేశారు.
తాళం పగలగొట్టినందుకు రూ.2 వేలు ఎక్స్ట్రా
అల్మారాలో రూ.500, రూ.200, రూ.100 కట్టలతో పాటు రూ. 10, 20 నోట్ల కట్టలు కూడా కనిపించాయి. కేవలం రూ. 500, రూ.200, రూ.100 బండిల్స్ మాత్రమే తీసుకున్నారు. ఇందులోంచి దినేష్ రూ.17,85,000, అరుణ్ రూ.17,83,000, రాజ్ మనోహర్ పవార్ రూ.17,83,000, రితిక్ రూ.17,83,000, విలాస్ చోహన్ రూ.17,83,000 తీసుకున్నారు. దినేశ్ తాళం పగలగొట్టినందుకు రూ.2 వేలు ఎక్కువ షేర్ తీసుకున్నాడు. మిగిలిన రూ. 10, 20 కట్టలను మోసుకెళ్లలేక చెల్లాచెదురుగా పడేశారు. వెళ్లేప్పుడు సీసీ టీవీ డీవీఆర్ఎత్తుకెళ్లారు. ముందు పెద్ద అంబర్‌పేట వెళ్లారు. అక్కడి నుంచి ట్రావెల్స్ బస్సు ఎక్కి నాగార్జున సాగర్ చేరుకున్నారు. అక్కడి నుంచి ఆటోలో గుంటూరుకు, తర్వాత విజయవాడకు వెళ్లారు. మళ్లీ స్లీపర్ బస్సులో విజయవాడ నుంచి ముంబైకి వెళ్లారు. ఇలా వాహనాలు మారుతూ దొరక్కుండా ఉండేందుకు ప్రయత్నం చేశారు.
రాచకొండ పోలీసా..మజాకా
భారీ చోరీ గురించి తెలుసుకున్న సీపీ సుధీర్ బాబు..సివిల్, సీసీఎస్, ఐటీ సెల్, ఎస్వోటీ పోలీసులతో కలిసి స్పెషల్టీమ్స్ఏర్పాటు చేశారు. డీవీఆర్ పోవడంతో పోలీసులకు ఏ ఆధారమూ దొరకలేదు. ఎలాగైనా కేసు చేధించాలనే పట్టుదలతో దర్యాప్తు కొనసాగించారు. అందులో భాగంగా దొంగతనం జరిగిన కొద్ది సేపటికి పెద్ద అంబర్‌పేటలో ముగ్గురు అనుమానాస్పదంగా బస్సెక్కుతున్న ఫుటేజీ సంపాదించగలిగారు. ఇక అక్కడి నుంచి పరిశోధన వేగవంతం చేశారు.
సుమారు వెయ్యికి పైగా సీసీ కెమెరాలను జల్లెడ పట్టారు. కేవలం కాలేజీల్లోనే దొంగతనాలు చేసే ముఠాలు ఎక్కడున్నాయో అని వివరాలు సేకరించారు. దర్యాప్తులో భాగంగా గుజరాత్, హర్యానా, మధ్యప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలకు వెళ్లారు. తమకు సీసీ టీవీ ఫుటేజీల్లో దొరికిన ఫొటోలను అక్కడి పీఎస్‌లకు పంపించి ఆరా తీశారు. కాలేజీల్లో చోరీలు చేసి శిక్ష అనుభవిస్తున్న ఖైదీలను.. నిందితుల గురించి ఆరా తీశారు.ఈ క్రమంలో వారికి క్లూ దొరికింది. దాని ఆధారంగా ఆరా తీస్తే గుజరాత్‌లోని ఉమర్గావ్కు చెందిన గ్యాంగ్పని అని తేలింది. తర్వాత గ్యాంగ్‌లోని రాజ్ మనోహర్ పవర్, రితిక్, మైనర్‌ను అదుపులోకి తీసుకున్నారు. మిగతా వారు పరారు కాగా గాలిస్తున్నారు.
నిద్రాహారాలు మాని..
గ్యాంగ్‌ను పట్టుకోవడానికి పోలీసులు చాలా శ్రమించాల్సి వచ్చింది. కొన్ని రోజులైతే నిద్రాహారాలు మానుకుని దొంగల కోసం వెతికారు. కొన్ని సార్లు ప్రయాణాల్లోనే తెల్లవారేది. స్పెషల్ టీమ్స్‌ను డీసీపీ అనురాధ కో ఆర్డినేట్ చేశారు. దినేష్ మోహితే, అరుణ్ మోహితేపై గుజరాత్, మహారాష్ట్రలో కేసులు ఉన్నాయని డీసీపీ చెప్పారు. వనస్థలిపురం ఏసీపీ కాశిరెడ్డి, మీర్‌పేట్ డీఐ, అబ్దుల్లాపూర్‌మెట్ ఎస్‌హెచ్‌వో, సీసీఎస్, ఐటీ సెల్ ఇన్స్ స్పెక్టర్లు ఈ దర్యాప్తులో పాల్గొన్నారు.
